త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Story of 24 Akbar Road | 24 అక్బర్‌ రోడ్‌ చరిత్ర తెలుసా..? మ‌య‌న్మార్ నేత సూకీ బాల్యం గడిచింది ఇక్కడే..!

The Story of 24 Akbar Road | కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వ ఎస్టేట్ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్‌లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని మార్చి 28లోగా ఖాళీ చేయాలని అధికారిక నోటీసు ఇచ్చింది. దాదాపు 48 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఈ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది.

P

National | Published On Mar 28, 2026, 3.36 pm IST

The Story of 24 Akbar Road | 24 అక్బర్‌ రోడ్‌ చరిత్ర తెలుసా..? మ‌య‌న్మార్ నేత సూకీ బాల్యం గడిచింది ఇక్కడే..!
Advertisement
  • కాంగ్రెస్‌ పార్టీకి క్లిష్ట సమయాల్లో ఉపయోగపడ్డ కార్యాలయం
  • భవనానికి రూపకల్పన చేసిన సర్ ఎడ్విన్ లూటియన్స్
  • స్వాతంత్ర్యం తర్వాత బర్మాహౌస్‌గా మార్పు
  • ఇక్కడ రాజీవ్‌, సంజీవ్‌ గాంధీతో క‌లిసి ఆడుకున్న‌ సూకీ
  • కేంద్రం నోటీసులతో కాంగ్రెస్‌ కార్యాలయంపై చర్చ

The Story of 24 Akbar Road | కాంగ్రెస్ పార్టీకి కేంద్ర ప్రభుత్వ ఎస్టేట్ విభాగం కీలక ఆదేశాలు జారీ చేసింది. న్యూ ఢిల్లీలోని 24, అక్బర్ రోడ్‌లో ఉన్న పార్టీ కార్యాలయాన్ని మార్చి 28లోగా ఖాళీ చేయాలని అధికారిక నోటీసు ఇచ్చింది. దాదాపు 48 సంవత్సరాలుగా కాంగ్రెస్ ఈ కార్యాలయం నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అయితే, ఈ ఏడాది ప్రారంభంలోనే పార్టీ తన ప్రధాన కార్యాలయాన్ని కోట్లా రోడ్డులోని 9ఏ వద్ద ఉన్న ‘ఇందిరా భవన్’కు మార్చింది. అయినప్పటికీ, అక్బర్ రోడ్ కార్యాలయంలో ఇప్పటికీ కీలక సమావేశాలు జరుగుతున్నాయి. గత ఏడాది కాంగ్రెస్ తన కొత్త ప్రధాన కార్యాలయాన్ని కోట్లా రోడ్డులో ప్రారంభించింది. అయినప్పటికీ, 24 అక్బర్ రోడ్ కార్యాలయాన్ని ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలో ఎస్టేట్ విభాగం నోటీసులు ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

24 అక్బర్ రోడ్ చరిత్ర ఇదే..

న్యూ ఢిల్లీలోని 24 అక్బర్ రోడ్ భవనం బ్రిటిష్ పాలన సమయంలో నిర్మించింది. ఆధునిక ఢిల్లీకి రూపకర్తగా పేరొందిన సర్ ఎడ్విన్ లూటియన్స్ దీన్ని రూపకల్పన చేశారు. రాష్ట్రపతి భవన్ (అప్పటి వైస్రాయ్ హౌస్), కర్తవ్య పథ్ (అప్పటి కింగ్స్‌వే) తదితర నిర్మాణాల్లో ఆయన కీలక పాత్ర పోషించారు. ఢిల్లీలోని కేంద్ర ప్రాంతం సుమారు 26 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణాన్ని లూటియన్స్ రూపకల్పన చేయడంతో ఆ ప్రాంతం ‘లూటియన్స్ ఢిల్లీ’గా ప్రసిద్ధి చెందింది. 1911 నుంచి 1925 మధ్య నిర్మించిన ఈ బంగ్లా ‘టైప్ VII’ శైలిలో ఉంటుంది. బ్రిటిష్ వలస శైలి, ఆధునిక నిర్మాణ శైలుల మేళవింపుగా ఇది నిలిచింది. ప్రారంభంలో ఈ భవనంలో ఐదు బెడ్‌రూములు, లివింగ్-డైనింగ్ హాల్, అతిథి గది, కొన్ని అవుట్‌హౌస్‌లు మాత్రమే ఉండేవి. మొదట ఈ భవనం వైస్రాయ్ లార్డ్ లిన్‌లిత్‌గో ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు సర్ రెజినాల్డ్ మాక్స్‌వెల్ నివాసంగా ఉపయోగించుకున్నారు. స్వాతంత్ర్యం అనంతరం మయన్మార్‌ (బర్మా) రాయబారి డాక్టర్‌ ఖిన్‌కీ కేటాయించారు. ఆమె గౌరవార్థం అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ దీనికి ‘బర్మా హౌస్’గా పేరు పెట్టారు. ఆమె కూతురు, నోబెల్‌ పురస్కారం గ్రహీత, మయన్మార్‌ నాయకురాలు ఆంగ్‌ సాన్‌ సూకీ తన బాల్యంలో కొంతకాలం ఇక్కడే గడిపారు. ఈ బంగ్లాలోనే సూకీ జపనీస్ పుష్పాల అలంకరణ కళ ‘ఇకెబానా’ నేర్చుకుంది. అలాగే రాజీవ్ గాంధీ, సంజయ్ గాంధీలతో కలిసి ఈ భవనం తోటల్లో ఆడుకుంది.

కాంగ్రెస్‌కు ఈ భవనం ఎలా దక్కింది?

ఇందిరా గాంధీ 1958లో కాంగ్రెస్ అధ్యక్షురాలిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత 1959లో పార్టీకి 7 జంతర్ మంతర్ భవనం కార్యాలయంగా కేటాయించారు. అయితే, 1969లో కాంగ్రెస్ విభజన జరిగిన సమయంలో మోరార్జీ దేశాయ్ నేతృత్వంలోని కాంగ్రెస్ (ఓ) ఆ కార్యాలయాన్ని స్వాధీనం చేసుకుంది. దీంతో 1971లో కాంగ్రెస్ కొత్తగా 5 రాజేంద్ర ప్రసాద్ రోడ్‌ను ప్రధాన కార్యాలయంగా ఏర్పాటు చేసుకుంది. ఎమర్జెన్సీ అనంతరం 1977లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం చవిచూసింది. బాబు జగ్జీవన్ రామ్ నేతృత్వంలో పార్టీ విభజన జరగడంతో కాంగ్రెస్ 5 రాజేంద్ర ప్రసాద్ రోడ్ కార్యాలయాన్ని కూడా కోల్పోయింది. ఈ దశలో కాంగ్రెస్‌కు స్థిరమైన కార్యాలయం లేకుండా పోయింది. అదే సమయంలో ఇందిరా గాంధీకి అధికారిక నివాసం లేకపోయింది. మొహమ్మద్ యూనస్ తన 12 విల్లింగ్డన్ క్రెసెంట్ బంగ్లాను గాంధీ కుటుంబానికి నివాసంగా ఇచ్చాడు. అక్కడ ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్, ప్రియాంక, సంజయ్ గాంధీ, మేనకా గాంధీ నివాసం ఉన్నారు. అయితే, అది నివాసంగా మారడంతో పార్టీ సమావేశాలు నిర్వహించడానికి వీలు లేకపోయింది.

కొత్త కార్యాలయం కోసం వెతుకులాట

ఈ సమయంలో బూటా సింగ్, ఇతర నేతలు కొత్త కార్యాలయం కోసం అన్వేషణ ప్రారంభించారు. మార్గరెట్ చందశేఖర్, కమలాపతి త్రిపాఠి ఇళ్లను పరిశీలించారు. అయితే, కమలాపతి త్రిపాఠి ఇంట్లో ప్రతిరోజూ జరిగే హవన్ కార్యక్రమాలతో ఆ ఇంటిని కార్యాలయంగా ఉపయోగించాలనే ఆలోచనను వదిలేశారు. ఆ తర్వాత బూటా సింగ్ 24 అక్బర్ రోడ్‌ను ఎంపిక చేశారు. అప్పటికి అది తెలంగాణకు చెందిన రాజ్యసభ సభ్యుడు జీ వెంకటస్వామికి కేటాయించారు. యువ కాంగ్రెస్ నాయకులు తరచూ ఉపయోగించే ఈ భవనాన్ని వెంకటస్వామి ఇందిరా గాంధీకి మద్దతుగా పార్టీకి ఇచ్చారు. 1978 జనవరిలో ఇందిరా గాంధీ నేతృత్వంలో సుమారు 20 మంది కార్యకర్తలు ఈ భవనంలోకి ప్రవేశించారు. అదే రోజు నుంచి ఇది కాంగ్రెస్ అధికారిక ప్రధాన కార్యాలయంగా మారింది. ఈ కార్యాలయం నుంచే ఇందిరా గాంధీ పార్టీని పునర్నిర్మించి 1980 ఎన్నికల్లో ఘన విజయం సాధించి మళ్లీ ప్రధాని అయ్యారు. తర్వాత ఈ భవనం కాంగ్రెస్‌కు ప్రతీకగా మారింది. ఇందిరా గాంధీ నివాసమైన 1 సఫ్దర్‌జంగ్ రోడ్‌కు ఇది కేవలం 2 కిలోమీటర్ల దూరంలో ఉండేది. అలాగే ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో రాజకీయ విభాగానికి ఎదురుగా ఉండటం విశేషం. ఈ భవనం రాజీవ్ గాంధీ నుంచి సోనియా గాంధీ వరకు మొత్తం ఏడు మంది కాంగ్రెస్ అధ్యక్షులు పని చేశారు. 1984లో ఇందిరా గాంధీ హత్య అనంతరం రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యారు. 1991లో పీవీ నరసింహారావు ప్రభుత్వం, 2004- 2009లో మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల సమయంలో కూడా ఈ కార్యాలయం కీలకంగా నిలిచింది. 24 అక్బర్ రోడ్ కార్యాలయం 10 జనపథ్‌తో ఒక చిన్న ద్వారం ద్వారా అనుసంధానమై ఉండేది. 10 జనపథ్ తర్వాత సోనియా గాంధీ నివాసంగా మారింది.

వివాదాలకు కేంద్రబిందువుగా..

2004లో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు మరణించిన సమయంలో ఆయన పార్థివదేహాన్ని 24 అక్బర్ రోడ్ ప్రాంగణంలోకి అనుమతించకపోవడం వివాదాస్పదమైంది. ఆయన భౌతికకాయాన్ని బయటే ఉంచి ప్రజలు నివాళులు అర్పించారు. సోనియా గాంధీతో ఉన్న విభేదాలే దీనికి కారణమని కొన్ని వర్గాలు పేర్కొన్నాయి. 1990లో కాంగ్రెస్ ఓటముల అనంతరం సోనియా గాంధీని పార్టీ అధ్యక్షురాలిగా చేయాలని పలువురు నేతలు ఒత్తిడి తెచ్చారు. అప్పటి అధ్యక్షుడు సీతారాం కేసరి రాజీనామా చేయాలని కోరినా ఆయన నిరాకరించారు. దీంతో 1998 మార్చి 14న జరిగిన సమావేశంలో ఆయనను తప్పించి సోనియా గాంధీని అధ్యక్షురాలిగా నియమించారు. ఈ సమయంలో పార్టీ కార్యాలయంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కాలక్రమేణా ఈ భవనంలో అనేక గదులు, నిర్మాణాలు పెరిగాయి. తొలుత ఎనిమిది గదులు మాత్రమే ఉన్న ఈ బంగ్లా తర్వాత 34 గదుల వరకు విస్తరించింది. ఈ నిర్మాణాల్లో చాలా అధికారిక నిబంధనలకు విరుద్ధంగా జరిగాయని ఆరోపణలు ఉన్నాయి. అయినప్పటికీ వరుస ప్రభుత్వాలు వాటిని పట్టించుకోలేదని చెబుతారు. 2025 జనవరిలో కాంగ్రెస్ కోట్లా రోడ్డులో ‘ఇందిరా గాంధీ భవన్’ పేరుతో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించింది. అయినప్పటికీ, 24 అక్బర్ రోడ్‌ను ఖాళీ చేయకుండా సమావేశాల కోసం ఉపయోగించుకోవాలని నిర్ణయించుకుంది. బీజేపీ పాత కార్యాలయాన్ని ఖాళీ చేయలేదని కాంగ్రెస్ నేతలు పేర్కొంటున్నారు. కేంద్రం జారీ చేసిన నోటీసుపై కాంగ్రెస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement