త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka High Court | సోష‌ల్ మీడియా పోస్టులు.. విచార‌ణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేయ‌డ‌మేంటి..?

Karnataka High Court | పోలీసుల తీరుపై క‌ర్ణాట‌క హైకోర్టు (Karnataka High Court) అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై (Social Media Posts) ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా యంత్రాల్లాగా ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేసి అరెస్టు చేయ‌డాన్ని తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది.

D

National | Published On Oct 23, 2026, 4.54 pm IST

Karnataka High Court | సోష‌ల్ మీడియా పోస్టులు.. విచార‌ణ లేకుండా యంత్రాల్లా ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేయ‌డ‌మేంటి..?
Advertisement
  • ఒకే కేసులో ఏడు ఎఫ్ఐఆర్‌లు న‌మోదు చేయ‌డంపై క‌ర్ణాట‌క హైకోర్టు అస‌హ‌నం
  • పోలీసు శాఖ‌కు కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు

Karnataka High Court | త్రినేత్ర న్యూస్ : పోలీసులు సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులపై (Social Media Posts) ఎలాంటి ప్రాథమిక విచారణ జరపకుండా యంత్రాల్లాగా ఎఫ్‌ఐఆర్‌లు (FIRs) నమోదు చేయడాన్ని కర్ణాటక హైకోర్టు (Karnataka High Court) తీవ్రంగా త‌ప్పుబ‌ట్టింది. ఈ మేర‌కు భ‌విష్య‌త్తులో ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృతం కాకుండా పోలీసు శాఖ‌కు కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

ఇంత‌కీ ఏం జ‌రిగిందంటే..?

పుత్తూరులో ఓ మహిళను కొందరు యువకులు కత్తితో బెదిరించి, కారులో వెంబడించిన ఘ‌ట‌న తీవ్ర క‌ల‌క‌లం రేపింది. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించిన వార్తను ప‌లు మీడియా సంస్థ‌లు రిపోర్ట్ చేశాయి. ఆ వార్త‌ను సందీప్ కుమార్ అనే నెటిజ‌న్‌ కూడా రీపోస్ట్ చేశారు. అయితే, ఆయ‌న చేసిన పోస్టు మ‌త క‌ల‌హాల‌ను సృష్టించేలా ఉందంటూ నిందితుల్లో ఒక‌రు పోలీసుల‌కు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సందీప్‌పై ఎఫ్ఐఆర్ న‌మోదు చేశారు. ఈ వ్య‌వ‌హారంలో ఆయ‌న‌పై మొత్తం ఏడు ఎఫ్ఐఆర్‌లు న‌మోద‌య్యాయి.

అందులో త‌ప్పేముంది.. కోర్టు

ఈ కేసుపై ఎమ్. నాగప్రసన్న నేతృత్వంలోని సింగిల్ బెంచ్ విచార‌ణ జ‌రిపింది. విచార‌ణ సంద‌ర్భంగా సందీప్ చేసిన పోస్టు సృష్టించిన‌ది కాద‌ని ప‌బ్లిక్ డొమైన్‌లో ఉన్న వార్త‌ను మాత్ర‌మే ఆయ‌న షేర్ చేశార‌ని పిటిష‌న‌ర్ త‌ర‌ఫున న్యాయ‌వాది గిరీశ్ భ‌ర‌ద్వాజ్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన కోర్టు.. పోలీసుల తీరుపై తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. సమాజంలో జరుగుతున్న వాస్తవ ఘటనలపై సోషల్ మీడియాలో పోస్టులు పెడితే తప్పేంటని ప్రశ్నించింది. ఆ పోస్టులో ఏ ఒక్క మతానికో లేదా వర్గానికో వ్యతిరేకంగా రెచ్చగొట్టే పదాలు లేవని స్పష్టం చేసింది. సోషల్ మీడియాలో ఇప్పటికే పబ్లిక్ డొమైన్‌లో ఉన్న వార్తను పంచుకోవడం నేరం కాదని తేల్చి చెప్పింది. పిటిషనర్ స్వయంగా ఆ పోస్ట్‌ను సృష్టించలేదని, కేవలం వార్తను మాత్రమే షేర్ చేశారని గుర్తించింది. ఈ మేర‌కు అత‌డిపై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ను కొట్టివేసింది. అదేవిధంగా ఎఫ్ఐఆర్‌ల న‌మోదుపై పోలీసు శాఖ‌కు కీల‌క మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

  • చ‌ట్టంలోని నిబంధ‌న‌ల‌ను యంత్రాల్లా కాకుండా.. సోషల్ మీడియా పోస్టులపై వచ్చే ఫిర్యాదుల్లోని ఆరోప‌ణ‌లను పోలీసులు ప్రాథ‌మికంగా ప‌రిశీలించాలి.
  • ఒకే సంఘ‌ట‌న‌పై ఇప్ప‌టికే కేసు న‌మోదైతే.. ఫిర్యాదుదారుడు వేరొక‌రు అనే కార‌ణంతో మ‌ళ్లీ కొత్త‌గా ఎఫ్ఐఆర్ న‌మోదు చేయ‌కూడ‌దు.
  • అవసరమైన సందర్భాల్లో నిబంధ‌న‌ల ప్ర‌కారం కేసు నమోదు చేయడానికి ముందు ప్రాథమిక విచారణ చేపట్టాలి. అయితే, కేసు నమోదు చేయకుండా తప్పించుకునేందుకు దీనిని దుర్వినియోగం చేయకూడదు.
  • ఎఫ్‌ఐఆర్ నమోదైనంత మాత్రాన నిందితులను స్వయంచాలకంగా అరెస్ట్ చేయకూడదు. పోలీసులు BNSS సెక్షన్ 35 నిబంధనలను, సుప్రీంకోర్టు మార్గదర్శకాలను తూచా తప్పకుండా పాటించాలి.
  • ఈ మార్గదర్శకాలన్నింటినీ రాష్ట్రంలోని పోలీసు అధికారులందరికీ చేరేలా కర్ణాటక డీజీపీ తగిన చర్యలు తీసుకోవాలి.

Also Read..

వందేమాత‌రం ఓ మతపరమైన యుద్ధ గేయం : మాజీ ఐఏఎస్ అధికారి

1100 కాల్ చేస్తే.. మీ ఇంటికే మీ సేవ స‌ర్టిఫికెట్‌లు

క్యూర్ పరిధిలో లక్ష ఇళ్ల నిర్మాణమే లక్ష్యం.. యుద్ధ ప్ర‌తిపాదిక‌న స్థ‌లాలు గుర్తించాలి

Advertisement
Advertisement