త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Uttar Pradesh polls | మేం బిచ్చ‌గాళ్లం కాదు.. యూపీ ఎన్నిక‌ల వేళ ఇండీ కూట‌మిలో భ‌గ్గుమ‌న్న విభేదాలు

Uttar Pradesh polls | ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల (Uttar Pradesh polls) నేప‌థ్యంలో మిత్ర‌ప‌క్షాలైన స‌మాజ్ వాదీ పార్టీ (Samajwadi Party), కాంగ్రెస్ (Congress) మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. సీట్ల స‌ర్దుబాటు (seat sharing) విష‌యంలో ఢిల్లీ వేదిక‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతుండ‌గా.. చ‌ర్చ‌లు కొలిక్కిరాక‌ముందే సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎస్పీ నిర్ణ‌యంపై హ‌స్తం పార్టీ నేత‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు.

D

National | Published On Nov 25, 2026, 1.46 pm IST

Uttar Pradesh polls | మేం బిచ్చ‌గాళ్లం కాదు.. యూపీ ఎన్నిక‌ల వేళ ఇండీ కూట‌మిలో భ‌గ్గుమ‌న్న విభేదాలు
Advertisement
  • సీట్ల స‌ర్దుబాటులో కొలిక్కిరాని చ‌ర్చ‌లు
  • ఎస్పీ అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న‌పై భ‌గ్గుమ‌న్న కాంగ్రెస్‌
  • మేమేమైనా బిచ్చ‌గాళ్ల‌మా..? అంటూ ప్ర‌శ్న‌

Uttar Pradesh polls | త్రినేత్ర న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల (Uttar Pradesh polls) నేప‌థ్యంలో మిత్ర‌ప‌క్షాలైన స‌మాజ్ వాదీ పార్టీ (Samajwadi Party), కాంగ్రెస్ (Congress) మ‌ధ్య విభేదాలు భ‌గ్గుమ‌న్నాయి. సీట్ల సర్దుబాటు (seat sharing) చర్చలు నేత‌ల మ‌ధ్య తీవ్ర విభేదాలకు దారితీశాయి. మొత్తం 403 సీట్లలో కాంగ్రెస్ 130 సీట్లు కోరుతుండ‌గా.. ఎస్పీ కేవ‌లం 26 సీట్లు మాత్ర‌మే ఇస్తామ‌ని ప్ర‌తిపాదించింది. ఈ ప్రతిపాదనను కాంగ్రెస్ తిరస్కరించింది.

ఈ అంశంపై ఢిల్లీ వేదిక‌గా ఇరు పార్టీల నేత‌ల మ‌ధ్య చ‌ర్చ‌లు కొన‌సాగుతున్నాయి. ఈ చ‌ర్చ‌లు కొలిక్కిరాక‌ముందే సమాజ్‌వాదీ పార్టీ ఏకపక్షంగా ఐదు నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో సహారన్‌పూర్, షామ్లీ, అమ్రోహా, లలిత్‌పూర్, బెహ‌త్ (Behat) స్థానాలు ఉన్నాయి. ఈ ఐదు స్థానాల్లో రెండింటిని (బెహత్, సహారన్‌పూర్) కాంగ్రెస్ ఆశించింది. ఈ రెండు నియోజకవర్గాల్లో ముస్లిం, దళిత ఓటర్లు గణనీయంగా ఉన్నారు. ఉత్తరప్రదేశ్‌లో పార్టీ పునరుజ్జీవన వ్యూహంలో భాగంగా ఈ సామాజిక వర్గాల కలయికను ఆకట్టుకోవాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ క్ర‌మంలో ఆ రెండు స్థానాల‌కు అఖిలేష్ (Akhilesh Yadav) అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంపై హ‌స్తం పార్టీ నేత‌లు ఒక్క‌సారిగా భ‌గ్గుమ‌న్నారు.

తన సొంత లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోని సహారన్‌పూర్ (Saharanpur) స్థానంలో ఎస్పీ అభ్యర్థిని ప్రకటించడంపై యూపీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఇమ్రాన్ మసూద్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "మేం బిచ్చగాళ్లం కాదు, గౌరవప్రదమైన ఒప్పందం కుదరాలి. ఒకవైపు చర్చలు జరుపుతూనే మరోవైపు అభ్యర్థులను ఎలా ప్ర‌క‌టిస్తారు..?" అని ఆయన తీవ్ర‌స్థాయిలో ప్ర‌శ్నించారు. అయితే, కాంగ్రెస్ నేతలు మీడియా ముందు బహిరంగ వ్యాఖ్యలు చేస్తూ చర్చలకు ఆటంకం కలిగిస్తున్నందునే తాము అభ్యర్థులను ప్రకటించాల్సి వచ్చిందని ఎస్పీ వర్గాలు పేర్కొంటున్నాయి. పొత్తులో మొండిపట్టుదలకు తావులేదని, గెలుపు అవకాశాల (Winnability) ఆధారంగానే సీట్ల కేటాయింపు ఉంటుంద‌ని స్ప‌ష్టం చేస్తున్నాయి.

ఇండీ కూట‌మిలోని మిత్ర‌ప‌క్షాల మ‌ధ్య వ‌చ్చిన విభేదాల‌పై బీజేపీ వ్యంగ్యంగా స్పందించింది. కూటమికి నాయకత్వం వహించాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ.. తన మిత్రపక్షాలను కలుపుకుపోవడంలో విఫలమైందని విమ‌ర్శించింది. దీనివల్ల ఆ పార్టీ రాజకీయంగా బలహీనపడి నవ్వులపాలు అయిందని బీజేపీ నేత‌లు ఆరోపిస్తున్నారు.

Also Read..

కొండ‌పై కార్తీక దీపం వెలిగించలేకపోయాం.. సుప్రీంకోర్టుకు తెలిపిన తమిళనాడు ప్రభుత్వం

కూక‌ట్‌ప‌ల్లి ట్ర‌క్ పార్కు భూముల‌ను అమ్మేసి కుట్ర‌

ప్రజా సమస్యలపై గొంతెత్తిన వారిని పోలీసులతో అణచివేయాలని చూడటం సిగ్గుచేటు: కేటీఆర్‌

Advertisement
Advertisement