త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | యాసిడ్‌ దాడులపై సుప్రీం సీరియస్‌.. అమ్మ‌కాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు..!

Supreme Court | యాసిడ్‌ దాడులను అరికట్టేందుకు రిటైల్‌ దుకాణాల్లో యాసిడ్‌ విక్రయాలను తీవ్రంగా పరిమితం చేయడం.. అవసరమైతే పూర్తిగా నిషేధించడంపై ప‌రిశీలించాల‌ని సుప్రీంకోర్టు సంకేతాలిచ్చింది. ఈ అంశానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్‌) విచారణ సందర్భంగా సంబంధిత అధికారుల నుంచి స్పందన కోరింది.

P

National | Published On Aug 31, 2026, 4.49 pm IST

Supreme Court | యాసిడ్‌ దాడులపై సుప్రీం సీరియస్‌.. అమ్మ‌కాల‌పై కీల‌క వ్యాఖ్య‌లు..!
Advertisement

Supreme Court | యాసిడ్‌ దాడులను అరికట్టేందుకు రిటైల్‌ దుకాణాల్లో యాసిడ్‌ విక్రయాలను పూర్తిగా నిషేధించాలా? లేక కఠిన నియంత్రణలతో అనుమతించాలా? పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. 2013లో కోర్టు మార్గదర్శకాలు జారీ చేసినప్పటికీ యాసిడ్‌ ఇప్పటికీ సులభంగా అందుబాటులో ఉంటోందని కోర్టు దృష్టికి రావడంతో ఈ ఆదేశాలు జారీ చేసింది. సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ జాయ్‌మాల్య బాగ్చీ, జస్టిస్ వీ మోహనాలతో కూడిన ధర్మాసనం.. యాసిడ్‌ దాడి బాధితుల పునరావాసానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ప్రత్యేక పథకాలను రూపొందించి ఆరు వారాల్లోగా కోర్టు ముందుంచాలని ఆదేశించింది.

2013 నిబంధనలు అమలుకావడం లేదు

2013లో జారీ చేసిన మార్గదర్శకాలు దాదాపుగా కాలం చెల్లిపోయాయని, అవి సక్రమంగా అమలు కావడం లేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. మార్కెట్‌లో యాసిడ్‌ రిటైల్‌ విక్రయాలను కఠినంగా నియంత్రించేలా పథకం రూపొందించడంపై కేంద్రం పరిశీలించాలని సూచించింది. సీనియర్‌ న్యాయవాది సౌరభ్‌ కిర్పాల్‌.. స్వచ్ఛంద కార్యకర్తలు నిర్వహించిన సర్వేలో యాసిడ్‌ ఇప్పటికీ సులభంగా కొనుగోలు చేయగలుగుతున్నారని కోర్టుకు తెలిపారు. రిటైల్‌ విక్రయాలను నిషేధించాలని, అయితే పారిశ్రామిక అవసరాల కోసం విక్రయాలను కొనసాగించవచ్చని పేర్కొన్నారు. ఇంటి శుభ్రత కోసం వినియోగించే యాసిడ్‌కు ప్రత్యామ్నాయ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.

కొనుగోలుపై కఠిన నిబంధనలు

యాసిడ్‌ విక్రయాలను వయసు ఆధారంగా పరిమితం చేయడం, కొనుగోలు చేసేవారు దాన్ని ఎందుకు తీసుకుంటున్నారో రాతపూర్వకంగా నమోదు చేయడం, ఆ వివరాలను భద్రపరచడం వంటి నిబంధనలను అమలు చేయవచ్చని సీజేఐ సూర్యకాంత్‌ సూచించారు. యాసిడ్‌ ఎలా తయారవుతోంది? మార్కెట్‌లోకి ఎలా చేరుతోంది? అనే అంశాలపైనా కేంద్రం నుంచి వివరాలు కోరనున్నట్లు తెలిపారు. కేంద్రం తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ ఐశ్వర్య భాటి వాదనలు వినిపిస్తూ.. 2013లో ‘లక్ష్మి వర్సెస్‌ యూనియన్‌ ఆఫ్‌ ఇండియా’ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు కేంద్రం అడ్వైజరీ, మోడల్‌ రూల్స్‌ రూపొందించి రాష్ట్రాలకు పంపిందన్నారు. అయితే, అవసరమైన కమిటీలను ఏర్పాటు చేయడంలో, నిబంధనలను అమలు చేయడంలో రాష్ట్రాలు విఫలమయ్యాయని తెలిపారు.

స్కూళ్లు, కాలేజీల్లో అవగాహన

యాసిడ్‌ దాడి జరిగిన వెంటనే బాధితులకు అందించాల్సిన చికిత్సపై ప్రజల్లో అవగాహన పెంచాల్సిన అవసరాన్ని సుప్రీంకోర్టు నొక్కిచెప్పింది. ఇందుకోసం ఎన్‌జీవోలు సహకరించాలని, ముఖ్యంగా పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సీజేఐ సూచించారు. ఈ అంశాన్ని పాఠ్యాంశంలో తప్పనిసరి భాగంగా చేయాలని అభిప్రాయపడ్డారు. యాసిడ్‌ దాడుల నివారణ, దాడి అనంతరం చికిత్స, అత్యవసర సమయంలో తీసుకోవాల్సిన చర్యలకు సంబంధించిన అంశాలతో పాఠ్యాంశాన్ని రూపొందించేందుకు ఎన్‌జీవోలు నాలుగు వారాల్లో సూచనలు సమర్పించేందుకు ధర్మాసనం అనుమతించింది.

‘లాజికల్‌ కన్‌క్లూజన్‌కు తీసుకెళ్తాం’

యాసిడ్‌ దాడుల బాధితురాలు ఒకరు కోర్టుకు హాజరై.. 17 ఏళ్ల క్రితం జరిగిన దాడి తాలూకు మానసిక వేదన ఇప్పటికీ వెంటాడుతోందని తెలిపారు. దేశంలో రోజుకు మూడు యాసిడ్‌ దాడులు జరుగుతున్నాయని పేర్కొంటూ.. మరింత మంది మహిళలు బాధితులుగా మారకముందే యాసిడ్‌ విక్రయాలపై నిషేధం విధించాలని కోరారు. దీనిపై సీజేఐ సూర్యకాంత్‌ స్పందిస్తూ.. ‘‘మేం దీనిపై దృష్టి పెట్టాం. ఏదో ఒకటి చేస్తాం. దీన్ని ఇలాగే వదిలిపెట్టం. ఏదో ఒక విధంగా తార్కిక ముగింపునకు తీసుకెళ్తాం’’ అని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement