త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకోండి.. సివిల్ స‌ర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్య‌లు..!

Supreme Court | క‌ర్నాటక‌కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి డీ రూపా మౌద్గిల్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి సూచించింది. ఈ వివాదం ఇద్దరి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది.

P

National | Published On Jun 12, 2026, 3.45 pm IST

Supreme Court | మ‌ధ్య‌వ‌ర్తిత్వంతో స‌మ‌స్యను ప‌రిష్క‌రించుకోండి.. సివిల్ స‌ర్వెంట్లు రోహిణి సింధూరి, రూపా కేసులో సుప్రీం వ్యాఖ్య‌లు..!
Advertisement

Supreme Court | క‌ర్నాటక‌కు చెందిన ఐఏఎస్ అధికారి రోహిణి సింధూరి, ఐపీఎస్ అధికారి డీ రూపా మౌద్గిల్ మధ్య కొనసాగుతున్న వివాదాన్ని మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించుకోవాలని సుప్రీంకోర్టు మరోసారి సూచించింది. ఈ వివాదం ఇద్దరి జీవితాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని హెచ్చరించింది. రోహిణి సింధూరి దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం న్యాయమూర్తులు జస్టిస్ సతీష్ చంద్ర శర్మ, జస్టిస్ సంజీవ్ సచ్‌దేవాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. డీ రూపా మౌద్గిల్‌పై రోహిణి సింధూరి దాఖలు చేసిన పరువు నష్టం కేసును విచారణకు స్వీకరించిన ట్రయల్ కోర్టు నిర్ణయాన్ని క‌ర్నాట‌క హైకోర్టు సమర్థించడాన్ని సవాల్ చేస్తూ సింధూరి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. కేసు విచారణ సందర్భంగా ధర్మాసనం ఇద్దరు అధికారులు అత్యుత్తమ స‌ర్వీస్ రికార్డు ఉన్న వారేన‌ని, పరస్పర వివాదాలతో ఒకరి కెరీర్‌ను మరొకరు దెబ్బతీసుకుంటున్నారని స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం వ్యాఖ్యానించింది. ఈ వ్యవహారం మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కారమయ్యే అవకాశం ఉందని అభిప్రాయపడింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరేలా ప్రయత్నాలు చేయడానికి సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా నియమించింది.

ఈ వివాదం 2023 ఫిబ్రవరిలో మొద‌లైంది. తనకు సంబంధించిన కొన్ని వ్యక్తిగత ఫొటోలను ఇతర ఐఏఎస్ అధికారులతో పంచుకున్నారని ఆరోపిస్తూ డీ రూపా సోషల్ మీడియాలో పోస్టులు చేసినట్లు రోహిణి సింధూరి గుర్తించారు. ఈ ఆరోపణలు ఇద్దరు అధికారుల మధ్య బహిరంగ విమర్శలకు దారితీశాయి. వివాదం తీవ్రరూపం దాల్చడంతో క‌ర్నాట‌క ప్ర‌భుత్వం ఇద్ద‌రు అధికారుల‌పై బ‌దిలీ వేటు వేసింది. తర్వాత డీ రూపాకు రోహిణి సింధూరి లీగల్ నోటీసు పంపి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని, తన ప్రతిష్ఠకు భంగం కలిగించినందుకు, మానసిక వేదనకు రూ.కోటి పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. 2023 మార్చిలో బెంగళూరులోని కోర్టు రోహిణి సింధూరి ఫిర్యాదును విచారణకు స్వీకరించి డీ రూపాపై క్రిమినల్ పరువు నష్టం కేసు నమోదు చేసింది. ఈ కేసును కొట్టివేయాలని కోరుతూ డీ రూపా క‌ర్నాట‌క హైకోర్టును ఆశ్ర‌యించ‌గా.. ఆమె రిక్వెస్ట్‌ను తిర‌స్క‌రించింది. ఆరోపణలపై పూర్తి స్థాయి విచారణ అవసరమని పేర్కొంది. ఆ త‌ర్వాత 2023 డిసెంబ‌ర్‌లో ఐపీఎస్ రూపా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. అప్పటి విచారణల్లో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా నేతృత్వంలోని ధర్మాసనం ఈ వివాదంపై ఆందోళ‌న వ్య‌క్తం చేసింది. ఇద్ద‌రు సీనియర్ సివిల్ సర్వెంట్ల మధ్య ఇలాంటి వ్యవహారం పరిపాలనపై ప్రభావం చూపే అవకాశం ఉందని వ్యాఖ్యానించింది. అదే సమయంలో క్రిమినల్ పరువు నష్టం కేసు విచారణను నిలిపివేస్తూ ఇద్దరు అధికారులు మీడియాతో మాట్లాడరాదని ఆదేశించింది. సోషల్ మీడియా పోస్టులను తొలగించి, అవసరమైతే క్షమాపణ చెప్పుకొని వివాదానికి చెక్ పెట్టాల‌ని సూచించింది.

ఆ త‌ర్వాత పలుమార్లు ప్రయత్నాలు చేసినప్పటికీ మధ్యవర్తిత్వ చర్చలు ఫలించలేదు. తన ప్రతిష్ఠకు తీవ్ర నష్టం జరిగిందని, ఈ అంశంలో రాజీకి సిద్ధంగా లేనని రోహిణి సింధూరి స్పష్టం చేశారు. దీంతో 2024 నవంబరులో పరువు నష్టం కేసును కొట్టివేయాలంటూ దాఖలు చేసిన తన పిటిషన్‌ను ఉపసంహరించుకునేందుకు డీ రూపాకు సుప్రీంకోర్టు అనుమతి ఇచ్చింది. రాజీ కుదరని నేపథ్యంలో కేసు విచారణ కొనసాగుతుందని కోర్టు పేర్కొంది. ఇప్పటికీ ఈ న్యాయపోరాటం కొనసాగుతుండగా.. తాజా విచారణలో మరోసారి మధ్యవర్తిత్వం ద్వారానే పరిష్కారం సాధ్యమని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్య‌క్తం చేసింది. అంత‌టితో ఆగ‌కుండా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ కురియన్ జోసెఫ్‌ను మధ్యవర్తిగా స‌ర్వోన్న‌త న్యాయ‌స్థానం నియ‌మించింది. మ‌రి ఈసారైనా వివాదం ముగింపు ప‌లుకుతారా? కేసు కొన‌సాగుతుందా అన్న‌ది వేచి చూడాల్సిందే.

Advertisement
Advertisement