త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వ‌డంపై సుప్రీం ఆగ్ర‌హం

Supreme Court | నోయిడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్‌పై (Greater Noida Executive Magistrate) భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సూర్య‌కాంత్ క‌న్నెర్ర చేశారు. త‌మ స్ప‌ష్ట‌మైన ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ విద్యార్థికి నోటీసులు ఎలా ఇస్తారంటూ నిల‌దీశారు.

D

National | Published On Sep 9, 2026, 12.49 pm IST

Supreme Court | ఆ మెజిస్ట్రేట్‌కు ఎంత ధైర్యం..? లా విద్యార్థికి నోటీసులు ఇవ్వ‌డంపై సుప్రీం ఆగ్ర‌హం
Advertisement

Supreme Court | త్రినేత్ర‌.న్యూస్ : ఢిల్లీలోని జంతర్‌మంతర్ వ‌ద్ద సీజేపీ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవద్దని స్పష్టమైన ఆదేశాలు ఉన్నప్పటికీ, నిబంధనలను ఉల్లంఘించి ఒక లా విద్యార్థికి నోటీసులు జారీ చేయడంపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణించింది. "తమ ఆదేశాలను ధిక్కరించే సాహసం ఏ మెజిస్ట్రేట్ చేశారు..?" అని తీవ్రంగా మండిపడింది.

జంతర్‌మంతర్ నిరసనల్లో పాల్గొన్న విద్యార్థులపై నమోదైన కేసులను కొట్టివేస్తూ సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు చారిత్రాత్మక ఉత్తర్వులు జారీ చేసిన విష‌యం తెలిసిందే. విద్యార్థులపై ఎలాంటి కఠిన చర్యలు తీసుకోకూడదని స్పష్టం చేసింది. ఆర్టికల్ 142 కింద అసాధారణ అధికారాలను ఉపయోగించి సుప్రీం ధ‌ర్మాస‌నం ఈ ఉత్తర్వులు జారీ చేసింది. జులై 20 నుంచి 25 మధ్య వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో విద్యార్థుల‌పై నమోదైన ఎఫ్‌ఐఆర్‌లను తదుపరి విచారణ జరపకుండా మూసివేయాలని ఆదేశించింది. కేవలం నిరసనల్లో పాల్గొన్నంత మాత్రానా అది నేరం కాదని స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు నుంచి స్ప‌ష్ట‌మైన‌ ఆదేశాలు ఉన్న‌ప్ప‌టికీ ఉత్తరప్రదేశ్‌లోని గౌతమ్ బుద్ధ విశ్వవిద్యాలయ విద్యార్థి అక్షత్ త్రిపాఠికి నోయిడా ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ ద్వారా పోలీసులు నోటీసులు ఇచ్చారు. క్యాంపస్‌లో ఉద్రిక్తతలు సృష్టించేలా వ్యవహరించార‌ని ఆరోపిస్తూ.. శాంతిభద్రతల పరిరక్షణ కోసం రూ. 5 లక్షల వ్యక్తిగత బాండ్ సమర్పించాలని ఆ నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే, ఆ సమయంలో అక్షత్ త్రిపాఠి క్యాంపస్‌లో లేరని, సెమిస్ట‌ర్ బ్రేక్ కార‌ణంగా తన స్వస్థలమైన ప్రయాగ్‌రాజ్‌లో ఉన్నట్లు తేలడంతో మరుసటి రోజే అధికారులు ఆ నోటీసును వెనక్కి తీసుకున్నారు.

ఈ విష‌యాన్ని సీనియర్ అడ్వకేట్ బిశ్వజిత్ భట్టాచార్య కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన భారత ప్రధానన్యాయమూర్తి (CJI) సూర్యకాంత్.. స్థానిక యంత్రాంగంపై క‌న్నెర్ర చేశారు. నోటీసులు ఇచ్చిన మెజిస్ట్రేట్‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. విద్యార్థులకు వ్యతిరేకంగా ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోవద్దని తాము స్పష్ట‌మైన ఆదేశాలు ఇచ్చిన‌ట్లు చెప్పారు. త‌మ ఆదేశాలు స్ప‌ష్టంగా ఉన్న‌ప్ప‌టికీ మేజిస్ట్రేట్ ఎలా నోటీసులు జారీ చేయగలరని నిలదీశారు. మరుసటి రోజే ఆ నోటీసును ఉపసంహరించుకున్నప్పటికీ.. అది ప్రాథమికంగా కోర్టు ఉత్త‌ర్వుల‌ను ఉల్లంఘించ‌డ‌మేన‌ని సీజేఐ అభిప్రాయపడ్డారు. దేశ యువ‌త‌పై ఎలాంటి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకునే ప్ర‌స‌క్తే లేద‌న్నారు. సుప్రీం ఆదేశాల‌ను ఉల్లంఘించే ధైర్యం ఎవ‌రికీ లేద‌ని తేల్చి చెప్పారు. నోటీసు ఉపసంహరణకు సంబంధించిన పూర్తి వివరాలు, రికార్డులను కోర్టు ముందుంచాలని అడ్వొకేట్ భట్టాచార్యను సీజేఐ ఆదేశించారు. అంతేకాదు, ఈ వ్య‌వ‌హారంపై స‌ద‌రు మెజిస్ట్రేట్‌ను వివ‌ర‌ణ కోరారు.

Also Read..

పోలీసుల తీరుతో కన్నీరు పెట్టుకున్నా మమ్మల్ని కనీసం పట్టించుకోలే..

అదానీ ఎయిర్‌పోర్ట్స్‌కు భారీ పెట్టుబడి.. రూ.9,825 కోట్ల సమీకరణ..

మాళవిక మోహనన్‌ వింత కోరిక.. ఆ రోల్‌లో నటించాలని ఉందట!

Advertisement
Advertisement