Revanth Reddy Modi Warning | మోదీ గద్దె దిగాల్సిందే.. లేకుంటే ప్రజలే దించుతరు
జనాభా 140 కోట్లు దాటితే 13 కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయి? ఢిల్లీ రాజ్‌ఘాట్ వేదికగా ప్రధాని మోదీ, సీఈసీపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు.
సంక్షిప్త సారాంశం
ఢిల్లీలో 'ఓటు బచావో... దేశ్ బచావో' నిరసనలో కాంగ్రెస్ అగ్రనేతలు, 'ఇండియా' కూటమితో కలిసి రాజ్‌ఘాట్ వరకు సీఎం రేవంత్ రెడ్డి కదం తొక్కారు. ఈసీ జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాని మోదీ తక్షణమే భర్తరఫ్ చేయాలని, లేనిపక్షంలో ప్రధాని పదవికి మోదీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. శ జనాభా 140 కోట్లు దాటితే ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎలా తగ్గిపోయాయో సమాధానం చెప్పాలని కేంద్రాన్ని నిలదీశారు. బీజేపీకి వ్యతిరేకంగా ఓటేసే దళితులు, గిరిజనులు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని తొలగిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు.
- ఢిల్లీ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Revanth Reddy Modi Warning | త్రినేత్ర న్యూస్ : కేంద్ర ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకుని దొడ్డిదారిన అధికారంలో కొనసాగాలని చూస్తే దేశ ప్రజలు చూస్తూ ఊరుకోరని, తప్పకుండా తిరుగుబాటు చేస్తారని రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ఈడీ, సీబీఐ, ఆదాయపు పన్ను శాఖ దాడులతో ప్రతిపక్షాలను బెదిరించి బీజేపీ ప్రభుత్వం తన ఉనికిని కాపాడుకోలేదని ఆయన తేల్చిచెప్పారు. దేశ రాజధాని ఢిల్లీలో ‘ఇండియా’ కూటమి ఆధ్వర్యంలో చేపట్టిన ‘ఓటు బచావో... దేశ్ బచావో’ మహా ప్రదర్శనలో భాగంగా ఆయన గురువారం మహాత్మా గాంధీ సమాధి రాజ్‌ఘాట్ వద్ద నివాళులర్పించి, అనంతరం మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్‌లతో కలిసి రాజ్‌ఘాట్ మార్చ్‌లో పాల్గొన్న రేవంత్ రెడ్డి.. ప్రధాని నరేంద్ర మోదీ, సీఈసీ జ్ఞానేష్ కుమార్‌లపై నేరుగా విరుచుకుపడ్డారు. వివాదాస్పద నిర్ణయాలతో రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్న చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను ప్రధాని వెంటనే పదవి నుంచి భర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలా చేయని పక్షంలో నైతిక బాధ్యత వహించి ప్రధాని మోదీయే తన పదవికి రాజీనామా చేయాలని, లేకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఆయనను గద్దె దించుతారని హెచ్చరించారు.
జనాభా పెరిగితే ఓట్లు ఎలా తగ్గాయి?
ఇది కేవలం కాంగ్రెస్ పార్టీ సమస్య కాదని, దేశంలోని కోట్లాది మంది సామాన్యుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ ఉద్యమమని రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. "2014 సార్వత్రిక ఎన్నికల నాటికి దేశంలో 81 కోట్ల మంది ఓటర్లు ఉంటే, 2019 నాటికి ఆ సంఖ్య 91 కోట్లకు, 2024 నాటికి 97 కోట్లకు చేరింది. దేశ జనాభా ఇప్పుడు 140 కోట్లను దాటిన వేళ ఓటర్ల సంఖ్య పెరగాల్సింది పోయి.. ఏకంగా 13 కోట్ల ఓట్లు ఎలా గల్లంతయ్యాయి? ఈ లెక్కలను ప్రధాని మోదీ ప్రజలకు చెప్పగలరా?" అని సీఎం నిలదీశారు.
గతంలో ఎన్నోసార్లు ఓటర్ల సవరణ ప్రక్రియ (SIR) జరిగినా పేదల ఓట్లకు ఎన్నడూ ఎలాంటి ముప్పు రాలేదని ఆయన గుర్తుచేశారు. కానీ ప్రస్తుతం అంబేద్కర్ కల్పించిన పవిత్రమైన ఓటు హక్కును అణగారిన వర్గాల నుంచి బలవంతంగా లాక్కునేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఎన్నికల సంఘం చేస్తున్న తప్పులను నిలదీసేందుకు వెళ్లిన విపక్ష నేతలను కలవకపోవడం, పైగా ప్రశ్నించిన వారిపై పోలీసులతో కేసులు బనాయించడం నిరంకుశ పాలనకు నిదర్శనమని మండిపడ్డారు.
ఓట్లు ఉన్నవారు.. లేనివారుగా విభజన
ఇప్పటివరకు కులం, మతం, ప్రాంతం, భాషల పేరుతో సమాజాన్ని చీల్చి రాజకీయ లబ్ధి పొందిన బీజేపీ.. ఇప్పుడు దేశ ప్రజలను 'ఓటు ఉన్నవాళ్లు', 'ఓటు లేనివాళ్లు'గా రెండు వర్గాలుగా విభజిస్తోందని రేవంత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పేదలు ఒకవైపు, అనుకూలంగా ఉన్నవారు మరోవైపు అన్నట్లుగా సీఈసీ తీరు మారిపోయిందన్నారు. ముఖ్యంగా బీజేపీని తీవ్రంగా వ్యతిరేకించే దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, మైనారిటీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని కుట్రపూరితంగా జాబితాల నుంచి తొలగిస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?
- ●CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి
- ●KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్
- ●Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!
- ●OU Degree Exam Fee | ఓయూ పరిధిలో డిగ్రీ కోర్సుల పరీక్షా ఫీజు స్వీకరణ
- ●Song Lyrics | సద్ది గట్టి...సెలకల తొవ్వ బట్టి - తెలంగాణ పల్లె పదాలతో చంద్రబోస్ మ్యాజిక్ - ‘ఏగిలివారంగ’ సాంగ్ లిరిక్స్ ఇవిగో...

Planet Nine | ప్లానెట్ నైన్ జాడ దొరికినట్టేనా?

CM Revanth Reddy | బతుకమ్మ వేడుకలు ఆనందోత్సాహాలతో జరుపుకోవాలి: సీఎం రేవంత్‌రెడ్డి

KCR | బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ప్రతీక: కేసీఆర్

Delhi Jantar Mantar Protest | ఢిల్లీ షట్‌డౌన్!





