త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత

K Kavitha | చిత్రపురి కాలనీలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కాపాడితే 600 మంది పేద సినీ కార్మికులకు ఇళ్లు ఇవ్వొచ్చన్నారు.

P

Telangana | Published On Oct 9, 2026, 7.54 pm IST

K Kavitha | చిత్రపురి అక్రమాలపై సీబీఐ, ఈడీ విచారణ జరిపించాలి : కల్వకుంట్ల కవిత
Advertisement

K Kavitha | చిత్రపురి కాలనీలో చోటుచేసుకున్నాయని ఆరోపిస్తున్న అక్రమాలపై సీబీఐ, ఈడీతో విచారణ జరిపించాలని తెలంగాణ రక్షణ సేన చీఫ్‌ కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. మిగిలిన నాలుగు ఎకరాల భూమిని కాపాడితే 600 మంది పేద సినీ కార్మికులకు ఇళ్లు ఇవ్వొచ్చన్నారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్‌రెడ్డి తక్షణమే విచారణకు ఆదేశించాలని, మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు వెంటనే స్పందించాలని కోరారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో చిత్రపురి కాలనీ సాధన సమితి నాయకులు కవితను కలిసి తమ సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాలనీలో అక్రమాలకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

రూ.19 కోట్ల రుణం.. 24 శాతం వడ్డీ

చిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్స్‌ కార్మికులు ఎంతో కష్టపడి పనిచేస్తేనే నటీనటులకు గుర్తింపు వస్తుందని, అలాంటి కార్మికులకే సొంతిల్లు కట్టుకోవడం కష్టంగా మారిందని కవిత అన్నారు. సినీ కార్మికులకు ఇళ్లు కల్పించాలనే లక్ష్యంతో కోట్ల విజయభాస్కర్‌రెడ్డి, ప్రభాకర్‌రెడ్డి 67 ఎకరాల భూమిని గజానికి రూ.40 చొప్పున కేటాయించారని గుర్తుచేశారు. ఈ స్థలంలో 4,200 మందికి ఇళ్లు కేటాయించాల్సి ఉండగా, 2015 వరకు కూడా అలాట్మెంట్‌ జరగలేదన్నారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో 2015–2023 మధ్య చిత్రపురి సొసైటీలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. అప్పటి మంత్రుల అండతో అనిల్‌ అనే వ్యక్తి సొసైటీ, ఫిల్మ్‌ ఫెడరేషన్‌ను తన ఆధీనంలోకి తీసుకున్నారని విమర్శించారు. సుమారు 300 కేసులు నమోదైనప్పటికీ బాధితులకు న్యాయం జరగలేదన్నారు. కోర్టు, సహకార సంస్థ నిబంధనలను ఉల్లంఘించి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. సొసైటీ పేరుతో ఒక్కో ఇళ్ల సముదాయాన్ని బట్టి రూ.23 కోట్లు, రూ.10 కోట్లు వసూలు చేశారని కవిత పేర్కొన్నారు. 67 ఎకరాల్లో మిగిలిన నాలుగు ఎకరాలను తనఖా పెట్టి, ఏడాదికి 24 శాతం వడ్డీతో రూ.19 కోట్ల రుణం తీసుకున్నారని ఆరోపించారు. సహకార సంఘ నిబంధనల ప్రకారం ఇలా తనఖా పెట్టడం కుదరదన్నారు. ఇప్పుడు అదే స్థలంలో ఫ్లాట్లు నిర్మిస్తున్నట్లు బహిరంగంగా ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు.

కాంగ్రెస్‌ హామీ ఏమైంది?

చిత్రపురి అక్రమాలపై సీబీఐ విచారణ జరిపిస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చిందని కవిత గుర్తుచేశారు. ఆ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్లయినా సినీ కార్మికులకు న్యాయం జరగలేదన్నారు. కార్మికుల రక్తం, చెమటతో కొనుక్కున్న ఇళ్లను ఇతరుల చేతుల్లోకి వెళ్లనివ్వకూడదని స్పష్టం చేశారు. అలాట్మెంట్‌ కమిటీలో కలెక్టర్‌తో పాటు సినీ ప్రముఖులు, సమాచార హక్కు చట్టం కమిషనర్‌ పీవీ శ్రీనివాస్‌ సతీమణి, సుద్దాల అశోక్‌తేజ సభ్యులుగా ఉన్నారని తెలిపారు. పీవీ శ్రీనివాస్‌ సతీమణికి సొసైటీలో ఇల్లు ఎలా కేటాయించారని ప్రశ్నించారు. ఆమె ఎప్పటి నుంచి సభ్యురాలిగా ఉన్నారో వెల్లడించాలని, కమిటీలో ఉన్నవారికే ఇళ్లు ఎలా కేటాయిస్తారని నిలదీశారు. సుద్దాల అశోక్‌తేజ అక్కడ జరుగుతున్న అవినీతిపై బయటకు వచ్చి మాట్లాడాలని కోరారు. ఆమెకు కేటాయించిన ఇంటిని రద్దు చేస్తారా? లేక కమిటీ నుంచి తొలగిస్తారా? స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ కో-డైరెక్టర్‌ తోట రామకృష్ణకు కేటాయించిన ఇంటిని ఇతరులకు విక్రయించారని ఆరోపించారు. కండీషన్‌ బెయిల్‌పై బయటకు వచ్చిన అనిల్‌ లబ్ధిదారుల కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నా పోలీసులు ఎందుకు కేసులు నమోదు చేయడం లేదని ప్రశ్నించారు. ఫెడరేషన్‌లోని యూనియన్లలో తన అనుచరులను పెట్టుకుని కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తున్నారని ఆరోపించారు.

సినీ పెద్దలు జోక్యం చేసుకోవాలి

చిత్రపురి కాలనీ వ్యవహారంలో చిరంజీవి, పవన్‌కల్యాణ్‌, సురేశ్‌బాబు, దిల్‌రాజు వంటి సినీ ప్రముఖులు జోక్యం చేసుకోవాలని కవిత కోరారు. జూబ్లీహిల్స్‌ ఎన్నికల సందర్భంగా సీఎం సమావేశం కోసం సొసైటీ సభ్యుల నుంచి అనిల్‌ ఒక్కొక్కరి వద్ద రూ.2 లక్షల చొప్పున వసూలు చేశారని ఆరోపించారు. మళ్లీ సీఎం నిర్వహించనున్న సమావేశం కోసం కూడా రూ.2 లక్షలు ఇవ్వాలని అడుగుతున్నారని తెలిపారు. సీఎం సమావేశం పెట్టి రూ.10 కోట్లు ఇప్పిస్తానని చెబుతున్నారని, ఆ డబ్బును అనిల్‌కు ఇస్తే కార్మికులకు న్యాయం జరగదని అన్నారు. దిల్‌రాజు వంటి ప్రముఖుల ద్వారా ఫిల్మ్‌ ఫెడరేషన్‌కు నిధులు అందించాలని సూచించారు. వసూలు చేసిన రూ.2 లక్షలను తిరిగి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. చిత్రపురి కాలనీలోని భూమి విలువ ప్రస్తుతం రూ.7 వేల కోట్లుగా ఉందని పేర్కొన్న కవిత.. ఇంత విలువైన ఆస్తిలో అక్రమాలు జరుగుతున్నా బాధ్యులకు శిక్ష పడకపోవడం ఏమిటని ప్రశ్నించారు. అనిల్‌పై ఈడీ, సీబీఐ విచారణ జరిపించాలని కోరారు. సినీ కార్మికులు ఆందోళన చెందవద్దని, రెండేళ్లలో తెలంగాణ రక్షణ సేన ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని కవిత అన్నారు. కార్మికులకు అండగా ఉంటామని, అవసరమైతే వారితో కలిసి వీధి పోరాటానికైనా సిద్ధమని ప్రకటించారు. ఫిల్మ్‌ ఫెడరేషన్‌ నుంచి అనిల్‌ను తక్షణమే తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement