త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Planet Nine | ప్లానెట్‌ నైన్‌ జాడ దొరికినట్టేనా?

Planet Nine | సౌర కుటుంబంలో తొమ్మిదో గ్రహం ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? ఖగోళ శాస్త్రవేత్తలకు చాలాకాలంగా అంతుచిక్కని ప్రశ్నలివి. ఈ అన్వేషణలో తాజాగా ఓ ఆసక్తికరమైన ఆధారం లభించింది. దశాబ్దాల క్రితం సేకరించిన అంతరిక్ష పరిశీలనల సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు.. ప్లానెట్‌ నైన్‌ కావచ్చని భావిస్తున్న ఓ ఖగోళ వస్తువును గుర్తించారు. 1

P

Science | Published On Oct 10, 2026, 1.15 am IST

Planet Nine | ప్లానెట్‌ నైన్‌ జాడ దొరికినట్టేనా?
Advertisement

Planet Nine | సౌర కుటుంబంలో తొమ్మిదో గ్రహం ఉందా? ఉంటే అది ఎక్కడ ఉంది? ఖగోళ శాస్త్రవేత్తలకు చాలాకాలంగా అంతుచిక్కని ప్రశ్నలివి. ఈ అన్వేషణలో తాజాగా ఓ ఆసక్తికరమైన ఆధారం లభించింది. దశాబ్దాల క్రితం సేకరించిన అంతరిక్ష పరిశీలనల సమాచారాన్ని విశ్లేషించిన పరిశోధకులు.. ప్లానెట్‌ నైన్‌ కావచ్చని భావిస్తున్న ఓ ఖగోళ వస్తువును గుర్తించారు. 1983లో ఒక చోట కనిపించిన ఈ వస్తువు.. 23 ఏళ్ల తర్వాత నిర్వహించిన మరో పరిశీలనలో వేరే స్థానంలో కనిపించింది. దాని కాంతి తీవ్రత, కదలికలు సుదూర గ్రహానికి ఉండే లక్షణాలతో సరిపోలుతున్నాయి. అయితే, ఇదే తొమ్మిదో గ్రహమని నిర్ధారించడానికి మరిన్ని పరిశీలనలు అవసరమని శాస్త్రవేత్తలు స్పష్టం చేస్తున్నారు.

తొమ్మిదో గ్రహం ఉందని ఎందుకనుకుంటున్నారు?

నెప్ట్యూన్‌ ఆవల ఉన్న కొన్ని ఖగోళ వస్తువుల కక్ష్యలు సాధారణంగా కాకుండా వింత కోణాల్లో ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీటి కదలికల వెనుక గుర్తించని భారీ ఖగోళ వస్తువు గురుత్వాకర్షణ ఉండొచ్చని భావిస్తున్నారు. ఈ అంచనాల ఆధారంగానే ‘ప్లానెట్‌ నైన్‌’ తెరపైకి వచ్చింది. అయితే, ఇప్పటివరకు ఈ గ్రహాన్ని ప్రత్యక్షంగా గుర్తించలేదు. అందుకే దీని ఉనికి ఇంకా ఊహాజనితంగానే ఉంది. పరిశోధకుల అంచనా ప్రకారం.. ప్లానెట్‌ నైన్‌ సూర్యుడికి 500 నుంచి 700 ఖగోళ ప్రమాణాల దూరంలో ఉండవచ్చు. ఒక ఖగోళ ప్రమాణం అంటే భూమికి, సూర్యుడికి మధ్య ఉన్న సగటు దూరం. ఇంత దూరంలో సూర్యకాంతి చాలా బలహీనంగా ఉంటుంది. దీంతో గ్రహంపై పడి తిరిగి ప్రతిఫలించే కాంతిని గుర్తించడం కష్టమవుతుంది. అందుకే శాస్త్రవేత్తలు ఇన్‌ఫ్రారెడ్‌ పరిశీలనలపై దృష్టి సారించారు. గ్రహాల నుంచి వెలువడే వేడికి సంబంధించిన సంకేతాల ఆధారంగా వాటి జాడను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు.

పాత సమాచారంతో కొత్తగా అన్వేషణ..

తైవాన్‌లోని నేషనల్‌ త్సింగ్‌ హువా యూనివర్సిటీకి చెందిన టెర్రీ లాంగ్‌ ఫాన్‌, ఆయన బృందం ఈ పరిశోధన చేపట్టారు. 1983లో ఇన్‌ఫ్రారెడ్‌ ఆస్ట్రనామికల్‌ శాటిలైట్‌ (ఐఆర్‌ఏఎస్‌), 2006–07లో జపాన్‌కు చెందిన అకారి అంతరిక్ష నౌక సేకరించిన సమాచారాన్ని విశ్లేషించారు. ఈ రెండు పరిశీలనల మధ్య సుమారు 23 ఏళ్ల వ్యవధి ఉండటంతో.. ఆ సమయంలో సుదూర ఖగోళ వస్తువులు ఎంత మేరకు కదిలి ఉంటాయో అంచనా వేయడానికి వీలైంది. సూర్యుడికి 500–700 ఖగోళ ప్రమాణాల దూరంలో ఉండి, భూమి ద్రవ్యరాశికి 7–17 రెట్లు ఉండే వస్తువు కోసం పరిశోధకులు ప‌రిశీల‌న చేశారు. దాని కాంతి తీవ్రత, స్థానం, ఇన్‌ఫ్రారెడ్‌ లక్షణాలను పరిశీలించారు. తొలుత 22 పొటెన్షియ‌ల్ పేర్స్‌ను గుర్తించారు. త‌ర్వాత ఆ సంఖ్య 13కు తగ్గింది. చివరకు అన్ని ప్రమాణాలకు అత్యంత దగ్గరగా సరిపోయిన ఒక వస్తువును గుర్తించారు. ఐఆర్‌ఏఎస్‌, అకారి పరిశీలనల మధ్య అది 47.46 ఆర్క్‌ నిమిషాల మేర స్థానాన్ని మార్చుకున్నట్లు తేలింది. దీంతో ప్లానెట్‌ నైన్ రేసులో నిలిచింది.

ఇదే ప్లానెట్‌ నైన్‌ అని చెప్పలేం!

ఓ ఖగోళ వస్తువు కనిపించడం, అది కదులుతున్న తీరు అంచనాలకు సరిపోవడం మాత్రమే దాన్ని తొమ్మిదో గ్రహంగా నిర్ధారించడానికి సరిపోదు. సౌర కుటుంబం వెలుపలి ప్రాంతాల్లోని ఇతర వస్తువుల అసాధారణ కక్ష్యలకు కారణమయ్యేంత గురుత్వాకర్షణ ప్రభావం దీనికి ఉందా? ఇది సరైన కక్ష్యలో ప్రయాణిస్తోందా? అనే అంశాలను పరిశీలించాల్సి ఉంది. అందుకే పరిశోధకులు దీనిని ప్లానెట్‌ నైన్‌గా ప్రకటించలేదు. తదుపరి దశలో చిలీలోని నాలుగు మీటర్ల బ్లాంకో టెలిస్కోప్‌కు అమర్చిన డార్క్‌ ఎనర్జీ కెమెరాతో ఈ వస్తువును మరింత పరిశీలించాలని పరిశోధకులు భావిస్తున్నారు. దాని కదలికలను కచ్చితంగా గుర్తిస్తే.. ఇది ప్లానెట్‌ నైన్‌ అయ్యే అవకాశముందా? లేక మరో ఖగోళ వస్తువా? అన్నది తేల్చేందుకు వీలవుతుంది. ‘పబ్లికేషన్స్‌ ఆఫ్‌ ది ఆస్ట్రానమికల్‌ సొసైటీ ఆఫ్‌ ఆస్ట్రేలియా’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయనం.. తొమ్మిదో గ్రహం అన్వేషణలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అయితే, ప్లానెట్‌ నైన్‌ ఉనికి నిర్ధారణ కావాలంటే మరిన్ని పరిశీలనలు అవ‌స‌ర‌మ‌ని శాస్త్ర‌వేత్త‌లు భావిస్తున్నారు.

Advertisement
Advertisement