త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Sonam Wangchuk Hunger Strike | ఆసుపత్రిలో సోనమ్ వాంగ్ చుక్.. కేంద్రానికి కీలక లేఖ : ఆ షరతులకు ఒప్పుకుంటేనే దీక్ష విరమణ!

24 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్‌ను ప్రతిపక్ష ఎంపీలు మెదాంత ఆసుపత్రిలో పరామర్శించారు. దీక్ష విరమణకు ఆయన పెట్టిన షరతులు ఇవే..

J

National | Published On Jul 22, 2026, 6.46 pm IST

Sonam Wangchuk Hunger Strike | ఆసుపత్రిలో సోనమ్ వాంగ్ చుక్.. కేంద్రానికి కీలక లేఖ : ఆ షరతులకు ఒప్పుకుంటేనే దీక్ష విరమణ!
Advertisement
  • విద్యావ్యవస్థలో సంస్కరణల కోసం 24 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న సోనమ్ వాంగ్ చుక్
  • మెదాంత ఆసుపత్రిలో ఆయనను కలిసి దీక్ష విరమించాలని కోరిన ప్రతిపక్ష ఎంపీల బృందం
  • పార్లమెంటులో విద్యార్థుల పక్షాన పోరాడుతామని ఎంపీల లిఖితపూర్వక హామీ
  • విద్యార్థులపై కేసులు ఎత్తివేసి, పరిహారం ఇస్తేనే దీక్ష విరమిస్తానని కేంద్రానికి వాంగ్ చుక్ లేఖ

Sonam Wangchuk Hunger Strike | త్రినేత్ర.న్యూస్ : విద్యావ్యవస్థలో సంస్కరణలు, యువత భవిష్యత్తు కోసం గత 24 రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష (Hunger Strike) చేస్తున్న ప్రముఖ విద్యావేత్త, పర్యావరణవేత్త సోనమ్ వాంగ్ చుక్ దీక్ష విరమణపై కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం మెదాంత ఆసుపత్రిలో (Medanta Hospital) చికిత్స పొందుతున్న ఆయన.. కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వస్తేనే తాను దీక్ష విరమిస్తానని ఆయన తేల్చిచెప్పారు.

వాంగ్ చుక్‌ను కలిసిన ప్రతిపక్ష ఎంపీలు

బుధవారం నాడు ప్రతిపక్ష ఎంపీలు వివేక్ తంఖా, సాగరిక ఘోష్, జాన్ బ్రిట్టాస్ తదితరుల బృందం మెదాంత ఆసుపత్రికి వెళ్లి సోనమ్ వాంగ్ చుక్‌ను, ఆయన భార్య గీతాంజలి అంగ్మోను పరామర్శించింది. దేశ ప్రయోజనాలు, విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా వెంటనే దీక్ష విరమించాలని వారు అభ్యర్థించారు. ఈ మేరకు పలువురు ప్రతిపక్ష నేతలు, ఫ్లోర్ లీడర్లు సంతకాలు చేసిన ఒక లేఖను ఆయనకు అందజేశారు.

పార్లమెంట్‌లో మేము కొట్లాడుతాం: ఎంపీల హామీ

"భారతదేశ యువత కోసం, పారదర్శకమైన పరీక్షా విధానం కోసం మీరు చేస్తున్న పోరాటం కోట్లాది మంది హృదయాలను తాకింది. మీ సందేశం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనించింది. దయచేసి దీక్ష విరమించండి. పార్లమెంట్‌లో (Parliament) విద్యా సంస్కరణలపై మేము పోరాటం చేస్తాం. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న విద్యార్థులపై ఎఫ్ఐఆర్ (FIR) సహా ఎలాంటి పరిపాలనాపరమైన, కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం" అని ఆ లేఖలో ఎంపీలు స్పష్టమైన హామీ ఇచ్చారు. మీ ప్రాణత్యాగం కంటే, మీ మార్గదర్శకత్వం ఈ దేశానికి, ముఖ్యంగా లద్దాఖ్ యువతకు ఎంతో అవసరమని వారు పేర్కొన్నారు.

కేంద్రానికి వాంగ్ చుక్ కండిషన్స్ ఇవే..

ఎంపీల విజ్ఞప్తి, తన ఆరోగ్య పరిస్థితి క్షీణిస్తున్న నేపథ్యంలో వాంగ్ చుక్ కేంద్రానికి ఒక లేఖ రాశారు. ఆందోళనల్లో పాల్గొన్న విద్యార్థులపై ఎలాంటి కేసులు (Cases) పెట్టకూడదని డిమాండ్ చేశారు. అలాగే, ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన పరిహారం (Compensation) అందించాలని కోరారు. ఈ డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇస్తేనే తాను దీక్ష విరమిస్తానని ఆయన ఆ లేఖలో స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బంతి కేంద్రం కోర్టులో ఉంది.. మోదీ సర్కార్ ఈ డిమాండ్లపై ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement