త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి ‘జాతకం’ చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ

పులులు, చిరుతల మూత్రం, మలం వాసన ఆధారంగా వాటి వయసు, లింగం, గర్భం దాల్చిన విషయాలను పసిగట్టే సరికొత్త విధానాన్ని ఇండియన్ సైంటిస్టులు కనుగొన్నారు.

J

National | Published On Aug 8, 2026, 4.38 pm IST

Tiger Scent Tracking | పులుల వాసన పసిగట్టి వాటి ‘జాతకం’ చెప్పేయొచ్చు.. ఇండియన్ సైంటిస్టుల అద్భుత ఆవిష్కరణ

సంక్షిప్త సారాంశం

పులులు, చిరుతల మూత్రం, మలం వాసన ఆధారంగా వాటి పూర్తి వివరాలు తెలుసుకునే కొత్త టెక్నాలజీని బెంగళూరులోని NCBS శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. గ్యాస్ క్రోమాటోగ్రఫీ (Gas Chromatography), మెషిన్ లెర్నింగ్ ఉపయోగించి వాటి వయసు, లింగం, జాతిని కచ్చితంగా గుర్తించవచ్చు. ఆడ పులులు గర్భంతో ఉన్నాయా లేదా అనే విషయాన్ని కూడా ఈ సరికొత్త విధానం ద్వారా సులభంగా పసిగట్టొచ్చు. కెమెరా ట్రాపింగ్, డీఎన్ఏ టెస్టులకు తోడుగా ఈ 'కెమికల్ ఎకాలజీ' విధానం వన్యప్రాణుల సంరక్షణలో గేమ్ ఛేంజర్‌గా మారనుంది.

Advertisement
  • వాటి మూత్రం, మలమే జంతువులకు కెమికల్ సిగ్నల్స్
  • క్రూర మృగాల ట్రాకింగ్‌కు అవే ఆధారం
  • వాటి ఆరోగ్యం, వయసును కచ్చితంగా అంచనా వేయడం కోసమే
  • బెంగళూరు నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ పరిశోధకుల సరికొత్త ఆవిష్కరణ

Tiger Scent Tracking | త్రినేత్ర.న్యూస్ : అడవిలో క్రూర జంతువులైన పులులు (Tigers), చిరుతలను (Leopards) ట్రాక్ చేయడం అంత సులువైన విషయం కాదు. దట్టమైన అడవుల్లో మనుషుల కంటపడకుండా అవి చాకచక్యంగా తిరుగుతుంటాయి. అయితే, అవి విడిచిపెట్టే వాసన ఆధారంగా ఆ పులి వయసు, లింగం, జాతి, చివరకు అది గర్భంతో ఉందా లేదా అనే విషయాలను పసిగట్టే సరికొత్త విధానాన్ని బెంగళూరులోని నేషనల్ సెంటర్ ఫర్ బయోలాజికల్ సైన్సెస్ (NCBS) పరిశోధకులు అభివృద్ధి చేశారు.

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రీసెర్చ్‌ (TIFR)లో భాగమైన NCBS సైంటిస్టులు చేసిన ఈ ప్రయోగం వన్యప్రాణుల సంరక్షణలో కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

కెమికల్ సిగ్నల్స్.. అడవిలో జంతువుల పోస్ట్‌కార్డులు

పులులు, చిరుతలు తమ ఏరియాను మార్క్ చేసుకోవడానికి చెట్లపై, దారుల్లో మూత్రం (Urine), మలం (Scat) విడిచిపెడతాయి. ఇవి కేవలం వ్యర్థాలు మాత్రమే కాదు, ఇతర జంతువులకు అవి పంపే 'కెమికల్ సిగ్నల్స్'. ఒక రకంగా చెప్పాలంటే ఇవి అడవిలో జంతువులు వదిలిపెట్టే పోస్ట్‌కార్డుల లాంటివి.

ఈ వాసనల (Scent marks) వెనుక ఉన్న సమాచారాన్ని డీకోడ్ చేసేందుకు అదితీ ప్రసాద్ అనే యువ పరిశోధకురాలు ఎంతో శ్రమించారు. బెంగళూరు, అహ్మదాబాద్, వడోదర జూ పార్కులతో పాటు రాజస్థాన్‌లోని రణతంబోర్ టైగర్ రిజర్వ్‌లో నెలల తరబడి తిరిగి మూత్రం, మలం శాంపిల్స్ కలెక్ట్ చేశారు.

మెషిన్ లెర్నింగ్‌తో మ్యాజిక్

సేకరించిన శాంపిల్స్‌ను అత్యాధునిక గ్యాస్ క్రోమాటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రీ, మెషిన్ లెర్నింగ్ (Machine Learning) అల్గారిథమ్స్ సాయంతో సైంటిస్టులు విశ్లేషించారు. ఈ పరిశోధనలో పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పులులు, చిరుతపులుల నుంచి నమూనాలు (శాంపిల్స్) సేకరించేందుకు నెలల తరబడి శ్రమించిన కెమికల్ ఎకాలజిస్ట్ బీవీ అదితీ ప్రసాద్

జాతి, లింగ నిర్ధారణ: మూత్రంలోని కొన్ని ప్రత్యేకమైన రసాయనాల ఆధారంగా అది పులిదా లేక చిరుతదా అని కచ్చితంగా చెప్పొచ్చు. అలాగే అది మగ పులా, ఆడ పులా అనేది కూడా పసిగట్టొచ్చు.

గర్భం గుర్తింపు: వన్యప్రాణుల సంరక్షకులకు అత్యంత కీలకమైన విషయం ఇది. ఆడ పులులు గర్భంతో ఉన్నప్పుడు లేదా పాలిచ్చే సమయంలో వాటి మూత్రంలో 2 నోననాల్ (2 nonanol) అనే కెమికల్ ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీన్ని బట్టి పులి ప్రెగ్నెంట్‌గా ఉందో లేదో కెమెరా లేకుండానే చెప్పేయొచ్చు.

ఇండియాకు ఎందుకింత కీలకం?

ప్రపంచంలో అత్యధిక పులులు ఉన్న దేశం మనదే. 2006లో 1,411 గా ఉన్న పులుల సంఖ్య 2022 నాటికి 3,167కు చేరుకుంది. గతంలో పులుల పాదముద్రలు (Pugmarks), ఆ తర్వాత కెమెరా ట్రాపింగ్ (Camera trapping) ద్వారా వాటిని లెక్కించేవారు. అయితే, కెమెరాల ద్వారా పులులను గుర్తించగలమే కానీ.. వాటి ఆరోగ్యం, వయసును కచ్చితంగా అంచనా వేయలేం.

రాజస్థాన్‌లోని రణతంబోర్ నేషనల్ పార్క్‌లో కంటికి చిక్కని పులుల జాడ పట్టిన పరిశోధకులు సంపూర్ణ, బీవీ అదితీ ప్రసాద్, ఉమా రామకృష్ణ

ఇక్కడే 'కెమికల్ ఎకాలజీ' (Chemical Ecology) విధానం ఉపయోగపడనుందని ఈ అధ్యయనానికి నేతృత్వం వహించిన షానన్ ఓల్సన్, ప్రముఖ వైల్డ్‌లైఫ్ జెనెటిసిస్ట్ ప్రొఫెసర్ ఉమా రామకృష్ణన్ చెబుతున్నారు.

ఈ విధానం ఖర్చు తక్కువతో కూడుకున్నది కావడమే కాకుండా.. జంతువులను నేరుగా ఇబ్బంది పెట్టకుండా వాటి వివరాలు తెలుసుకునేందుకు అద్భుతంగా పనిచేస్తుంది. భవిష్యత్తులో ఈ టెక్నాలజీ ద్వారా అడవి కుక్కలు, మంచు చిరుతలు, ఎలుగుబంట్లు వంటి అంతరించిపోతున్న ఎన్నో అరుదైన వన్యప్రాణులను రక్షించుకోవచ్చని సైంటిస్టులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిశ్శబ్దంగా అడవిలో సాగిపోయే పులుల 'వాసన' ఇప్పుడు ఎన్నో రహస్యాలను ప్రపంచానికి చెబుతోంది.

Advertisement
Advertisement