త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

పిలుపులేమో స్వదేశీ… దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?

దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ప్రజలు ఖర్చులు తగ్గించుకోవాలన్న ప్రభుత్వ పొదుపు మంత్రం వినడానికి బాగానే ఉంటుంది. కానీ, రికార్డు స్థాయి ఫారెక్స్ నిల్వలు ఉన్నా రూపాయి ఎందుకు పతనమవుతోంది, దిగుమతుల భారం ఎందుకు తగ్గడం లేదో వాస్తవ గణాంకాలతో విశ్లేషిస్తున్న కథనం ఇది.

S

National | Published On Sep 3, 2026, 6.00 am IST

పిలుపులేమో స్వదేశీ… దిగుమతులేమో విదేశీ: ఎన్నాళ్ళీ రూపాయి కుంగుబాటు?

సంక్షిప్త సారాంశం

రూపాయిని కాపాడాల్సింది జనాల పొదుపు కాదు, దేశీయ ఉత్పత్తి! భారీ వాణిజ్య లోటు, చైనా దిగుమతులు, చమురు ఆధారపడటాన్ని వదిలి 'నిజమైన మేక్ ఇన్ ఇండియా' దిశగా అడుగులు పడకపోతే, కేవలం మాటలతో ఆర్థిక స్వయంసమృద్ధి సాధ్యం కాదనేదే ఈ కథన సారాంశం.

Advertisement

జనానికి ఖర్చుల అదుపు పాఠాలు సరే... మరి దిగుమతుల కోత ప్లాన్ ఏది?

 

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలను ఉద్దేశించి విదేశీ మారకద్రవ్యాన్ని ఆదా చేసేలా కొన్ని పొదుపు చర్యలకు పిలుపునిచ్చారు. బంగారం కొనుగోళ్లను వాయిదా వేసుకోవడం, విదేశీ ప్రయాణాలు తగ్గించి "డెస్టినేషన్ వెడ్డింగ్స్"ను భారత్‌లోనే జరపడం, ఇంధనాన్ని ఆదా చేసేందుకు మెట్రో, ఎలక్ట్రిక్ బస్సులు వంటి ప్రజా రవాణాను వాడడం, స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించడం వంటివి వ్యక్తిగత లేదా కుటుంబ స్థాయిలో మంచి ఆర్థిక నియంత్రణ సూచనలే కావచ్చు. కానీ, ఒక దేశ ఆర్థిక వ్యవస్థను నడిపే ప్రభుత్వ బాధ్యత కేవలం ప్రజలకు పొదుపు పాఠాలు చెప్పడంతోనే ముగిసిపోదు. ప్రజలకు 'తక్కువ ఖర్చు చేయండి' అని చెప్పడం ఒకెత్తు. అదే సమయంలో 'ఎక్కువ ఉత్పత్తి చేయండి, ఎక్కువ ఎగుమతి చేయండి, అనవసరమైన దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించండి' అనే వాతావరణాన్ని కల్పించి, ఆ ఫలితాన్ని దేశ ప్రజలకు చూపించాల్సిన ప్రాథమిక బాధ్యత పాలనా వ్యవస్థలదే.

రికార్డు Forex నిల్వలు ఉన్నా... రూపాయిపై నిరంతర ఒత్తిడి!

ఆగస్టు 21, 2026 నాటికి భారత విదేశీ మారక నిల్వలు (Forex Reserves) రికార్డు స్థాయిలో 729.33 బిలియన్ డాలర్లకు చేరాయి. అయినప్పటికీ, సెప్టెంబర్ 2 ముగింపు నాటికి డాలర్‌తో రూపాయి విలువ 94.97 వద్ద స్థిరపడింది. అంతకుముందు 2026 మేలో రూపాయి ₹96.96 వద్ద ఆల్‌టైమ్ రికార్డు కనిష్ఠాన్ని తాకిన సంగతి తెలిసిందే. ఇక్కడ ఉత్పన్నమయ్యే ప్రధానమైన ప్రశ్న ఏమిటంటే... రికార్డు నిల్వలు ఉన్నంత మాత్రాన రూపాయి బలపడుతుందనడానికి హామీ లేదు. ఈ నిల్వలు పెరగడం ఒక అంశమైతే, వాటిని దీర్ఘకాలికంగా పెంచే స్థిరమైన మూలాలు—ఎగుమతులు, సేవల ఆదాయం, విదేశీ పెట్టుబడులు, ఇతర విదేశీ మారక ద్రవ్య రాబడి ఎంత బలంగా ఉన్నాయి అన్నదే ఆర్థిక వ్యవస్థ స్థిరత్వానికి అత్యంత కీలకం.

వస్తువుల వాణిజ్య లోటు: $333 బిలియన్ల సవాలు!

ప్రజల చిన్న చిన్న పొదుపు చర్యలతో దేశపు వాణిజ్య లోటును పూడ్చడం సాధ్యమా? FY2025-26 గణాంకాల ప్రకారం, వస్తువుల వాణిజ్యంలో (Merchandise Trade) భారత్‌కు ఏకంగా 333.19 బిలియన్ డాలర్ల భారీ లోటు నమోదైంది. ఐటీ మరియు ఇతర సేవల రంగాలు గణనీయమైన మిగులును తెచ్చిపెడుతూ మొత్తం వాణిజ్య లోటు తీవ్రతను కొంతవరకు తగ్గిస్తున్నప్పటికీ, వస్తువుల వాణిజ్యంలో ఇంత భారీ లోటు ఉండటం విదేశీ మారకద్రవ్యంపై నిరంతర ఒత్తిడిని పెంచుతోంది. అనవసరమైన దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించే స్థాయిలో, గ్లోబల్ మార్కెట్లలో పోటీ పడగల తయారీ సామర్థ్యాన్ని భారత్ ఎంతవరకు పెంచగలిగిందనేది పాలకుల ముందు దేశ ప్రజలు ఉంచిన ప్రశ్న.

మేక్ ఇన్ ఇండియా' సవాలు... సేవల ఆధిపత్యం మధ్య తయారీ సామర్థ్యం ఎంత?

మేక్ ఇన్ ఇండియా' ప్రధాన లక్ష్యాల్లో తయారీ సామర్థ్యాన్ని విస్తరించడం, దేశీయ ఉత్పత్తిని పెంచడం కీలక అంశం. అయితే తాజా జాతీయ ఖాతాల గణాంకాలు భారత ఆర్థిక వ్యవస్థలో సేవల రంగం ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయి. 2024-25లో GVAలో Tertiary sector (సేవల రంగం) వాటా 52.9 శాతం కాగా, Secondary sector వాటా 25.8 శాతం. అయితే Secondary sectorలో తయారీతో పాటు నిర్మాణం, విద్యుత్, గ్యాస్, నీటి సరఫరా వంటి రంగాలు కూడా ఉంటాయి. ఇందులో తయారీ వాటా ఇంకా తక్కువగానే ఉంది. కాబట్టి అసలు ప్రశ్న—తయారీ రంగంలో అధిక విలువ కలిగిన ఉత్పత్తులు, ఇంటర్మీడియట్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్ తయారీ సామర్థ్యాన్ని భారత్ ఎంతవరకు పెంచింది?

క్రూడ్ ఆయిల్ దిగుమతులు 88.7%... ఇంధన భద్రత ఎక్కడ?

భారతదేశ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు ఇంధన దిగుమతులు. పెట్రోలియం ప్లానింగ్ అండ్ అనాలిసిస్ సెల్ (PPAC) డేటా ప్రకారం, భారతదేశం తన క్రూడ్ ఆయిల్ వినియోగ అవసరాల్లో ఏకంగా 88.7 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఆయిల్ నిల్వల కోసం వ్యూహాత్మక చమురు నిల్వ సామర్థ్యానికి సంబంధించి SPR Phase-Iలో 5.33 MMT సామర్థ్యం అందుబాటులో ఉండగా, Phase-II కింద మరో 6.5 MMT సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడానికి ఆమోదం లభించింది. అంతర్జాతీయంగా 90 రోజుల బెంచ్‌మార్క్ లక్ష్యాన్ని చేరడానికి భారతదేశానికి మరింత విస్తృతమైన నిల్వ సామర్థ్యం అవసరం. పెట్రోలియం రంగం ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు భారీ ఆదాయం సమకూరుతున్నప్పటికీ, అందులో ఎంత భాగం పునరుత్పాదక ఇంధన రంగానికి, ప్రజా రవాణా విస్తరణకు మళ్లిందనేది ఇక్కడ కీలకమైన అంశం. ఇదే జరిగి ఉంటే క్రూడ్ ఆయిల్ దిగుమతులపై ఆధారపడే పరిస్థితి కొంత తగ్గుతుందన్నదే నిజం. ఇలా ఎందుకు చేయలేకపోతుందీ పాలక వర్గం అనేది దేశ ప్రజలు ప్రస్తుత పాలకుల ముందు ఉంచుతున్న ప్రశ్న.

చైనాతో పెరుగుతున్న వాణిజ్య లోటు... స్వయంసమృద్ధి ఏది?

స్వదేశీ నినాదాలు ఒకవైపు వినిపిస్తున్నా, చైనాతో భారత వాణిజ్య లోటు ఏప్రిల్-అక్టోబర్ 2025 వ్యవధిలో 58.09 బిలియన్ డాలర్ల నుంచి 63.97 బిలియన్ డాలర్లకు పెరిగింది... అంటే 10.1 శాతం వృద్ధి చెందింది. ప్రభుత్వం పార్లమెంటులో వెల్లడించిన వివరాల ప్రకారమే... చైనా నుంచి వచ్చే దిగుమతుల్లో ముడిసరుకులు, ఇంటర్మీడియట్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, ఆటో కాంపొనెంట్లు, ఎలక్ట్రానిక్ భాగాలు, మొబైల్ ఫోన్ పార్ట్స్, యంత్రాలు, APIs—ముఖ్యమైన వాటా కలిగి ఉన్నాయి. ఇదే కాలంలో చైనాకు భారత ఎగుమతులు కూడా 24.7% పెరిగినా (8.04 బిలియన్ డాలర్ల నుంచి 10.02 బిలియన్ డాలర్లకు), దిగుమతులు మరింత పెద్ద స్థాయిలో ఉండటంతో ద్వైపాక్షిక వాణిజ్య లోటు పెరిగింది. దేశీయంగా వీటికి బలమైన ప్రత్యామ్నాయ ఉత్పత్తులు సిద్ధం కానంత వరకు "విదేశీ వస్తువులను కొనేది లేదు" లేదా "విదేశీ ప్రయాణాలు మానండి" అనే పిలుపులు ఆచరణలో పూర్తి విజయం సాధించలేవు.

పాలనా దార్శనికతలోనే ఉంది అసలు పరిష్కారం!

అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, అమెరికా డాలర్ బలోపేతం కావడం, వడ్డీ రేట్ల మార్పులు వంటివి మన చేతుల్లో లేని అంశాలు. కానీ ఈ బాహ్య ఒత్తిళ్లను మన దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతవరకు తట్టుకోగలదన్నది మన దేశీయ ఉత్పత్తి, ఎగుమతి, ఇంధన భద్రత, దిగుమతి ఆధారపడటాన్ని తగ్గించే సామర్థ్యంపై కూడా ఆధారపడి ఉంటుంది. ప్రజలు తమ వినియోగాన్ని అదుపులో ఉంచుకోవాలని కోరడం తాత్కాలికంగా కొంత ఊరటనివ్వవచ్చు. అయితే ఎగుమతులు పెరగడం అంటే కేవలం ఎక్కువ వస్తువులు అమ్మడం కాదు. అధిక విలువ కలిగిన తయారీ, ఇంటర్మీడియట్ గూడ్స్, క్యాపిటల్ గూడ్స్, టెక్నాలజీ ఆధారిత ఉత్పత్తులలో ప్రపంచ సరఫరా గొలుసుల్లో భారత్ తన స్థానాన్ని పెంచుకోవడమే అసలైన ఎగుమతి సామర్థ్యం. విదేశీ మారకద్రవ్యాన్ని నిజంగా రక్షించి రూపాయిని నిలబెట్టాలంటే మాత్రం... దిగుమతులపై తీవ్రంగా ఆధారపడిన ఆర్థిక నిర్మాణాన్ని మార్చి, ప్రత్యామ్నాయ ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచడమే ప్రభుత్వం ముందున్న నిజమైన పరీక్ష! ప్రజలకు ఇలాంటి పిలుపులు ఇచ్చే ముందు పాలకులు తమ ముందున్న ప్రణాళికలు వివరించి ఉంటే బాగుండేది. అంతే కాని ఈ సమస్య ప్రజల దుబారా నుండి పుట్టిందే అన్నట్లు గా ప్రకటన విడుదల చేయడం మాత్రం సరి కాదు.

Advertisement
Advertisement