త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుంచాం.. రాష్ట్రాన్ని మ‌రింత అప్పులపాలు చేస్తున్నరు

Ramchandar Rao | కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచామ‌ని.. ఆరు గ్యారెంటీలతో పాటు బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలు సహా అనేక వాగ్దానాల‌ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు అన్నారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌లను యువ‌త‌ ఆద‌ర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో క‌లిసి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు.

S

Telangana | Published On Aug 15, 2026, 1.07 pm IST

Ramchandar Rao | ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌ను ప్ర‌జ‌ల ముందుంచాం.. రాష్ట్రాన్ని మ‌రింత అప్పులపాలు చేస్తున్నరు
Advertisement
  • భ‌గ‌త్‌సింగ్, చంద్ర‌శేఖ‌ర్ ఆజాద్ వంటి విప్ల‌వ వీరుల‌ను ఆద‌ర్శంగా తీసుకోవాలి
  • తెలంగాణ‌కు మోదీ ఎన్నో అందించారు
  • 80వ‌ స్వాతంత్య్ర వేడుక‌ల్లో బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల ముందుంచామ‌ని.. ఆరు గ్యారెంటీలతో పాటు బీసీ రిజర్వేషన్లపై ఇచ్చిన హామీలు సహా అనేక వాగ్దానాల‌ను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు అన్నారు. దాదాపు రూ.12,000 కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందన్నారు. మరోవైపు రాష్ట్రాన్ని మరింత అప్పుల ఊబిలోకి నెడుతున్నారని ఆరోపించారు. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్‌లను యువ‌త‌ ఆద‌ర్శంగా తీసుకుని దేశ నిర్మాణంలో క‌లిసి ప‌ని చేయాల‌ని పిలుపునిచ్చారు. 80వ స్వాతంత్య్ర‌ దినోత్సవం సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన అనంత‌రం ఆయ‌న మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ స్వాతంత్య్ర‌ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.

దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణత్యాగాలు చేసిన అసంఖ్యాక అమరవీరులు, స్వాతంత్య్ర‌ సమరయోధులకు నివాళులర్పించాను. గత 12 ఏళ్లుగా ప్రధానమంత్రి మోదీ దూరదృష్టితో కూడిన నాయకత్వంలో భారత్ ప్రతి రంగంలోనూ అద్భుతమైన పురోగతి సాధించింది. నేడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. ఐటీ, సెమీకండక్టర్లు, మౌలిక వసతులు, అంతరిక్ష రంగం నుంచి రక్షణ ఉత్పత్తుల తయారీ వరకు భారత్ అపూర్వమైన ఆత్మవిశ్వాసం, సామర్థ్యంతో ముందుకు సాగుతోంది.

మోదీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి విశేష సహకారం అందిస్తోంది. సమ్మక్క-సారలమ్మ గిరిజన విశ్వవిద్యాలయం, సికింద్రాబాద్ సహా పలు రైల్వే స్టేషన్ల ఆధునీకరణ, కాజీపేట రైల్వే మ్యానుఫాక్చరింగ్ యూనిట్, ఆర్‌ఎఫ్‌సీఎల్ పునరుద్ధరణ, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్కు, జహీరాబాద్ నిమ్జ్, హైదరాబాద్‌లో సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ (CARO), ఎంఎంటీఎస్ విస్తరణ వంటి అనేక ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులను కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు అందించింది.

ఉద్యోగాలు క‌ల్పించే స్థాయికి ఎదిగేలా ప్రోత్స‌హిస్తున్నాం..

స్టార్టప్ ఇండియా, స్టాండప్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, ముద్ర వంటి కార్యక్రమాల ద్వారా యువతను కేవలం ఉద్యోగాలు కోరుకునే వారిగా కాకుండా, ఉద్యోగాలు కల్పించే పారిశ్రామికవేత్తలుగా ఎదిగేలా ప్రోత్సహిస్తున్నాం. భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్ వంటి మహనీయ విప్లవ వీరుల ధైర్యసాహసాలు, దేశభక్తిని ఆదర్శంగా తీసుకుని యువత దేశ నిర్మాణానికి అంకితభావంతో కృషి చేయాలి. విభజనాత్మక, దేశ వ్యతిరేక భావజాలాన్ని ప్రోత్సహించే శక్తులను, బుజ్జగింపు, మతతత్వ రాజకీయాల ద్వారా దేశ ఐక్యతను బలహీనపరచాలని చూసేవారిని క్ష‌మించ‌బోం. దేశ ఐక్యత, సార్వభౌమత్వం, జాతీయ స్వాభిమానంపై ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ ఉండదు.

మోదీ నాయకత్వంలో ఉగ్రవాదంపై ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా ఉండబోమని భారత్ ప్రపంచానికి స్పష్టం చేసింది. దేశ సరిహద్దులను కాపాడటమే కాకుండా, మన భద్రతకు ముప్పు కలిగించే శక్తులకు తగిన సమాధానం చెప్పగల శక్తి, సంకల్పం నేటి భారతదేశానికి ఉన్నాయి అని రాంచంద‌ర్‌రావు స్ప‌ష్టం చేశారు.

ఈ వేడుకల్లో కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, రాజ్యసభ సభ్యుడు డాక్టర్ కె.లక్ష్మణ్, బీజేపీ కర్ణాటక-తమిళనాడు కో-ఇంచార్జ్ పొంగులేటి సుధాకర్ రెడ్డి, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్సీ అంజిరెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు డాక్టర్ ఎన్.గౌతమ్ రావు, వేముల అశోక్, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement