Thali | వెజ్ థాలి అంటే తెలుసు కదా. దాన్నే హార్టీ మీల్ అని కూడా అంటారు. పప్పు, అన్నం, చపాతీ, ఒక కూర, పచ్చడి, అప్పడం, పెరుగు.. ఇలా అన్నీ కలిపి తింటే వచ్చే మజాయే వేరు. అందుకే దాన్ని థాలి అంటారు. మన దగ్గర అన్నం ఎక్కువగా తింటాం. అదే నార్త్‌లో అన్నం తక్కువగా తిని రోటీలు ఎక్కువగా తింటారు. అందుకే దాన్ని థాలి అంటారు. నార్త్‌లో ఎక్కడికెళ్లినా ఈ థాలి రెస్టారెంట్లే కనిపిస్తాయి. అయితే.. ఏ రెస్టారెంట్‌కి వెళ్లినా ఇలాంటి థాలి తినాలంటే కనీసం రూ.200 ఉంటుంది. కొంచెం పెద్ద రెస్టారెంట్ అయితే రూ.500 ఉంటుంది. కానీ.. ఇక నుంచి వెజ్ థాలిని 5 రూపాయలకే అందించనున్నారు. ఎక్కడో తెలుసా? ఢిల్లీలోని అటల్ క్యాంటీన్లలో. నగరంలో ఈరోజు నుంచి ప్రారంభం కానున్న 100 అటల్ క్యాంటీన్లలో వెజ్ థాలీని రూ.5 కే అందించనున్నారు. అటల్ క్యాంటీన్ స్కీమ్‌ని ప్రారంభించిన ఢిల్లీ ప్రభుత్వం.. ఈ స్కీమ్ ద్వారా నగరంలో 100 అటల్ క్యాంటీన్లను ఏర్పాటు చేస్తోంది. అటల్ బిహారీ వాజ్‌పేయి 101వ జయంతి సందర్భంగా గురువారం నుంచి నగరంలో ప్రారంభం అవుతున్న 100 అటల్ క్యాంటీన్లలో రూ.5 కే వెజ్ థాలి అందించనున్నారు. పేదలు, రోజువారి కూలీ పనులు చేసుకునే కార్మికులు, తక్కువ జీతానికి పనిచేసే వాళ్లకు అందుబాటులో ఉండేలా రూ.5 కే ఇక నుంచి వెజ్ థాలి అందిస్తున్నామని ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా తెలిపారు. ఆమె ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అటల్ క్యాంటీన్ ఢిల్లీకి కేంద్ర బిందువు కాబోతోంది. ఈ నగరంలో ఎవ్వరూ ఆకలితో పడుకోకూడదు అనే లక్ష్యంతోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాం.. అని ముఖ్యమంత్రి తెలిపారు. ఢిల్లీలోని ఆర్కే పురం, జంగ్‌పుర, షాలిమార్ భాగ్, గ్రేటర్ కైలాష్, రాజౌరి గార్డెన్, నరెల, బావన లాంటి ప్రాంతాల్లో కొత్తగా 45 అటల్ క్యాంటీన్లను గురువారం ప్రారంభించారు. మరో 55 క్యాంటీన్లను త్వరలోనే ప్రారంభిస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. ఈ క్యాంటీన్లలో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 వరకు లంచ్ ఉంటుందని, సాయంత్రం 6.30 నుంచి రాత్రి 9.30 వరకు డిన్నర్ ఉంటుందని.. రోజుకు ఒక క్యాంటీన్లో కనీసం 500 మంది వరకు తినేలా ఫుడ్‌ని నిర్వాహకులు వండుతారు.