చాలామంది ఉద్యోగులు ఆఫీస్ పని అయిపోయిన తర్వాత కూడా ఇంటికి వచ్చాక కూడా ఫోన్లలో ఆఫీసు పనులు గురించే మాట్లాడుతుంటారు. మెయిల్స్ చెక్ చేస్తుంటారు. ఇంటికి వచ్చి కూడా కుటుంబ సభ్యులతో గడపకుండా లాప్‌టాప్‌లు ఓపెన్ చేసి పని చేస్తుంటారు. ఇలా ఇంటికి వచ్చాక కూడా ఆఫీసు పని చేస్తుండటంతో చాలామంది ఉద్యోగులు పని ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. అందుకే ఆఫీసు టైమ్ తర్వాత వచ్చే ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌తో విసిగి పోయిన ఉద్యోగులకు ఇది ఒక శుభవార్త అనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించిన ఒక బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టారు. అదే రైట్ టు డిస్‌కనెక్ట్ బిల్లు, 2025. దీన్ని గత శుక్రవారమే ఎస్‌సీపీ పార్టీకి చెందిన ఎంపీ సుప్రియా సూలే ప్రవేశ పెట్టారు. అయితే.. ఇది ప్రైవేట్ మెంబర్ మిల్లు. అసలేంటి ఈ బిల్లు? ఈ బిల్లు ప్రకారం ఉద్యోగులు తమ పనివేళలు ముగిసిన తర్వాత లేదా సెలవు రోజుల్లో ఆఫీసుకు సంబంధించిన ఫోన్ కాల్స్, ఈమెయిల్స్‌కు స్పందించాల్సిన అవసరం లేకుండా ఉండే హక్కును ఈ బిల్లు కల్పిస్తుంది. ఆఫీస్ టైమ్ తర్వాత లేదా సెలవు రోజున బాస్ ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకపోయినా, మెయిల్స్‌కు రిప్లయి ఇవ్వకపోయినా ఉద్యోగులపై ఎలాంటి చర్యలు తీసుకోకూడదు. ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకే ఎంప్లాయిస్ వెల్ఫేర్ అథారిటీని ఏర్పాటు చేసేలా ఈ బిల్లు ప్రతిపాదించింది. ఆస్ట్రేలియాలో ఇలాంటి చట్టం అమలులో గత సంవత్సరం ఇలాంటి చట్టమే ఆస్ట్రేలియాలో అమలులోకి వచ్చింది. అక్కడి ఉద్యోగులు పనివేళల తర్వాత తమ బాస్ ఫోన్ చేసినా, మెయిల్స్ పంపించినా, ఏదైనా వర్క్ అసైన్ చేసినా ఆ ఉద్యోగులు చేయాల్సిన అవసరం లేదు. మన దేశంలో మాత్రం ఉద్యోగుల ఒత్తిడి రోజురోజుకూ ఎక్కువవుతుంది. ఉద్యోగుల పనివేళల తర్వాత కూడా కొందరు బాస్‌లు వాళ్లకు కాల్స్ చేయడం, పని చేయాలని ఒత్తిడి చేస్తుండటంతో మానసిక ఆరోగ్యం దెబ్బతిని చాలా మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. అందుకే ఉద్యోగుల మెంటల్ హెల్త్‌ను దృష్టిలో పెట్టుకొని ఈ బిల్లును రూపొందించారు. సర్వేలో షాకింగ్ నిజాలు వెల్లడి ఇటీవల ఇండీడ్ అనే కెరీర్ సంస్థ ఓ సర్వే నిర్వహించింది. ఆ సర్వే ప్రకారం భారత్‌లో 88 శాతం మంది ఉద్యోగులు ఆఫీస్ టైమ్ తర్వాత కూడా ఆఫీస్ పనులు చేస్తున్నారట. సెలవుల్లో ఉన్నా కూడా 85 శాతం మంది బాస్ నుంచి ఫోన్ వచ్చినా, మెయిల్స్ వచ్చినా అటెంప్ట్ చేయాల్సి వస్తోందట. ఇది మెంటల్ హెల్త్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేట్ మెంబర్ బిల్లు అంటే ఏంటి? ఎన్‌సీపీ ఎంపీ సుప్రియ ప్రవేశ పెట్టిన ఆ బిల్లు ఒక ప్రైవేటు మెంబర్ బిల్లు. అంటే మంత్రులు కాకుండా ఎంపీలు ప్రవేశపెట్టే బిల్లు అన్నమాట. ఇలాంటి బిల్లులను ప్రభుత్వం వెంటనే ఆమోదించదు. సభలో బిల్లుపై చర్చ జరిపి అందరి అభిప్రాయాలను తీసుకొని ఆ తర్వాత ఆ బిల్లును చట్టం చేయాలా? లేదా? అని నిర్ణయం తీసుకుంటుంది.