త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

August 15 | నిఘానీడ‌లో ఎర్ర‌కోట‌.. పంద్రాగ‌స్టుకు క‌ట్టుదిట్ట‌బ‌మైన భ‌ద్ర‌త‌

August 15 | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ న‌గ‌రం ముస్తాబవుతోంది. ఎర్రకోట వేదికగా జరిగే వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వివిధ భద్రతా విభాగాలకు చెందిన సుమారు 15 వేల నుంచి 20 వేల మంది సిబ్బందిని విధుల్లో మోహరించనున్నట్లు నార్త్‌ ఢిల్లీ డీసీపీ రాజా బంతియా తెలిపారు.

P

National | Published On Aug 9, 2026, 3.50 pm IST

August 15 | నిఘానీడ‌లో ఎర్ర‌కోట‌.. పంద్రాగ‌స్టుకు క‌ట్టుదిట్ట‌బ‌మైన భ‌ద్ర‌త‌
Advertisement
  • 15వేల నుంచి 20వేల మందికిపైగా సిబ్బంది మోహ‌రింపు
  • వెయ్యికిపైగా సీసీ కెమెరాల‌తో నిఘా

August 15 | స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఢిల్లీ న‌గ‌రం ముస్తాబవుతోంది. ఎర్రకోట వేదికగా జరిగే వేడుకలకు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు. వివిధ భద్రతా విభాగాలకు చెందిన సుమారు 15 వేల నుంచి 20 వేల మంది సిబ్బందిని విధుల్లో మోహరించనున్నట్లు నార్త్‌ ఢిల్లీ డీసీపీ రాజా బంతియా తెలిపారు. భద్రతా ఏర్పాట్లను ప్రధానంగా సిబ్బంది, సాంకేతిక విభాగాలుగా విభజించినట్లు ఆయన వెల్లడించారు. ఢిల్లీ పోలీస్‌ ట్రాఫిక్‌ విభాగం, నార్త్‌ జిల్లా పోలీసులు, స్థానిక పోలీస్‌ బృందాలు, పీసీఆర్‌, స్పెషల్‌ బ్రాంచ్‌, స్పెషల్‌ సెల్‌తో పాటు ఇతర భద్రతా బలగాలు విధుల్లో ఉంటాయని తెలిపారు.

కమాండోలు, స్నైపర్ల మోహరింపు

ఎర్రకోట పరిసరాల్లో పెద్ద సంఖ్యలో పారామిలటరీ బలగాలను మోహరించనున్నారు. కమాండోలు, నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్‌ (ఎన్‌ఎస్‌జీ) బృందాలతో పాటు హిట్‌ టీమ్స్‌, స్నైపర్లను కీలక ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. అత్యవసర పరిస్థితులను ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు స్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌) బృందం కూడా అందుబాటులో ఉంటుంది. వ్యూహాత్మక ప్రాంతాల్లో క్విక్‌ రియాక్షన్‌ టీమ్స్‌ (క్యూఆర్‌టీ)ను మోహరిస్తారు. వాచ్‌టవర్ల నుంచి కూడా నిరంతరం నిఘా కొనసాగుతుంది. భూమిపై ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీమ్‌లు వెంటనే రంగంలోకి దిగేలా ప్రత్యేక ప్రాంతాలను గుర్తించారు.

వెయ్యికి పైగా సీసీ కెమెరాలు

భద్రతలో సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగిస్తున్నారు. ఎర్రకోటతో పాటు పరిసర ప్రాంతాల్లో వెయ్యికి పైగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. వీటి దృశ్యాలను నిరంతరం పర్యవేక్షించేందుకు ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌లను ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన సిబ్బంది కెమెరాల ద్వారా ప్రత్యక్ష ప్రసారాలను ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. అవసరమైన ప్రాంతాల్లో వీడియో అనలిటిక్స్‌ సాంకేతికతను కూడా అందుబాటులోకి తెచ్చారు. ఫేస్ రికగ్నిషన్ వ్యవస్థ (ఎఫ్‌ఆర్‌ఎస్‌), వాహనాల నంబర్‌ ప్లేట్‌ గుర్తింపు, చొరబాట్లను గుర్తించే వ్యవస్థలను వినియోగిస్తున్నారు. కొంతమంది పోలీసు సిబ్బందికి బాడీ వోర్న్‌ కెమెరాలను సైతం అందించారు.

డ్రోన్లపైనా నిఘా

డ్రోన్ల ద్వారా ఎదురయ్యే ముప్పులను అడ్డుకునేందుకు యాంటీ డ్రోన్‌ వ్యవస్థలను ఏర్పాటు చేశారు. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న కార్యకలాపాలు, చర్చలపైనా పోలీసులు నిఘా కొనసాగిస్తున్నారు. భద్రతా సిబ్బందికి అవసరమైన బ్రీఫింగ్‌లు, శిక్షణ కార్యక్రమాలన్నీ ఇప్పటికే పూర్తయ్యాయని డీసీపీ రాజా బంతియా తెలిపారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఎలాంటి అవాంతరాలు లేకుండా నిర్వహించేందుకు పోలీసులు పూర్తిస్థాయిలో సిద్ధంగా ఉన్నారని వివ‌రించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement