త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతే లక్ష్యం : BOSS స్టీరింగ్ కమిటీ

BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడమే బ్రాహ్మిణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (BOSS) లక్ష్యమని ఆ సంస్థ స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. నాగోల్‌లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన BOSS సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500-600 మంది బ్రాహ్మణులు హాజరయ్యారు.

P

Telangana | Published On Aug 8, 2026, 7.58 pm IST

BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతే లక్ష్యం : BOSS స్టీరింగ్ కమిటీ
Advertisement

BOSS | బ్రాహ్మణ సమాజ ఐక్యతను బలోపేతం చేయడంతో పాటు పేద, ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాల అభ్యున్నతికి కృషి చేయడమే బ్రాహ్మిణ్ ఆర్గనైజేషన్స్ ఫర్ సోషల్ సర్వీస్ (BOSS) లక్ష్యమని ఆ సంస్థ స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది. నాగోల్‌లోని వసంత్ విహార్ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన BOSS సమావేశానికి రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 500-600 మంది బ్రాహ్మణులు హాజరయ్యారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ (TBSP) చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. బసవరాజు శ్రీనివాస్ TBSP చైర్మన్‌గా నియమితులైన తర్వాత BOSS సంస్థాగత వ్యవహారాలను స్టీరింగ్ కమిటీ ఆధ్వర్యంలో కొనసాగిస్తున్నట్లు కమిటీ తెలిపింది. BOSS ఏ రాజకీయ పార్టీకి అనుకూలంగా, వ్యతిరేకంగా పనిచేయదని, పేద బ్రాహ్మణుల విద్య, ఉపాధి, ఆర్థిక సాధికారత, గృహ వసతి కోసం రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందని పేర్కొంది.

3వేల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన

‘దుదిళ్ల శ్రీపాదరావు అగ్రహారం-అఫోర్డబుల్ హౌసింగ్ సొసైటీ’ పేరుతో సుమారు 3 వేల ఇళ్ల నిర్మాణానికి ప్రతిపాదన రూపొందించినట్లు BOSS తెలిపింది. అన్ని మౌలిక వసతులతో గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మించి, సాధ్యమైనంత వరకు నిర్మాణ వ్యయానికే ఇళ్లు అందించాలన్నది ప్రణాళిక ఉద్దేశమని వెల్లడించింది. బ్రాహ్మణ కుటుంబాలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు త్వరలో ‘శ్రీపాద తెలంగాణ బ్రాహ్మణ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ’ ఏర్పాటు దిశగా చర్యలు కొనసాగుతున్నాయని తెలిపింది.

విభేదాలు సృష్టిస్తే సహించం

వ్యక్తిగత ప్రయోజనాల కోసం ప్రభుత్వం, బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌పై విమర్శలు చేస్తూ సమాజంలో ప్రాంతీయ, వ్యక్తిగత విభేదాలు రెచ్చగొట్టడం సరికాదని స్టీరింగ్ కమిటీ పేర్కొంది. సమాజాన్ని విభజించి స్వప్రయోజనాలు పొందే ప్రయత్నాలను బ్రాహ్మణులు ఐక్యంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చింది. అయితే విమర్శలు చేస్తున్న వారు కూడా వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి నిర్మాణాత్మకంగా పనిచేయాలని సూచించింది. తెలంగాణ ఉద్యమాన్ని ఏ ఒక్క కులానికో, వర్గానికో ఆపాదించడం సరికాదని స్పష్టం చేసింది. అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందిన ప్రజలు ఉద్యమంలో పాల్గొన్నారని పేర్కొంది. ఇతర వర్గాలను దూరం చేసేలా తెలంగాణ ఉద్యమ చరిత్రను ఒకే కులానికి పరిమితం చేయవద్దని కోరింది. ‘సర్వేజనా సుఖినో భవంతు’ భావనతో అందరి సంక్షేమం కోసం పనిచేయడమే బ్రాహ్మణ ధర్మమని తెలిపింది.

సెప్టెంబర్ 6న యువ సమ్మేళనం

బ్రాహ్మణ యువతలో నాయకత్వాన్ని ప్రోత్సహించేందుకు సెప్టెంబర్ 6న BOSS ఆధ్వర్యంలో యువ సమ్మేళనం నిర్వహించనున్నట్లు ప్రకటించింది. యువత పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరింది. ఎండోమెంట్ పరిధిలోని దేవాలయాల పాలకమండళ్లలో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరినట్లు తెలిపింది. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యే లేదా ఇన్‌చార్జి మంత్రి సిఫారసుతో బ్రాహ్మణ సమాజం నుంచి ఒక కోఆర్డినేటర్‌ను నియమించాలని TBSP ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు వెల్లడించింది.

కులగణనలో నమోదు చేసుకోవాలి..

BOSS ఆధ్వర్యంలో చేపడుతున్న బ్రాహ్మణ కులగణనలో ప్రతి కుటుంబం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలని స్టీరింగ్ కమిటీ కోరింది. సమాజానికి సంబంధించిన వాస్తవిక సమాచారం ఆధారంగా భవిష్యత్ సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనకు ఇది దోహదపడుతుందని పేర్కొంది. బ్రాహ్మణ సమాజంలోని మేధస్సు, ప్రతిభను పరస్పర విమర్శలకు కాకుండా విద్య, ఉపాధి, యువత భవిష్యత్, పేదల సంక్షేమం, ఆర్థిక సాధికారత కోసం వినియోగించాలని పిలుపునిచ్చింది. ‘బ్రాహ్మణ సమాజాన్ని చీల్చడం కాదు.. కలపడం మా లక్ష్యం. వ్యక్తిగత ప్రయోజనాలు కాదు.. సమాజ ప్రయోజనమే ప్రాధాన్యం’ అని BOSS స్టీరింగ్ కమిటీ స్పష్టం చేసింది.

Advertisement
Advertisement