త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్

బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోయినా వందే భారత్ రైలును ఏకంగా 463 కిలోమీటర్లు నడిపించారు. పైలట్లు హెచ్చరించినా అధికారులు ఎందుకు పట్టించుకోలేదు?

J

National | Published On Nov 15, 2026, 5.57 pm IST

Vande Bharat Brake Failure | బ్రేకులు లేకుండానే 463 కిమీలు పరుగులు తీసిన వందే భారత్

సంక్షిప్త సారాంశం

జార్ఖండ్‌లోని హతియా నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీకి ఖాళీ వందే భారత్ రైలును బ్రేకులు పనిచేయని స్థితిలోనే 463 కిలోమీటర్లు నడిపించారు. అక్టోబర్ 24న జరిగిన ఈ తీవ్ర భద్రతా వైఫల్యంపై సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) జోన్ ఉన్నత స్థాయి విచారణకు ఆదేశించింది. రైలుకు బ్రేక్ పవర్ సరిగ్గా లేదని లోకో పైలట్లు రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినా, కంట్రోలర్లు పట్టించుకోకుండా రైలును ముందుకు పంపారు. చివరకు యూపీలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్టేషన్‌లో తనిఖీ చేయగా, కోచ్‌లన్నింటి బ్రేకింగ్ సిస్టమ్ 'ఐసోలేట్' (నిలిపివేసి) అయి ఉన్నట్లు తేలింది.

Advertisement
  • రైల్వే శాఖలో ఘోర తప్పిదం
  • లోకో పైలట్లు మొత్తుకున్నా పట్టించుకోని అధికారులు

Vande Bharat Brake Failure | త్రినేత్ర న్యూస్ : భారతీయ రైల్వేలో ప్రయాణికుల భద్రతను ప్రశ్నార్థకం చేసే ఓ దిగ్భ్రాంతికర ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బ్రేకింగ్ సిస్టమ్ సరిగ్గా పనిచేయని ఓ ఖాళీ వందే భారత్ (Vande Bharat) రైలును ఏకంగా 463 కిలోమీటర్ల దూరం నడిపించినట్లు తేలింది. అక్టోబర్ 24న జార్ఖండ్ నుంచి ఉత్తరప్రదేశ్ మధ్య జరిగిన ఈ తీవ్ర నిర్లక్ష్యంపై సౌత్ ఈస్టర్న్ రైల్వే (SER) జోన్ తీవ్రంగా స్పందించింది. రాంచీ డివిజనల్ రైల్వే మేనేజర్ (DRM) కు విచారణ ఆదేశాలు జారీ చేస్తూ నవంబర్ 7న ఉత్తర్వులు ఇచ్చింది. నవంబర్ 11న అస్సాంలో కోల్‌కతా-సైరాంగ్ ఎక్స్‌ప్రెస్ పట్టాలు తప్పిన ఘటనకు కొద్ది రోజుల ముందే ఈ ప్రమాదకర తప్పిదం జరగడం గమనార్హం.

అసలేం జరిగింది?

అక్టోబర్ 24న జార్ఖండ్‌లోని హతియా (Hatia) నుంచి ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ (Jhansi) కి ఓ ఖాళీ వందే భారత్ చైర్ కార్ రేక్‌ను తరలించాల్సి ఉంది. దీనిని ఒక గూడ్స్ లోకోమోటివ్ (ఇంజిన్) సాయంతో లాక్కెళ్లేలా ఏర్పాట్లు చేశారు. నిబంధనల ప్రకారం, వందే భారత్ బోగీల బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆ గూడ్స్ ఇంజిన్ బ్రేకింగ్ సిస్టమ్‌తో అనుసంధానం (Integration) చేయాలి. కానీ, రైల్వే సిబ్బంది ఆ పనిని సరిగ్గా చేయకపోగా, రైలు సిబ్బంది ఇచ్చిన హెచ్చరికలను సైతం గాలికి వదిలేశారు.

పైలట్లు మొత్తుకున్నా పట్టించుకోలేదు

హతియా స్టేషన్ నుంచి రైలు బయలుదేరిన వెంటనే, నిబంధనల ప్రకారం లోకో పైలట్ 'బ్రేక్ ఫీల్, బ్రేక్ పవర్ టెస్ట్' నిర్వహించారు. ఆ సమయంలో రైలుకు బ్రేక్ పవర్ చాలా బలహీనంగా ఉందని, బ్రేకులు అసలు పడటం లేదని గుర్తించారు.

రైలు రాంచీ స్టేషన్‌కు చేరుకోగానే, బ్రేక్ పవర్ సరిగ్గా లేదంటూ లోకో పైలట్ అధికారులకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ, రైలును అదే స్థితిలో ముందుకు పంపించారు.

ఆ తర్వాత మూరీ (Muri) స్టేషన్ నుంచి రైలును నడిపిన మరో లోకో పైలట్ కూడా ఇదే విషయాన్ని సంబంధిత కంట్రోలర్లకు నివేదించారు. బీపీ (BP) ప్రెజర్ తగ్గించినా బ్రేకులు పడటం లేదని స్పష్టంగా చెప్పారు. కానీ ఎవరూ స్పందించలేదు.

463 కిలోమీటర్ల తర్వాత అసలు విషయం బయటపడింది

ఇలా కేవలం ఇంజిన్ బ్రేకులు, రీజెనరేటివ్ బ్రేకింగ్ సాయంతోనే ఆ రైలు సుమారు 463 కిలోమీటర్లు ప్రయాణించింది. చివరకు ఉత్తరప్రదేశ్‌లోని చందౌలీ జిల్లాలో ఉన్న దీన్ దయాళ్ ఉపాధ్యాయ (DDU) స్టేషన్‌కు చేరుకున్న తర్వాత అక్కడి సిబ్బంది ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. అధికారులు రైలును క్షుణ్ణంగా తనిఖీ చేయగా.. వందే భారత్ కోచ్‌లన్నింటి బ్రేకింగ్ సిస్టమ్‌లు 'ఐసోలేట్' (నిలిపివేసి) అయి ఉన్నాయని, అందుకే బోగీలకు బ్రేకులు పడటం లేదని తేలింది.

సిబ్బంది నిర్లక్ష్యం

ప్రాథమిక విచారణలో రైల్వే సిబ్బంది నిర్లక్ష్యం స్పష్టంగా బయటపడింది.

రైలు బయలుదేరే ముందే బ్రేకులు పనిచేస్తున్నాయో లేదో భౌతికంగా తనిఖీ చేయాల్సిన క్యారేజ్ అండ్ వ్యాగన్ (C&W) సిబ్బంది ఆ పని చేయలేదు.

లోకో పైలట్లు పదేపదే సమాచారం ఇచ్చినా సెక్షన్, ట్రాక్షన్ కంట్రోలర్లు ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వందే భారత్ బ్రేకింగ్ సిస్టమ్‌పై పూర్తి అవగాహన లేకపోవడంతో, రైలు సిబ్బంది కూడా బోగీల్లో బ్రేకులు పడుతున్నాయో లేదో చెక్ చేయలేకపోయారు.

"సరైన బ్రేక్ పవర్ లేకుండా రైలును నడపడం అత్యంత ప్రమాదకరం. ఇది ఇతర ప్రయాణికుల రైళ్లకు, సిబ్బంది ప్రాణాలకు పెను ముప్పు తెచ్చేది" అని ఎస్ఈఆర్ (SER) జోన్ తన ఉత్తర్వుల్లో ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై లోతైన విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ఆదేశించింది.

Advertisement
Advertisement