త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ

Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేవలం తయారీ రంగానికే పరిమితం కాకుండా.. డిజైన్, ఇంజినీరింగ్, నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ, పరిశోధన తదితర విభాగాలనూ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు.

S

Telangana | Published On Nov 15, 2026, 7.05 pm IST

Telangana | ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో అగ్రగామిగా తెలంగాణ
Advertisement

డిజైన్, ఇంజినీరింగ్, నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ, పరిశోధనపై ప్రత్యేక దృష్టి
హైదరాబాద్‌లో ఎన్ డీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు సానుకూలం
‘ఎన్‌డీఈ–2026’ జాతీయ సదస్సులో మంత్రి శ్రీధర్ బాబు

Telangana | త్రినేత్ర న్యూస్ : ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో తెలంగాణను దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికాబద్ధంగా కృషి చేస్తున్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. కేవలం తయారీ రంగానికే పరిమితం కాకుండా.. డిజైన్, ఇంజినీరింగ్, నాణ్యతా పరీక్షలు, ధ్రువీకరణ, పరిశోధన తదితర విభాగాలనూ రాష్ట్రంలో మరింత బలోపేతం చేయడంపై ప్రత్యేకంగా దృష్టి సారించామన్నారు. ఇండియన్ సొసైటీ ఫర్ నాన్ డిస్ట్రక్టివ్ టెస్టింగ్ (ఐఎస్ఎన్‌టీ) ఆధ్వర్యంలో ఆదివారం హైటెక్స్‌లో నిర్వహించిన ‘నాన్ డిస్ట్రక్టివ్ ఎవాల్యుయేషన్ అండ్ ఎనేబ్లింగ్ టెక్నాలజీస్ (ఎన్‌డీఈ–2026)’ జాతీయ సదస్సులో ఆయన విశిష్ఠ అతిథిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. గ్లోబల్ సప్లై చైన్‌లో ‘మేడ్ ఇన్ తెలంగాణ’ బ్రాండ్‌కు మరింత గుర్తింపును తీసుకొచ్చేందుకు తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందన్నారు. ఆ దిశగా తయారీ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామన్నారు. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లోని అవకాశాలను అందిపుచ్చుకునేలా స్థానిక పరిశ్రమలను గ్లోబల్ మార్కెట్‌తో అనుసంధానం చేస్తున్నామన్నారు. విమానాలు, హెలికాప్టర్లు, ఇతర ఏరోస్పేస్, డిఫెన్స్ పరికరాల నాణ్యత, భద్రత, విశ్వసనీయతను నిర్ధారించడంలో ఎన్‌డీఈ నిపుణుల పాత్ర కీలకమన్నారు. అడ్వాన్స్డ్ మెటీరియల్స్, ఎమర్జింగ్ టెక్నాలజీలు అందుబాటులోకి వస్తున్న కొద్దీ వాటిని పరీక్షించే విధానాలు కూడా మారాలన్నారు. మరింత కచ్చితమైన ఫలితాల కోసం ఏఐ, డిజిటల్ ట్విన్స్, అడ్వాన్స్డ్ ఇన్‌స్పెక్షన్ పద్ధతుల వినియోగం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.

రాబోయే రోజుల్లో ఎన్ డీఈ నిపుణులకు మరింత డిమాండ్ ఉండనుందని, ఆ దిశగా తెలంగాణ యువతను ‘రెడీ టూ వర్క్ ఫోర్స్’ గా తీర్చిదిద్దేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పని చేసేందుకు ఐఎస్ఎన్ టీ, పరిశ్రమలు, యూనివర్సిటీలు, పరిశోధనా సంస్థలు ముందుకు రావాలని కోరారు. హైదరాబాద్‌లో ఎన్‌డీఈ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటు చేయాలన్న ఐఎస్ఎన్‌టీ విజ్ఞప్తిపై మంత్రి శ్రీధర్‌బాబు సానుకూలంగా స్పందించారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలను సమర్పించాలని సూచించారు. కార్యక్రమంలో ఐఎస్ఎన్‌టీ ప్రెసిడెంట్ డా.జైతీష్ ఆర్ జోషి, ఎన్‌డీఈ 2026 ఛైర్మన్ సూర్య ప్రకాష్ గజ్జల, కన్వీనర్ మోహన్ పి నాయర్, మిధాని సీఎండీ డా.ఎస్వీఎస్ నారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement