త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం

Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌-2026లో భార‌త మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ ఘన విజయం సాధించింది.

P

Sports | Published On Sep 22, 2026, 5.15 pm IST

Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు తొలి స్వర్ణం
Advertisement
  • శ్రీలంకపై 147 పరుగులతో భార‌త్ వుమెన్స్ జ‌ట్టు ఘన విజ‌యం
  • వరుసగా రెండోసారి గోల్డ్‌మెడల్ సొంతం

Asian Games 2026 | ఏషియన్ గేమ్స్‌-2026లో భార‌త మహిళల క్రికెట్‌ జట్టు అదరగొట్టింది. ఫైనల్లో శ్రీలంకను 147 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసి గోల్డ్ మెడ‌ల్‌ను సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో శ్రీలంక 15.4 ఓవర్లలో 69 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్‌ ఘన విజయం సాధించింది. ఈ విజయంతో ఏషియన్ గేమ్స్‌లో మహిళల క్రికెట్‌లో భారత్‌ వరుసగా రెండోసారి స్వర్ణం సాధించింది. 2023 హాంగ్‌జౌ ఏషియన్ గేమ్స్‌లోనూ భారత మహిళల జట్టే గోల్డ్‌మెడల్‌ గెలిచింది. తాజాగా టైటిల్‌ను నిలబెట్టుకుని మరోసారి సత్తా చాటింది.

మంధాన, షెఫాలి మెరుపు ఆరంభం

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలి వర్మ శుభారంభం అందించారు. ఇద్దరూ ధాటిగా బ్యాటింగ్‌ చేస్తూ శ్రీలంక బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మంధాన 45 బంతుల్లో 79 పరుగులతో మెరిసింది. షెఫాలి 48 పరుగులతో రాణించింది. వీరిద్దరూ తొలి వికెట్‌కు 99 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. చివరి ఓవర్లలో రిచా ఘోష్‌ బ్యాట్‌ ఝుళిపించింది. కేవలం 22 బంతుల్లోనే అజేయంగా 49 పరుగులు చేసింది. దీంతో భారత్‌ స్కోరు 200 దాటింది. చివరికి 20 ఓవర్లలో 216/3కు చేరుకుంది. మహిళల ఏషియన్ గేమ్స్‌ క్రికెట్‌లో ఇదే అత్యధిక స్కోరుగా నిలిచింది.

బౌలర్ల ధాటికి లంక విలవిల

217 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంకకు భారత బౌలర్లు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. వరుసగా వికెట్లు పడగొడుతూ లంక బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కుప్పకూల్చారు. కెప్టెన్‌ చమరి ఆటపట్టు 29 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచినా.. మిగతా బ్యాటర్లు పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. దీప్తి శర్మ నాలుగు ఓవర్లలో కేవలం ఆరు పరుగులు ఇచ్చి మూడు వికెట్లు పడగొట్టింది. షెఫాలి వర్మ, శ్రీచరణి, శ్రేయాంక పాటిల్‌ రెండేసి వికెట్లతో లంక పతనాన్ని శాసించారు. 15.4 ఓవర్లలో 69 పరుగులకే శ్రీలంక ఆలౌటైంది. ఈ గెలుపుతో శ్రీలంకపై భారత్‌ వరుసగా ఎనిమిదో టీ20 అంతర్జాతీయ విజయాన్ని నమోదు చేసింది. 2024 మహిళల ఆసియా కప్‌ ఫైనల్లో శ్రీలంక చేతిలో ఓడిన తర్వాత ఈ రెండు జట్ల మధ్య జరిగిన ఎనిమిది టీ20ల్లోనూ భారత్‌ విజయం సాధించింది. సెప్టెంబర్‌ 13న జరిగిన 2026 ఆసియా కప్‌ ఫైనల్లోనూ శ్రీలంకను 72 పరుగులతో ఓడించిన భారత్‌.. తాజాగా ఏషియన్ గేమ్స్‌ ఫైనల్లో ఏకంగా 147 పరుగుల తేడాతో గెలిచింది.

ఫైనల్లో భారత్‌దే పైచేయి

భారత్‌-శ్రీలంక మహిళల జట్ల మధ్య జరిగిన ప్రధాన టోర్నీల ఫైనళ్లలోనూ భారత్‌ ఆధిపత్యం కొనసాగింది. 2022 ఆసియా కప్‌ ఫైనల్‌, 2023 ఏషియన్ గేమ్స్‌ ఫైనల్‌, 2026 ఆసియా కప్‌ ఫైనల్‌, 2026 ఏషియన్ గేమ్స్‌ ఫైనల్‌లో భారత్‌ విజయం సాధించింది. 2024 ఆసియా కప్‌ ఫైనల్లో మాత్రం శ్రీలంక గెలిచింది. ఇదిలా ఉండ‌గా.. ఇక ఫైనల్లో భార‌త బ్యాట‌ర్ స్మృతి మంధాన 79 పరుగులు చేయగా.. శ్రీలంక జట్టు మొత్తం 69 పరుగులకే ఆలౌటైంది. అంటే లంక మొత్తం చేసిన పరుగుల కంటే మంధాన ఒక్కరే 10 పరుగులు ఎక్కువ చేయ‌డం విశేషం. ఫైనల్లో మంధాన బ్యాట్‌ నుంచి వచ్చిన కీలక ఇన్నింగ్స్‌ భారత్‌కు భారీ స్కోరు అందించడంలో ప్రధాన పాత్ర పోషించింది. ఈ మ్యాచ్‌లో ఆమె 11వేల పరుగుల మైలురాయిని చేరుకుంది. ఏషియన్ గేమ్స్‌-2026లో భారత్‌కు ఇదే తొలి స్వర్ణ పతకం కాగా.. మహిళల క్రికెట్‌ జట్టు విజయంతో భారత్‌ పతకాల సంఖ్య ఏడుకు చేరింది. ఇందులో ఒక స్వర్ణం, నాలుగు రజతాలు, రెండు కాంస్య పతకాలు ఉన్నాయి.

Advertisement
Advertisement