త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jewar Airport inauguration | నోయిడా జెవార్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ కనెక్టివిటీకి భారీ ఊతం

రూ.11,200 కోట్ల వ్యయంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (జెవార్ ఎయిర్‌పోర్ట్) తొలి దశను ప్రధాని నరేంద్ర మోదీ శనివారం ప్రారంభించారు. ఈ ప్రాజెక్టు పశ్చిమ యూపీ, ఢిల్లీ-ఎన్‌సీఆర్ ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చనుంది.

J

National | Published On Mar 28, 2026, 3.40 pm IST

Jewar Airport inauguration | నోయిడా జెవార్ ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించిన మోదీ: ఢిల్లీ-ఎన్‌సీఆర్ కనెక్టివిటీకి భారీ ఊతం
Advertisement
  • ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జెవార్ ఎయిర్‌పోర్ట్ తొలి దశ ప్రారంభం
  • ప్రాజెక్టు వ్యయం సుమారు రూ. 11,200 కోట్లు
  • ఏడాదికి 1.2 కోట్ల మంది ప్రయాణికులు, 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కార్గో నిర్వహణ
  • ఏప్రిల్ చివరలో లేదా మే 2026 నుంచి వాణిజ్య విమాన సర్వీసులు ప్రారంభం
  • వారణాసి గంగా ఘాట్‌ల స్ఫూర్తితో టెర్మినల్ నిర్మాణం, నెట్-జీరో ఉద్గారాల సదుపాయం

Jewar Airport inauguration | త్రినేత్ర.న్యూస్ : ఉత్తరప్రదేశ్‌లోని జెవార్‌లో నిర్మించిన ప్రతిష్టాత్మక 'నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం (NIA)' తొలి దశను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం అట్టహాసంగా ప్రారంభించారు. భారీ భద్రతా ఏర్పాట్ల మధ్య జరిగిన ఈ కార్యక్రమంలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, గవర్నర్ ఆనందీబెన్ పటేల్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతానికి ఇది రెండో అంతర్జాతీయ విమానాశ్రయం. దీనివల్ల ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ (IGI) ఎయిర్‌పోర్ట్‌లో రద్దీ తగ్గడంతో పాటు, ఉత్తర భారతదేశానికి ఇది ప్రధాన లాజిస్టిక్స్ గేట్‌వేగా మారనుంది.

పశ్చిమ యూపీకి భారీ ఊతం: 'వికసిత్ యూపీ, వికసిత్ భారత్'

ఈ విమానాశ్రయం పశ్చిమ యూపీ ముఖచిత్రాన్ని మారుస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. "ఈ విమానాశ్రయం వల్ల నోయిడా, ఆగ్రా, మథుర, అలీఘర్, ఘజియాబాద్, మీరట్ తదితర ప్రాంతాలకు ఎంతో మేలు జరుగుతుంది. రైతులు, యువత, చిన్న, మధ్యతరహా వ్యాపారులకు ఇది ఎన్నో కొత్త అవకాశాలను తీసుకువస్తుంది" అని ప్రధాని స్పష్టం చేశారు. ఈ ఎయిర్‌పోర్ట్‌తో దేశంలోనే అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రంగా యూపీ అవతరించిందని కొనియాడారు.

Image

గత ప్రభుత్వాలపై ప్రధాని ఫైర్

ఈ ప్రాజెక్టు జాప్యంపై గత ప్రభుత్వాల తీరును ప్రధాని ఎండగట్టారు. "2003లో అటల్ బిహారీ వాజ్‌పేయి హయాంలోనే నోయిడా ఎయిర్‌పోర్ట్‌కు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. కానీ, కాంగ్రెస్, ఇక్కడి ప్రాంతీయ ప్రభుత్వాలు కనీసం శంకుస్థాపన కూడా చేయనివ్వలేదు. దశాబ్దాల పాటు ఈ ప్రాజెక్టు కాగితాలకే పరిమితమైంది" అని విమర్శించారు. కేంద్రం, రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ (బీజేపీ) వచ్చాకే ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చిందన్నారు.

ప్రపంచ సంక్షోభం - దేశీయ ఆర్థిక వ్యవస్థ

పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల ఏర్పడుతున్న ప్రపంచ సంక్షోభాన్ని ప్రస్తావిస్తూ.. ఇంధన ధరల పెరుగుదల భారం సామాన్యులు, రైతులపై పడకుండా కేంద్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.

Image

ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు, సామర్థ్యం

తొలి దశలో ఏటా 1.2 కోట్ల మంది ప్రయాణికులు, 2.5 లక్షల మెట్రిక్ టన్నుల కార్గోను నిర్వహించేలా దీన్ని డిజైన్ చేశారు. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 7 కోట్లకు పెంచనున్నారు. పెద్ద విమానాల టేకాఫ్, లాండింగ్‌కి ఎలాంటి ఇబ్బంది కలగకుండా 3900 మీటర్ల పొడవైన సింగిల్ రన్‌వేను నిర్మించారు. సోలార్ పవర్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సదుపాయాలతో దీన్ని 'నెట్-జీరో' ఉద్గారాల ఎయిర్‌పోర్ట్‌గా తీర్చిదిద్దారు. వారణాసి, హరిద్వార్ గంగా ఘాట్‌ల స్ఫూర్తితో భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా టెర్మినల్ ఆర్కిటెక్చర్‌ను రూపొందించారు.

Image

వాణిజ్య సర్వీసులు ఎప్పటినుంచి?

ఎయిర్‌పోర్ట్ అధికారికంగా ప్రారంభమైనప్పటికీ, తుది ఏర్పాట్ల కోసం వాణిజ్య సర్వీసులను ఏప్రిల్ చివరలో లేదా మే 2026 నుంచి ప్రారంభించనున్నారు. దేశీయ సర్వీసులతో ప్రారంభమై, ఆ తర్వాత అంతర్జాతీయ విమాన సేవలను విస్తరిస్తారు. ఇండిగో, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు ఇక్కడి నుంచి సేవలు అందించేందుకు ఇప్పటికే ఆసక్తి కనబరిచాయి.

Image

అద్భుతమైన రవాణా కనెక్టివిటీ

ఈ విమానాశ్రయాన్ని మల్టీ-మోడల్ ట్రాన్స్‌పోర్ట్ హబ్‌గా అభివృద్ధి చేస్తున్నారు. ఢిల్లీ-ముంబై ఎక్స్‌ప్రెస్‌వేకు కలుపుతూ 31 కి.మీ గ్రీన్‌ఫీల్డ్ లింక్ రోడ్డును నిర్మిస్తున్నారు. దీనివల్ల దక్షిణ ఢిల్లీ, ఫరీదాబాద్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 20 నిమిషాల్లో చేరుకోవచ్చు. అలాగే, 2030 నాటికి ఘజియాబాద్ నుంచి ఎయిర్‌పోర్ట్ వరకు 72 కిలోమీటర్ల ఆర్‌ఆర్‌టీఎస్ (RRTS)-కమ్-మెట్రో కారిడార్‌ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement