త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi 3 Nation Tour | అరబ్, ఆఫ్రికా దేశాల్లో మోదీ టూర్.. ఆ రంగంలో పెట్టుబడుల కోసమేనా?

ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ప్రధాన కార్యాలయం ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబాలో ఉంది. జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరిన తర్వాత మోదీ పర్యటన ఉండనున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ పట్ల భారత్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నది.

J

National | Published On Dec 15, 2025, 6.25 pm IST

PM Modi 3 Nation Tour | అరబ్, ఆఫ్రికా దేశాల్లో మోదీ టూర్.. ఆ రంగంలో పెట్టుబడుల కోసమేనా?
Advertisement

PM Modi 3 Nation Tour | దేశ ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 15 నుంచి వచ్చే నాలుగు రోజుల పాటు ప్రధాని మోదీ మూడు దేశాల్లో పర్యటించనున్నారు. అవే జోర్డాన్, ఇథియోపియా, ఒమన్. ఢిల్లీలో పొగమంచు కారణంగా విదేశీ పర్యటనకు మోదీ బయలుదేరడం కొంచెం ఆలస్యం అయింది. ఉదయమే ప్రత్యేక విమానంలో జోర్డాన్‌కి మోదీ బయలుదేరి వెళ్లారు. డిసెంబర్ 15, 16 తేదీలో జోర్డాన్‌లో, డిసెంబర్ 16,17 తేదీల్లో ఇథియోపియాలో, ఒమన్‌లో డిసెంబర్ 18, 19 తేదీల్లో మోదీ పర్యటించనున్నారు. ఇందులో జోర్డాన్, ఒమన్ అరబ్ దేశాలు కాగా, ఇథియోపియా ఈస్ట్ ఆఫ్రికాకు చెందిన దేశం.

పశ్చియ ఆసియాను ఆఫ్రికా కీలక ప్రాంతాలతో అనుసంధానించడానికేనా?

జోర్డాన్, ఒమన్, ఇథియోఫియా దేశాల్లో మోదీ పర్యటన ముఖ్యంగా ఆయా దేశాలతో వ్యాపారం, ఇరు దేశాల మధ్య సహకారం, సంబంధాలు, విశ్వసనీయత కోసమే లక్ష్యంగా సాగనుంది. ఆయా దేశాలతో భారతదేశ సంబంధాలు పెంచుకునేందుకు, వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. అలాగే, ఆఫ్రికాలోని కీలక ప్రాంతాలను పశ్చిమాసియాతో అనుసంధానించేలా ఈ పర్యటనను భారత్ ప్రారంభించింది.

జోర్డాన్ రాజధాని అమ్మన్‌కు మోదీ చేరుకున్నాక, అక్కడ రాజు అబ్దుల్లా 2తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా భారత్,జోర్డాన్ మధ్య ద్వైపాక్షిక సంబంధాల కోసం చర్చలు జరుపుతారు. ఆ తర్వాత జోర్డాన్‌లో ఉన్న భారతీయులను మోదీ కలవనున్నారు.

జోర్డాన్ భారత్‌కి కీలకమైన ఎరువుల సరఫరాదారు

భారతదేశానికి జోర్డాన్ చాలా ఏళ్ల నుంచి వ్యవసాయానికి సంబంధించిన ఫెర్టిలైజర్స్‌ను సరఫరా చేస్తోంది. కీలకమైన ఎరువులు అయిన ఫాస్పేట్లు, పొటాష్‌ను సరఫరా చేస్తుంది. ఇరు దేశాల మధ్య సుమారు 860 మిలియన్ డాలర్ల వెంచర్ నడుస్తోంది.

అలాగే జోర్డాన్ దేశస్తులకు ఇండియా వీసా ఆన్ అరైవల్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. రాయల్ జోర్డాన్ ఎయిర్ లైన్స్ సంస్థ అమ్మన్ నుంచి ముంబైకి డైరెక్ట్‌గా విమాన సర్వీసులను అందిస్తోంది. త్వరలోనే ఈ ఎయిర్ లైన్స్ సంస్థ ఢిల్లీకి కూడా విమాన సర్వీసులను విస్తరించనుంది.

ఉగ్రవాద నిర్మూలన కోసం భారత్‌కి జోర్డాన్ చాలా రోజుల నుంచి సహకారం అందిస్తోంది. ఇరు దేశాలు ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో సంయుక్తంగా పోరాటం చేస్తున్నాయి.

2011 తర్వాత ఇథియోపియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని

ఆఫ్రికాతో బంధం కొనసాగించడానికి, వ్యాపార సంబంధాల కోసం మోదీ ఇథియోపియాలో పర్యటించనున్నారు. 2011 తర్వాత ఇథియోపియాలో పర్యటిస్తున్న తొలి భారత ప్రధాని మోదీ. ఇథియోపియా ప్రధాని అబియ్ అహ్మద్‌తో భేటీ అవ్వడంతో పాటు ఆ దేశ పార్లమెంట్‌లోనూ మోదీ ప్రసంగించనున్నారు.

గ్లోబల్ సౌత్ పట్ల భారత్ నిబద్దత

ఆఫ్రికన్ యూనియన్(ఏయూ) ప్రధాన కార్యాలయం ఇథియోపియా క్యాపిటల్ అడిస్ అబాబాలో ఉంది. జీ20లో ఆఫ్రికన్ యూనియన్ చేరిన తర్వాత మోదీ పర్యటన ఉండనున్న నేపథ్యంలో గ్లోబల్ సౌత్ పట్ల భారత్ మరోసారి తన నిబద్ధతను చాటుకున్నది.

ఇథియోపియా బ్యాంకింగ్, క్యాపిటల్ రంగాల్లో సంస్కరణలు తీసుకొచ్చి తన ఆర్థిక వ్యవస్థను విస్తరిస్తోంది. దీంతో మైనింగ్, ఐటీ, వ్యవసాయ రంగాల్లో ఇండియన్ కంపెనీలకు భారీ అవకాశాలు రానున్నాయి.

అలాగే, ఇథియోపియా నుంచి భారత్ పప్పుధాన్యాలను దిగుమతి చేసుకుంటోంది. భారత్ నుంచి మెడిసిన్ ఇథియోపియాకు ఎగుమతి అవుతోంది.

సీఈపీఏ ఒప్పందం

భారత్, ఒమన్ మధ్య సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం కోసం మోదీ ముందడుగు వేయనున్నారు. ఈ ఒప్పందం ఖరారు అయితే ఇరు దేశాల మధ్య స్వేచ్ఛ, వాణిజ్యం, రక్షణ సహకారం అందనున్నాయి. పెట్టుబడులు కూడా భారీగా పెరగనున్నాయి.

అలాగే, ఒమన్‌లోని దుక్మ్ నౌకాశ్రయం ఇండియన్ నేవీకి కీలకమైనది. ఎందుకంటే ఇది పశ్చిమ హిందూ మహాసముద్రంలో భారత్‌కి తన కార్యకలాపాలను నిర్వహించడానికి అనుకూలంగా ఉంటుంది. మరోవైపు ఒమన్‌లో సుమారు 7 లక్షల మంది భారతీయులు వృత్తి రీత్యా పని చేస్తున్నారు.

ట్యాగ్స్:

Advertisement

తాజావార్తలు

Advertisement