త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Parliament Monsoon Session 2026 | అఖిలపక్ష భేటీలో విపక్షాల వాకౌట్.. ఆ ‘రెబల్’ ఎంపీల ఎంట్రీపై అభ్యంతరం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాలకు ముందు జరిగిన అఖిలపక్ష భేటీలో ప్రతిపక్షాలు వాకౌట్ చేశాయి. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీల రాకతో వివాదం చెలరేగింది.

J

National | Published On Jul 19, 2026, 7.17 pm IST

Parliament Monsoon Session 2026 | అఖిలపక్ష భేటీలో విపక్షాల వాకౌట్..  ఆ ‘రెబల్’ ఎంపీల ఎంట్రీపై అభ్యంతరం

సంక్షిప్త సారాంశం

పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్రం నిర్వహించిన అఖిలపక్ష సమావేశం వాడీవేడిగా సాగింది. టీఎంసీకి చెందిన 20 మంది రెబల్ ఎంపీల (NCPI)కు ఆహ్వానం పలకడాన్ని నిరసిస్తూ ప్రతిపక్షాలు సమావేశం నుంచి వాకౌట్ చేశాయి. కొద్ది నిమిషాల తర్వాత తిరిగి వచ్చిన ఇండియా కూటమి నేతలు.. నీట్, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తదితర అంశాలను లేవనెత్తారు. స్పీకర్ గుర్తింపు కోరినందుకే ఎన్‌సీపీఐకి ఆహ్వానం పంపామని పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు స్పష్టం చేశారు.

Advertisement
  • వర్షాకాల సమావేశాలకు ముందు హైడ్రామా

Parliament Monsoon Session 2026 | త్రినేత్ర.న్యూస్ : జులై 20 సోమవారం నుంచి ప్రారంభం కానున్న పార్లమెంట్ వర్షాకాల సమావేశాల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం జులై 19న అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలో పార్లమెంట్ హౌస్ అనెక్స్‌లో ఈ భేటీ జరిగింది. అయితే, సమావేశం ప్రారంభమైన కొద్దిసేపటికే ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సమావేశాన్ని బహిష్కరించి వాకౌట్ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది.

రెబల్ ఎంపీల రాకతోనే రగడ

తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు జూన్‌లో 'నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా' పేరుతో కొత్తగా ఏర్పాటయ్యారు. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు ఈ ఎన్‌సీపీఐ ఎంపీలను అఖిలపక్ష సమావేశానికి ఆహ్వానించడం ప్రతిపక్షాల ఆగ్రహానికి కారణమైంది. దీనికి నిరసనగా వాకౌట్ చేసిన ప్రతిపక్ష నేతలు.. కొద్ది నిమిషాల తర్వాత మళ్లీ సమావేశానికి తిరిగి వచ్చి పలు జాతీయ సమస్యలపై గళమెత్తారు. ఈ వాకౌట్ కేవలం ఎన్‌సీపీఐకి ఇచ్చిన ఆహ్వానానికి వ్యతిరేకంగా చేసిన 'సింబాలిక్ బాయ్‌కాట్' మాత్రమేనని కాంగ్రెస్ రాజ్యసభ ఉపనేత ప్రమోద్ తివారీ స్పష్టం చేశారు.

గుర్తింపు లేని పార్టీని ఎలా పిలుస్తారు?

ఎన్‌సీపీఐ పార్టీ విలీనానికి ఇంకా స్పీకర్ ఆమోదం లభించలేదని, అలాంటప్పుడు ఆ పార్టీని అఖిలపక్ష భేటీకి ఎలా పిలుస్తారని విపక్షాలు ప్రశ్నించాయి. "గుర్తింపు లేని పార్టీని, కనీసం పార్లమెంట్ వెబ్‌సైట్‌లో పేరు లేని పార్టీని సమావేశానికి పిలవడం మా ఆందోళనకు కారణం" అని టీఎంసీ ఎంపీ సౌగతా రాయ్ పేర్కొన్నారు. ఇప్పటికీ పార్లమెంట్ వెబ్‌సైట్‌లో ఆ 20 మంది రెబల్ ఎంపీలు టీఎంసీ సభ్యులుగానే ఉన్నారని విపక్ష నేతలు గుర్తు చేశారు.

కేంద్రం, ఎన్‌సీపీఐ కౌంటర్

ప్రతిపక్షాల అభ్యంతరాలపై కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు స్పందించారు. ఎన్‌సీపీఐ ఇప్పటికే స్పీకర్ గుర్తింపు కోరినందున.. వారిని విస్మరించలేమని, అందరినీ ఆహ్వానించడం ప్రభుత్వ బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మరోవైపు, ఎన్‌సీపీఐ బ్లాక్ లీడర్ కకోలీ ఘోష్ దస్తిదార్ మాట్లాడుతూ.. తమకు ఆహ్వానం పలికిన మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. తమ విలీనానికి సంబంధించిన పత్రాలన్నీ స్పీకర్‌కు సమర్పిస్తామని ఆమె తెలిపారు. టీఎంసీకి దూరంగా తమ వర్గానికి పార్లమెంట్‌లో సీట్లు కేటాయించడాన్ని ఆమె సానుకూల పరిణామంగా అభివర్ణించారు.

సభలో వాడివేడి చర్చలు తప్పవా?

సోమవారం నుంచి ప్రారంభమయ్యే సమావేశాల్లో ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు విపక్షాలు సిద్ధమయ్యాయి. నీట్ పేపర్ లీక్, ద్రవ్యోల్బణం, రామమందిర విరాళాల స్కామ్, వ్యవసాయం, పెట్రోల్‌లో ఈ20 బ్లెండ్ వంటి కీలక సమస్యలను సమావేశాల్లో లేవనెత్తనున్నట్లు ప్రతిపక్ష నేతలు తెలిపారు. అలాగే ప్రభుత్వం ప్రతిపాదించిన డీలిమిటేషన్ బిల్లును సైతం తాము గట్టిగా వ్యతిరేకిస్తామని వారు కుండబద్దలు కొట్టారు.

Advertisement
Advertisement