త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI Surya Kant on Rahul Gandhi | “న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు”: సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం

సుప్రీంకోర్టు ప్రాంగణంలో నిరసన తెలిపిన రాహుల్ గాంధీ తీరుపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టును ఎవరూ బెదిరించలేరంటూ ఆయన చేసిన వ్యాఖ్యల వివరాలు ఇవే.

J

National | Published On Oct 15, 2026, 1.27 pm IST

CJI Surya Kant on Rahul Gandhi | “న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు”: సుప్రీంకు రాహుల్ గాంధీ మార్చ్‌పై సీజేఐ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం

సంక్షిప్త సారాంశం

సుప్రీంకోర్టు ప్రాంగణానికి మార్చ్ నిర్వహించి నిరసన తెలిపిన లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తీరుపై చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. "న్యాయవ్యవస్థను ఎవరూ భయపెట్టలేరు (Browbeat చేయలేరు)" అని స్పష్టం చేసిన సీజేఐ.. తదుపరి విచారణలోగా రాహుల్ గాంధీ తన ప్రవర్తనపై వివరణ ఇవ్వాలని ఆదేశించారు. నిరసన జరిగిన సమయంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ (CCTV) ఫుటేజీని భద్రపరచాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు, 'SIR' ప్రక్రియలో అవకతవకలు జరిగాయంటూ ఇండియా కూటమి, అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది.

Advertisement

CJI Surya Kant on Rahul Gandhi | త్రినేత్ర న్యూస్ : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గత సోమవారం (అక్టోబర్ 12) సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించి, కోర్టు ప్రాంగణంలో నిరసన వ్యక్తం చేయడంపై అత్యున్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గురువారం నాడు ఈ వ్యవహారంపై విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్.. "న్యాయవ్యవస్థను ఎవరూ బెదిరించలేరు, కోర్టుపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేరు" అని ఘాటుగా వ్యాఖ్యానించారు. అంతేకాకుండా, కోర్టు ప్రాంగణంలో తన ప్రవర్తనకు గాను రాహుల్ గాంధీ కచ్చితంగా వివరణ ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు.

వివరణ ఇవ్వాల్సిందే.. సీసీటీవీ ఫుటేజ్ భద్రపరచండి

రాహుల్ గాంధీ తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్‌తో సీజేఐ సూర్యకాంత్ మాట్లాడుతూ.. "ఆయన (రాహుల్ గాంధీ) తన ప్రవర్తనపై కచ్చితంగా వివరణ ఇవ్వాల్సి ఉంటుంది" అని తేల్చిచెప్పారు.

అంతకుముందు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, న్యాయవాది గౌరవ్ భాటియా సుప్రీంకోర్టు ప్రాంగణంలో జరిగిన రాజకీయ నిరసన అంశాన్ని బెంచ్ దృష్టికి తీసుకెళ్లారు. "సుప్రీంకోర్టును రాజకీయ ర్యాలీలకు వేదికగా మార్చడం ఆమోదయోగ్యం కాదు. కోర్టులో జరగకూడనిది జరిగింది. ఇది కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నమే" అని గౌరవ్ భాటియా వాదించారు.

దీనిపై సీజేఐ స్పందిస్తూ.. "ఇలాంటి బలహీనమైన (Feeble) ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరు. బయట వాళ్లు రకరకాల ప్రకటనలు చేస్తుంటారు.. మేమేమీ ప్రపంచంతో సంబంధం లేకుండా మేడల్లో (Ivory tower) కూర్చోలేదు, బయట ఏం జరుగుతుందో మాకు అన్నీ తెలుసు" అని చురకలంటించారు. ఇండియా (INDIA) కూటమి నేతలు నిరసన తెలిపిన సమయంలో సుప్రీంకోర్టు ప్రాంగణంలోని సీసీటీవీ (CCTV) రికార్డింగ్‌లను భద్రపరచాలని కోర్టు అధికారులను ఆదేశించారు.

Nobody Can Browbeat Judiciary CJI Surya Kant Pulls Up Rahul Gandhi Over SC March

ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు

ఎన్నికల సంఘం (ECI) చేపట్టిన 'SIR' ప్రక్రియకు సంబంధించిన నిర్ణయాలను, ఈసీ పనితీరును ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ, ఇండియా కూటమి నేతలు, ఎంఐఎం (AIMIM) అధినేత అసదుద్దీన్ ఒవైసీ దాఖలు చేసిన పిటిషన్లను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది.

ఈ పిటిషన్లపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI), చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌తో పాటు ఇద్దరు ఎలక్షన్ కమిషనర్లకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే, "మేము నోటీసులు జారీ చేస్తున్నామంటే దాని అర్థం రాజకీయ నేతల ప్రవర్తనను క్షమించినట్లు కాదు. తదుపరి విచారణ తేదీ నాడు ఆయన ప్రవర్తనపై వివరణ కోరుతాం" అని సీజేఐ సూర్యకాంత్ స్పష్టం చేశారు.

అసలు అక్టోబర్ 12న ఏం జరిగింది? సీజేఐ అపాయింట్‌మెంట్ ఎందుకు నిరాకరించారు?

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని, 'SIR' ప్రక్రియను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 12 (సోమవారం) నాడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఇండియా కూటమి ఎంపీలు, అగ్రనేతలు ఢిల్లీలోని బారాఖంబా రోడ్డు నుంచి సుప్రీంకోర్టు వరకు భారీ మార్చ్ నిర్వహించారు. దీంతో కోర్టు కాంప్లెక్స్ లోపల భారీగా జనం గుమిగూడారు.

అంతకుముందు, ఈసీ పనితీరుపై, SIR అంశంపై చర్చించేందుకు రాహుల్ గాంధీ సీజేఐ సూర్యకాంత్ అపాయింట్‌మెంట్ కోరారు. అయితే ఆ అంశాలు అప్పటికే సుప్రీంకోర్టు విచారణలో ఉన్నాయని, అడ్మినిస్ట్రేటివ్ (పరిపాలనా) పరంగా ప్రభుత్వ వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోలేదని చెబుతూ సీజేఐ అపాయింట్‌మెంట్ నిరాకరించారు. కావాలంటే చట్టపరమైన ఊరట కోసం జ్యుడీషియల్ పరంగా కోర్టును ఆశ్రయించవచ్చని అప్పుడే సూచించారు. ఆ తర్వాతే ప్రతిపక్ష నేతలు నేరుగా సుప్రీంకోర్టుకు మార్చ్ నిర్వహించడం ఇప్పుడు వారికి న్యాయపరమైన చిక్కులను తెచ్చిపెట్టింది.

Advertisement

తాజావార్తలు

Advertisement