త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy | 15 శాతం క‌మీష‌న్‌.. కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరిస్తున్న సీఎం రేవంత్‌.. ఆర్వీఎం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌

Revanth Reddy | రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు టెండర్లు వేయకుండా కాంట్రాక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బెదిరిస్తున్నార‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఆర్వీఎం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ (RVM Constructions) మేనేజింగ్ డైరెక్ట‌ర్ నామా ర‌మేశ్ (Nama Ramesh) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.

G

Telangana | Published On Oct 15, 2026, 11.48 am IST

Revanth Reddy | 15 శాతం క‌మీష‌న్‌.. కాంట్రాక్ట‌ర్ల‌ను బెదిరిస్తున్న సీఎం రేవంత్‌.. ఆర్వీఎం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ ఎండీ సంచ‌ల‌న ఆరోప‌ణ‌
Advertisement

Revanth Reddy | త్రినేత్ర న్యూస్‌: రాష్ట్రంలో వివిధ ప్రాజెక్టులకు టెండర్లు వేయకుండా కాంట్రాక్టర్లను సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) బెదిరిస్తున్నార‌ని ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఆర్‌వీఎం క‌న్‌స్ట్ర‌క్ష‌న్స్ (RVM Constructions) మేనేజింగ్ డైరెక్ట‌ర్ నామా ర‌మేశ్ (Nama Ramesh) సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. తనకు నచ్చిన కాంట్రాక్టర్లకే టెండర్లు వచ్చేలా చూసుకుని, వారి నుంచి కూడా 15 శాతం కమీషన్ ముక్కుపిండి వసూలు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు. హైద‌రాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ (HGCL) ఆధ్వ‌ర్యంలో చేప‌ట్టిన రేడియ‌ల్ రోడ్‌-2 నిర్మాణ టెండ‌ర్ల ప్ర‌క్రియ‌లో భారీ అవ‌క‌త‌వ‌క‌లు జ‌రిగాయ‌ని ఆరోపించారు. ఈ వ్యవహారంపై జోక్యం చేసుకోవాలంటూ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (BAI) అధ్యక్షుడు, సభ్యులకు లేఖ రాశారు.

`ప్రాజెక్టులను కాంట్రాక్టర్లకు కేటాయించడానికి సీఎం రేవంత్ రెడ్డి 15 శాతం కమీషన్ (Commission) డిమాండ్ చేసినట్లు విస్తృతంగా ప్రచారం జరుగుతున్న‌ది. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యమే అయినప్పటికీ, ఏ ఎమ్మెల్యే కానీ, మంత్రి కానీ ఈ వ్య‌వ‌హారంపై మాట్లాడటం లేదు. కమీషన్లు ఇచ్చిన‌ కాంట్రాక్టర్లకు మాత్రమే బిల్లుల చెల్లింపులు జరుగుతున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి` అని త‌న లేఖ‌లో పేర్కొన్నారు.

బిల్లుల విడుదలకు కమీషన్లు

రాష్ట్రంలో ప‌నులు చేసిన‌ కాంట్రాక్టర్లకు సుమారు రూ.20 వేల‌ కోట్లు బకాయిలు ఉన్నాయని చెప్పారు. గత మూడేండ్లుగా ఈ బిల్లుల‌ను పెండింగ్‌లో (Pending Bills) పెట్టార‌ని, వాటి విడుదలకు కూడా భారీగా కమీషన్లు డిమాండ్ చేస్తున్నార‌ని ఆరోపించారు. ఆలస్యం కారణంగా చాలా మంది కాంట్రాక్టర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు ప్రాణాలు కోల్పోగా, మరికొందరు ఆశలు వదులుకున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో కాంట్రాక్టర్లు అనేవారే మిగలర‌ని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సమస్యను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని BAIని కోరారు.

సుశీ ఇన్ఫ్రాను కావాలనే తప్పించారు!

రేడియల్ రోడ్డు-2 టెండర్లలో జరిగిన అక్రమాల వివాదం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చెందిన ‘సుశీ ఇన్ఫ్రా (Sushee Infra) సంస్థ హైకోర్టును ఆశ్రయించడంతో వెలుగులోకి వచ్చింది. టెక్నికల్ ఎవాల్యుయేషన్ (Technical Evaluation) సరైన కారణాలు చూపకుండానే తమను అనర్హులుగా ప్రకటించడాన్ని సవాలు చేస్తూ సుశీ ఇన్ఫ్రా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది.

బుద్వేల్ వద్ద ఔటర్ రింగ్ రోడ్ (ORR) నుంచి కొడంగల్ సమీపంలోని నాచారం వద్ద ఉన్న ఎన్‌హెచ్‌-167Nని అనుసంధానించే 81 కిలోమీటర్ల పొడవైన రేడియల్ రోడ్డు-2 నిర్మాణానికి హెచ్‌జీసీఎల్ టెండర్లు పిలిచింది. మూడు ప్యాకేజీలుగా విభజించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ. 3,295 కోట్లు. టెండర్ల ప్రక్రియలో సుశీ ఇన్ఫ్రాతో పాటు ఎన్‌సీసీ (NCC), BVSR, GKC వంటి ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. అయితే, టెండర్ల పరిశీలన జరిగిన తీరు చూస్తుంటే సుశీ ఇన్ఫ్రాను కావాలనే లక్ష్యంగా చేసుకుని తప్పించినట్లు కనిపిస్తోందని నామా ర‌మేశ్‌ ఆరోపించారు.

సీఎంఓ నుంచి బెదిరింపులు?

రేడియల్ రోడ్డు-2 బిడ్డింగ్‌లో పాల్గొనకుండా కాంట్రాక్టర్లను ముఖ్యమంత్రి కార్యాలయం (CMO) నుంచి బెదిరింపులు వ‌చ్చాయ‌ని త‌న లేఖ‌లో పేర్కొన్నారు. `గత 5-6 ఏండ్లుగా MoRTH, NHAI లేదా రాష్ట్ర ప్రభుత్వాలు పిలిచే EPC లేదా HAM ప్రాజెక్టులలో కనీసం 10 నుంచి 12 కంపెనీలు పాల్గొంటున్నాయి. కానీ, ఈ టెండర్లలో కేవలం నలుగురు బిడ్డర్లు మాత్రమే పాల్గొన్నారు. మిగిలిన బిడ్డర్లు ముఖ్యమంత్రితో ముందే కుమ్మక్కైన కంపెనీలని తెలుస్తున్న‌ది. బిడ్ దాఖలు చేయాలనుకున్న ఇతర కాంట్రాక్టర్లకు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయని సమాచారం. కేవలం సుశీ ఇన్ఫ్రా మాత్రమే ధైర్యం చేసి ఇందులో పాల్గొన్న‌ది` అని తెలిపారు.

ఒత్తిడి తెచ్చి డిస్‌క్వాలిఫై చేశారు..

బిడ్డింగ్ ప్రక్రియ సమయంలో టెండర్లలో పాల్గొనవద్దని HGCL అధికారులు, ఇతరుల నుంచి తమకు ఫోన్ కాల్స్ వచ్చాయని, మాట వినకుంటే ఎలాంటి సరైన కారణం లేకుండా అనర్హులుగా ప్రకటిస్తామని హెచ్చరించినట్లు సుశీ ఇన్ఫ్రా తెలిపిందని రమేష్ పేర్కొన్నారు. `ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డికి (Komatireddy Rajagopal Reddy), రేవంత్ రెడ్డికి మధ్య రాజకీయ విభేదాలు ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. సుశీ ఇన్ఫ్రా రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందింది కావడంతో, సీఎం ఒత్తిడి తెచ్చి ఆ కంపెనీని డిస్‌క్వాలిఫై (Disqualify) చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు హెచ్‌జీసీఎల్‌ అత్యల్ప ధర పలికిన (L1) బిడ్డర్ ఆర్థిక బిడ్‌ను వెల్లడించలేదు. ప్రస్తుత L1 బిడ్డర్లు అంచనా వ్యయం కంటే సుమారు 3 నుంచి 15 శాతం ఎక్కువగా కోట్ చేసినట్లు సుశీ ఇన్ఫ్రా పేర్కొంది. ఇది టెండర్ల ప్రక్రియలో పారదర్శకత లోపాన్ని సూచిస్తున్న‌ది. రాజకీయ ప్రభావంతోనే ఈ కేటాయింపులు జరుగుతున్నాయనే తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తున్న‌ది` అని నామా రమేశ్‌ ఆరోపించారు.

ఖజానాకు రూ.600 కోట్ల నష్టం

సుశీ ఇన్ఫ్రా మూడు ప్యాకేజీలకు బిడ్లను సమర్పించిందని, ప్రస్తుతం ఉన్న L1 బిడ్డర్ల ధరల కంటే తమ ధరలు చాలా తక్కువగా ఉన్నాయని ఆ కంపెనీ పేర్కొంద‌ని ర‌మేశ్ వెల్ల‌డించారు. టెండర్ విలువతో పోలిస్తే మొత్తం వ్యత్యాసం దాదాపు రూ.600 కోట్లు ఉంటుందని, సుశీ ఇన్ఫ్రాకు కాంట్రాక్ట్ ఇచ్చి ఉంటే తెలంగాణ ప్రజల సొమ్ము, రాష్ట్ర అభివృద్ధికి రూ.600 కోట్లు ఆదా అయ్యేవని ఆయన స్పష్టం చేశారు.

Advertisement
Advertisement