త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | సింగ‌రేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర‌: కేటీఆర్‌

KTR | సింగ‌రేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తున్న‌ద‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. సింగరేణికి (Singareni) రావాల్సిన నైనీ బొగ్గుగనిలో వాటాలు కుదరక కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు.

G

Telangana | Published On Oct 15, 2026, 8.21 am IST

KTR | సింగ‌రేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ కుట్ర‌: కేటీఆర్‌
Advertisement

KTR | త్రినేత్ర న్యూస్‌: సింగ‌రేణిని దివాళా తీయించేందుకు కాంగ్రెస్ ప్ర‌భుత్వం కుట్ర‌లు చేస్తున్న‌ద‌ని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ (KTR) విమ‌ర్శించారు. సింగరేణికి (Singareni) రావాల్సిన నైనీ బొగ్గుగనిలో వాటాలు కుదరక కుంభకోణాలు బయటపడ్డాయని చెప్పారు. 40 లక్షల టన్నుల బొగ్గు మాయమైందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోకవ‌డంలేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. సింగరేణి కుంభకోణాల్లో కాంగ్రెస్‌, బీజేపీ కమీషన్లు పంచుకునేందుకు సంస్థను కొల్లగొడుతున్నారని ధ్వ‌జ‌మెత్తారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో నిర్వ‌హించిన సింగరేణి కార్మిక గర్జనలో కేటీఆర్‌ పాల్గొన్నారు. మూడేండ్ల కాంగ్రెస్‌ పాలనలో రాష్ట్రంలో కుంభకోణాల కుంభమేళా జరుగుతుంద‌న్నారు. సింగరేణిలో సైట్‌ విజిట్‌ స్కామ్‌, డీజిల్‌ స్కామ్‌, జిలెటిన్‌ స్టిక్స్‌ స్కామ్‌, సోలార్‌ స్కామ్‌, జైపూర్‌ పవర్‌ స్కామ్‌.. ఇలా స్కాముల జాబితా చిత్ర గుప్తుడి చిట్టా కూడా సరిపోనంత పెద్దగా ఉన్నదని మండిప‌డ్డారు. ఇప్పటికే ట్రాన్స్‌కోలో 24శాతం వాటాను ప్రైవేట్‌ అప్పగించేందుకు ద్వారాలు తెరిచిన రేవంత్‌ సర్కార్‌, ఇక సింగరేణిని కూడా ఏ అదానీకో, అంబానీకో అప్పజెప్పి ప్రైవేట్‌పరం చేయాలని కుట్రలు చేస్తున్నదని మండిపడ్డారు.

సింగరేణిలో నైనీ కుంభకోణాన్ని అడ్డుకున్నాన‌ని, దీనివల్ల ప్రభుత్వానికి రూ.30 వేల కోట్లు మిగిలాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పారని గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి (Revanth Reddy) మింగుదామనుకుంటే కోమటిరెడ్డి కాపాడారట అని ఎద్దేవాచేశారు. వాటాలు కుదరక కుంభకోణాలు వారే బయటపెట్టుకుంటున్నారని విమ‌ర్శించారు.సైట్‌ విజిట్‌ సర్టిఫికెట్‌ రూల్ పేరుతో రూ.10 వేల కోట్ల స్కామ్ జరిగిందని వెల్లడించారు. సింగరేణి ప్రైవేట్‌ బలిపీఠంపై ఉన్నదని పేర్కొన్నారు. సింగరేణిలో జరుగుతున్న కుంభకోణాలపై బీజేపీ నాయకులు ఎందుకు మౌనంగా ఉంటున్నారని ప్రశ్నించారు.

కొడంగల్ కొండచిలువ..

సింగరేణి లాభాల్లో వాటాలను కొడంగల్ కొండచిలువ కొట్టేసిందన్నారు. రెండేండ్ల‌లో రూ.6,317 కోట్లు కాజేసి సింగరేణి అభివృద్ధి అంటూ డ్రామాలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా బోనస్‌ కూడా గులాబీ దండు గర్జిస్తేనే కార్మికులకు వస్తున్నాయని, బోనస్‌ ఇవ్వకపోతే సింగరేణి పరిధిలోని ప్రతి మంత్రి, ఎమ్మెల్యే ఇల్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్‌ ఆగడాలు, దోపిడీకి తెరపడి, సింగరేణి తిరిగి సిరుల గనులుగా మారాలంటే కేసీఆర్‌ ఒక్కరే శ్రీరామ రక్ష అని స్పష్టంచేశారు. భవిష్యత్తులో ఎన్నికలు వచ్చినా బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కార్మికుల‌కు విజ్ఞప్తి చేశారు. సింగరేణి కార్మికులకు బొగ్గు ఉత్పత్తి మాత్రమే కాదు.. ఉద్యమాలు కూడా ఉత్పత్తి చేయగలరని వెల్ల‌డించారు.

కాంగ్రెస్ వచ్చింది.. కరెంటు పోయింది

పదేండ్ల కేసీఆర్‌ (KCR) పాలనలో సింగరేణి ఒక వెలుగు వెలిగిందన్నారు. నవరత్న, మహారత్న కంపెనీలకు దీటుగా కార్మికులు కసితో పనిచేసి బొగ్గు ఉత్పత్తి చేస్తే రెప్పపాటు కూడా అంతరాయం లేకుండా అన్ని వర్గాలకు బ్రహ్మాండంగా 24గంటల పాటు కరెంటు ఇచ్చిన దేశంలో ఒకే ఒక నాయకుడు కేసీఆర్‌ అని చెప్పారు. కానీ ఇవాళ పరిశ్రమలకు పవర్‌ హాలిడేలు.. రైతుల మోటర్లు కాలిపోవడం.. లో వోల్టేజీ సమస్యలు.. కరెంట్‌ రాదు.. ఇండ్లల్ల బుగ్గలు వెలుగయి.. ఎండకాలం పడుకుంటేమంటే ఫ్యాన్‌ కూడా తిరుగని పరిస్థితి దాపురించిందన్నారు. పెండింగ్‌లో ఉన్న కారుణ్య నియామకాల కోసం నెలకు మూడుసార్లు మెడికల్ బోర్డులు నిర్వహించాలని డిమాండ్ చేశారు.

కేసీఆర్‌ వస్తేనే సింగరేణికి రక్షణ

బెల్లంపల్లిలో కేసీఆర్ హయాంలో 7,600 మందికి పట్టాలు ఇస్తే, ప్రస్తుతం సుమారు 3,000 ఇళ్లకు సంబంధించిన భూములను 22-ఏ నిషేధిత జాబితాలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేర్చింది. కేసీఆర్ హయాంలో 16 శాతం నుంచి 32 శాతానికి కార్మికుల లాభాల వాటా పెరిగింద‌ని చెప్పారు. సింగరేణి కార్మికుల కోసం వారసత్వ ఉద్యోగాలను పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌దే అన్నారు. 2028లో కేసీఆర్ తిరిగి అధికారంలోకి వస్తేనే సింగరేణికి రక్షణ ఉంటుంద‌ని తెలిపారు.

60 వేల కోట్ల బకాయిలు..

బొగ్గు లేని దామరచర్లలో ప్లాంటు ఎందుకు పెట్టారని సీఎం ప్రశ్నిస్తున్నారని, బొగ్గు లేని విజయవాడలో కాంగ్రెస్‌ ప్రభుత్వం థర్మల్‌ స్టేషన్‌ ఎందుకు పెట్టిందని కేటీఆర్ నిల‌దీశారు. ప్రకృతి వైపరీత్యాలతో ఉత్పత్తి కుప్పకూలవద్దని మరోచోట ఏర్పాటు చేస్తారని వెల్ల‌డింఆచ‌రు. సింగరేణికి మూడేండ్లుగా రూ.60 వేల కోట్ల బకాయిలు చెల్లించలేదని ఆరోపించారు. మూడేండ్ల‌లో చేసిన రూ.4.5 లక్షల కోట్ల అప్పులను ఏం చేశారని ప్రశ్నించారు. ఢిల్లీలో రాహుల్‌ గాంధీకి (Rahul Gandhi) మాత్రం నెలనెలా ఈఎంఐ కడుతున్నారని, ఆయ‌న‌కు కప్పం కట్టేందుకు పైసలుంటాయి కానీ, సింగరేణి కోసం లేవా అని మండిప‌డ్డారు. మూడేళ్ల నుంచి కమీషన్లు, పర్సంటేజీలు, దందాలు చేయడం తప్ప సింగరేణిని పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు.

సింగరేణి దివాలా

దివాలాకోరు కాంగ్రెస్‌ (Congress) పాలనలో సింగరేణి దివాలా తీసే పరిస్థితి వచ్చిందని కేటీఆర్‌ ధ్వజమెత్తారు. బీఆర్‌ఎస్‌ అధికారం కోల్పోయేనాటికి 2023 డిసెంబర్‌లో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి 70 మిలియన్‌ టన్నులు.. ఇదొక సూపర్‌ రికార్డు. 2025-26లో కేవలం 58 మిలియన్‌ మెట్రిక్‌ టన్నులు మాత్రమే. రాను రాను పెరుగాలా.. తగ్గాలా? 70 మిలియన్‌ టన్నుల నుంచి 58 మిలియన్‌ టన్నులకు పడిపోయింది. సింగరేణిలో ఉత్పత్తి పడిపోవడానికి కారణం కార్మికుడు కాదు.. కాంగ్రెసోళ్లే కారణం. ఓపెన్‌ కాస్టుల్లో ఓబీ టెండర్లలో ఆలస్యం కావడం వల్లనే ఉత్పత్తి తగ్గింది. టెండర్లు ఆలస్యం అవుతున్నయి. ఎందుకంటే వీళ్ల వాటాల లెక్కలు తేలడం లేదు.. ఈ నిబంధన భారత దేశంలోని కోల్‌ ఇండియాలోగానీ, నవరత్న, మహారత్న సంస్థల్లోగానీ ఎక్కడా లేద‌ని విమ‌ర్శించారు. సైట్‌ విజిటేషన్‌ సర్టిఫికెట్‌ అనే కుంభకోణానికి ప్రధాన సూత్రధారి సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన బామ్మర్ది సృజన్‌రెడ్డి. కాంట్రాక్టర్లను బెదిరించి, వేల కోట్ల కుంభకోణాలకు పాల్పడటం వల్లనే ఓపెన్‌ కాస్ట్‌ టెండర్లు ఆలస్యం అయ్యాయన్నారు.

Advertisement
Advertisement