త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

National Voters Day | జాతీయ ఓటర్ల దినోత్స‌వం.. జ‌న‌వ‌రి 25నే ఎందుకు..?

National Voters Day | దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (నేషనల్ ఓటర్స్ డే) నిర్వహిస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఈ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా - ECI) 1950 జనవరి 25న ఏర్పాటైంది.

S

National | Published On Jan 25, 2026, 9.33 am IST

National Voters Day | జాతీయ ఓటర్ల దినోత్స‌వం.. జ‌న‌వ‌రి 25నే ఎందుకు..?
Advertisement

National Voters Day | దేశంలో ప్రతి సంవత్సరం జనవరి 25న జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని (నేషనల్ ఓటర్స్ డే) నిర్వహిస్తార‌న్న విష‌యం తెలిసిందే. ఈ తేదీకి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే భారత ఎన్నికల సంఘం (ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా - ECI) 1950 జనవరి 25న ఏర్పాటైంది. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన ఒక రోజు ముందే ఈ కీలక సంస్థ ఆవిర్భవించడంతో, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల నిర్వహణకు పునాది పడింది. ఈ నేపథ్యంలో, ఎన్నికల సంఘం సేవలను గౌరవించేందుకు, ప్రజల్లో ఓటు హక్కుపై అవగాహన పెంపొందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ తేదీని జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. ప్రధానంగా యువతను, తొలిసారి ఓటు వేయబోయే వారిని ఎన్నికల ప్రక్రియలో భాగస్వాములుగా మార్చడమే ఈ దినోత్సవం లక్ష్యం. ఓటు వేయడం ఒక మౌలిక హక్కు మాత్రమే కాకుండా, ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడి ముఖ్యమైన బాధ్యత కూడా అన్న విషయాన్ని ప్రజలకు గుర్తు చేయడం దీని ఉద్దేశం. అంతేకాదు, దేశవ్యాప్తంగా ఓటర్లుగా నమోదు చేసుకునే వారి సంఖ్యను పెంచడం కూడా ఈ కార్యక్రమంలో ముఖ్యమైన లక్ష్యంగా ఉంది.

తొలిసారిగా 2011లో..

జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని తొలిసారిగా 2011లో నిర్వహించారు. అప్పటి నుంచి ప్రతి సంవత్సరం జనవరి 25న ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 2025వ‌ సంవత్సరం 14వ జాతీయ ఓటర్ల దినోత్సవంగా నిలిచింది. ఈ సందర్భంగా దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు, ఓటరు ప్రతిజ్ఞ కార్యక్రమాలు, కొత్త ఓటర్ల నమోదు డ్రైవ్‌లు, సదస్సులు, ర్యాలీలు వంటి కార్యక్రమాలను ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇక ఈ సారి కూడా ఇదే కార్య‌క్ర‌మాన్ని కొనసాగిస్తున్నారు. భారతదేశం ప్రజాస్వామ్య దేశం కావడంతో, పాలకులను ఎన్నుకునే అధికారం ప్రజల చేతుల్లోనే ఉంటుంది. ఓటు హక్కు ద్వారా ప్రజలు తమ సమస్యలను అర్థం చేసుకునే, అభివృద్ధికి కృషి చేసే, ప్రజాసేవలను మెరుగుపరిచే ప్రతినిధులను ఎన్నుకునే అవకాశం పొందుతారు. ప్రతి ఓటు దేశ భవిష్యత్తును నిర్దేశించే శక్తిని కలిగి ఉందని, ఒక్క ఓటు కూడా విలువైనదేనని జాతీయ ఓటర్ల దినోత్సవం పౌరులకు గుర్తు చేస్తుంది.

ప్ర‌జాస్వామ్య ప‌రిర‌క్ష‌ణే ధ్యేయం..

ఒకప్పుడు భారతదేశంలో ఓటు హక్కు పొందేందుకు కనీస వయస్సు 21 సంవత్సరాలు ఉండేది. అయితే 1988లో అమలులోకి వచ్చిన 61వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ వయస్సును 18 సంవత్సరాలకు తగ్గించారు. దీనివల్ల కోట్లాది మంది యువత ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అవకాశం పొందారు. యువ ఓటర్లు ప్రజాస్వామ్య వ్యవస్థకు కొత్త ఉత్సాహాన్ని, దిశను అందిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. స్వేచ్ఛాయుత, న్యాయమైన ఎన్నికలను నిర్వహించడం భారత ఎన్నికల సంఘం ప్రధాన బాధ్యత. ఎన్నికల సమయంలో పారదర్శకత, నైతిక విలువలు పాటించబడేలా చూడడం, ఓటర్ల శాతం పెంచడం వంటి అంశాలు ఈ సంస్థ ప్రధాన లక్ష్యాల్లో ఉన్నాయి. జాతీయ ఓటర్ల దినోత్సవం ద్వారా ప్రజల్లో ఎన్నికల పట్ల విశ్వాసం పెంచడం, ప్రజాస్వామ్య పునాదులను మరింత బలపర్చడం లక్ష్యంగా ఎన్నికల సంఘం పనిచేస్తోంది.

జాతీయ ఓటర్ల దినోత్సవం లక్ష్యాలు.. ప్రజలను ఓటర్లుగా నమోదు చేసుకునేలా ప్రోత్సహించడం, నైతికమైన, బాధ్యతాయుతమైన ఓటింగ్‌ను ప్రోత్సహించడం, స్వేచ్ఛాయుత ఎన్నికల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రజల భాగస్వామ్యంతో ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడం అని అధికారులు స్పష్టం చేస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement