త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mark Zuckerberg Apology | తప్పు మాదే సారీ.. కేంద్ర ప్రభుత్వానికి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

చిన్నారులపై అభ్యంతరకర కంటెంట్, డిప్‌ఫేక్స్ వ్యాప్తిపై కేంద్ర ప్రభుత్వానికి మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు చెప్పినట్లు సమాచారం.

J

National | Published On Aug 5, 2026, 5.46 pm IST

Mark Zuckerberg Apology | తప్పు మాదే సారీ.. కేంద్ర ప్రభుత్వానికి మార్క్ జుకర్‌బర్గ్ క్షమాపణలు

సంక్షిప్త సారాంశం

మెటా ప్లాట్‌ఫామ్‌లలో చిన్నారులపై అభ్యంతరకర కంటెంట్ (CSAM), డిప్‌ఫేక్ కంటెంట్ వ్యాప్తి చెందడంపై మార్క్ జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేస్తూ క్షమాపణలు చెప్పారు. ఐటీ శాఖ (MeitY) ఉన్నతాధికారులు, మెటా గ్లోబల్ బృందం మధ్య జరిగిన రెండు రోజుల అత్యున్నత స్థాయి భేటీలో ఈ పరిణామం చోటుచేసుకుంది. అల్గారిథమ్‌ల ద్వారా కంటెంట్‌ను ప్రమోట్ చేస్తున్నందున మెటాను కేవలం 'మధ్యవర్తి' (Intermediary) గా పరిగణించలేమని, ఐటీ చట్టం సెక్షన్ 79 ప్రకారం 'సేఫ్ హార్బర్' రక్షణ వర్తించదని కేంద్రం స్పష్టం చేసింది. పీఎం మోదీ వీడియో ఫేస్‌బుక్‌లో ఐదు గంటల పాటు బ్లాక్ అయిన వ్యవహారంలోనూ పార్లమెంటరీ కమిటీ జుకర్‌బర్గ్ క్షమాపణలను డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.

Advertisement
  • 'సేఫ్ హార్బర్' రక్షణపై మెటాకు షాక్

Mark Zuckerberg Apology | త్రినేత్ర.న్యూస్ : సోషల్ మీడియా దిగ్గజం 'మెటా' అధినేత మార్క్ జుకర్‌బర్గ్ భారత ప్రభుత్వానికి బేషరతుగా క్షమాపణలు తెలిపినట్లు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌లలో చిన్నారులపై అభ్యంతరకర లైంగిక కంటెంట్, డిప్‌ఫేక్స్ వ్యాప్తి చెందడం, కంటెంట్ మోడరేషన్‌లో దొర్లిన తీవ్రమైన పొరపాట్లపై జుకర్‌బర్గ్ విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం. కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అధికారులతో మెటా గ్లోబల్ లీడర్‌షిప్ బృందం వరుసగా రెండు రోజుల పాటు నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశాల్లో ఈ అంశాలు చర్చకు వచ్చాయి.

ఐటీ చట్టం సెక్షన్ 79పై కేంద్రం ఘాటు హెచ్చరిక

ఈ సమావేశంలో భారత ప్రభుత్వం మెటా యాజమాన్యానికి అత్యంత స్పష్టమైన సందేశాన్ని ఇచ్చింది. వినియోగదారులు పోస్ట్ చేసే కంటెంట్‌కు ప్లాట్‌ఫామ్‌లకు బాధ్యత లేకుండా చేసే 'సేఫ్ హార్బర్' రక్షణ కవచం ఇకపై మెటాకు వర్తించకపోవచ్చని స్పష్టం చేసింది.

కేంద్రం కీలక వ్యాఖ్య

"వినియోగదారులకు ఏ కంటెంట్ కనిపిస్తుందో మెటా తన 'అల్గారిథమ్‌ల' ద్వారా స్వయంగా నిర్ణయిస్తోంది. యూజర్లకు ఏది చూపించాలో మీరే ప్రమోట్ చేస్తున్నప్పుడు, మిమ్మల్ని కేవలం ఒక సాధారణ మధ్యవర్తిగా పరిగణించలేం. కాబట్టి ఐటీ చట్టం సెక్షన్ 79 కింద దక్కే చట్టపరమైన రక్షణ మీ ప్లాట్‌ఫామ్‌లకు వర్తించదు." అని వ్యాఖ్యానించింది.

కొన్ని రకాల కంటెంట్‌ను బూస్ట్ చేయడానికి (ప్రచారం చేయడానికి) భారీగా నిధులు ఖర్చు చేశామని, ఆ నిర్ణయాల పట్ల కూడా మెటా ప్రతినిధులు విచారం వ్యక్తం చేసినట్లు సమాచారం.

పీఎం మోదీ వీడియో వివాదం

ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ విద్యార్థులను ఉద్దేశించి పోస్ట్ చేసిన ఫేస్‌బుక్ రీల్ దాదాపు ఐదు గంటల పాటు డిలీట్ అవ్వడం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. దీనిని "సాంకేతిక లోపం" గా మెటా సమర్థించుకున్నప్పటికీ.. ఐటీ శాఖ ఆ వివరణను తోసిపుచ్చింది. బీజేపీ ఎంపీ నిషికాంత్ దూబే నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా ఈ ఘటనపై మార్క్ జుకర్‌బర్గ్ స్వయంగా క్షమాపణ చెప్పాలని గట్టిగా డిమాండ్ చేసింది. ఈ వరుస పరిణామాలతో మెటా తీవ్రమైన ఒత్తిడిలో పడింది.

ప్రపంచంలోనే మెటాకు అతిపెద్ద యూజర్ బేస్ ఉన్న దేశం భారత్. వందల మిలియన్ల మంది ఫేస్‌బుక్, వాట్సప్, ఇన్‌స్టాగ్రామ్ వాడుతున్న నేపథ్యంలో.. భారత చట్టాలను ప్రతి ఒక్కరూ పాటించి తీరాల్సిందేనని.. మహిళలు, పిల్లల భద్రత విషయంలో ఎలాంటి రాజీ పడేది లేదని కేంద్రం తేల్చిచెప్పింది.

Advertisement
Advertisement