త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

PM Modi | మోదీని క‌లిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌.. భారత్‌–కెనడా బంధం బలోపేతానికి చర్చలు

PM Modi | భారత్‌–కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌ బుధవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, భద్రత, విద్య తదితర రంగాల్లో సహకార విస్తరణపై చర్చించారు.

P

National | Published On Oct 14, 2026, 8.23 pm IST

PM Modi | మోదీని క‌లిసిన విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌.. భారత్‌–కెనడా బంధం బలోపేతానికి చర్చలు
Advertisement

PM Modi | భారత్‌–కెనడా వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రధాని నరేంద్ర మోదీ, కెనడా విదేశాంగ మంత్రి అనితా ఆనంద్‌ బుధవారం సమావేశమయ్యారు. ఇరు దేశాల మధ్య వాణిజ్యం, సాంకేతికత, ఇంధనం, రక్షణ, భద్రత, విద్య తదితర రంగాల్లో సహకార విస్తరణపై చర్చించారు. ప్రజల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేయడంపైనా అభిప్రాయాలు పంచుకున్నారు. భారత్‌–కెనడా సంబంధాలను నిర్మాణాత్మకంగా, దూరదృష్టితో కూడిన వ్యూహాత్మక భాగస్వామ్యంగా తీర్చిదిద్దేందుకు భారత్‌ కట్టుబడి ఉందని మోదీ పేర్కొన్నారు. ఈ భాగస్వామ్యం ఇరు దేశాల ప్రజలకు స్పష్టమైన ప్రయోజనాలను అందించాలన్నదే లక్ష్యమని తెలిపారు. అనితా ఆనంద్‌తో సమావేశం ఆహ్లాదకరంగా సాగిందని, ద్వైపాక్షిక సంబంధాల బలోపేతంపై ఫలవంతమైన చర్చలు జరిగాయని ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

సీఈపీఏపై త్వరగా చర్చలు పూర్తి చేయాలి..

భారత్‌–కెనడా మధ్య ద్వైపాక్షిక చర్చల్లో వేగాన్ని కొనసాగిస్తూ, వాటిని స్పష్టమైన ఫలితాలుగా మార్చాల్సిన అవసరాన్ని మోదీ నొక్కిచెప్పారు. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ)పై చర్చలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని అభిప్రాయపడ్డారు. 2030 నాటికి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేయాలన్న లక్ష్య సాధనకు ఈ ఒప్పందం కీలకం కానుంది. ప్రధాని కార్యాలయం (పీఎంవో) ప్రకటన ప్రకారం.. ఉమ్మడి ప్రయోజనాలున్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపైనా ఇరువురు చర్చించారు. బహుపాక్షిక వేదికలపై సహకారాన్ని పెంపొందించుకోవడంపై అభిప్రాయాలు పంచుకున్నారు. కెనడా ప్రధాని మార్క్‌ కార్నీకి మోదీ శుభాకాంక్షలు తెలిపారు. ఆయనతో భవిష్యత్తులోనూ సంప్రదింపులు కొనసాగించాలని ఆకాంక్షించారు. మోదీ, కార్నీ మంగళవారం ఫోన్‌లో మాట్లాడిన మరుసటి రోజే అనితా ఆనంద్‌తో సమావేశం జరగడం ప్రాధాన్యం సంతరించుకుంది. భారత్‌ పర్యటనలో ఉన్న కెనడా అంతర్జాతీయ వాణిజ్య మంత్రి మనీందర్‌ సిద్ధూ నేతృత్వంలోని ‘టీమ్‌ కెనడా’ వాణిజ్య ప్రతినిధి బృందం పర్యటనను ఇరు దేశాలు స్వాగతించాయి.

Advertisement
Advertisement