త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kerala Assembly CEC Resolution | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాల్సిందే: కేరళం అసెంబ్లీ సంచలన తీర్మానం.. దేశ చరిత్రలోనే తొలిసారి

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీ చారిత్రక తీర్మానం ఆమోదించింది. బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినా సభ ఆమోదముద్ర వేసింది.

J

National | Published On Oct 12, 2026, 3.59 pm IST

Kerala Assembly CEC Resolution | సీఈసీ జ్ఞానేష్ కుమార్‌ను తొలగించాల్సిందే: కేరళం అసెంబ్లీ సంచలన తీర్మానం.. దేశ చరిత్రలోనే తొలిసారి
Advertisement
  • చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళం అసెంబ్లీలో చారిత్రక తీర్మానం ఆమోదం
  • స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ద్వారా దేశవ్యాప్తంగా కోట్ల మంది ఓటర్లను అన్యాయంగా తొలగించారని సభలో అధికార, ప్రతిపక్షాల ఆరోపణ
  • ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ప్రవేశపెట్టిన ఈ తీర్మానానికి విపక్ష నేత పినరయి విజయన్ (LDF) సంపూర్ణ మద్దతు
  • వ్యతిరేకించిన ఏకైక పార్టీగా బీజేపీ
  • ఈసీ నియామక కమిటీలో భారత ప్రధాన న్యాయమూర్తి (CJI)కి తిరిగి చోటు కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి అసెంబ్లీ విజ్ఞప్తి

Kerala Assembly CEC Resolution | త్రినేత్ర న్యూస్ : ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్‌పై దేశవ్యాప్తంగా రగులుతున్న వివాదం మరింత తీవ్రరూపం దాల్చింది. ఓటర్ల జాబితా సవరణలో తీవ్ర అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ, సీఈసీని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ కేరళం శాసనసభ సోమవారం ఒక చారిత్రక తీర్మానాన్ని ఆమోదించింది. ఒక రాష్ట్ర అసెంబ్లీ కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్‌ను తొలగించాలని తీర్మానం చేయడం దేశ చరిత్రలోనే ఇది తొలిసారి కావడం గమనార్హం.

ముఖ్యమంత్రి వీడీ సతీశన్ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. అధికార యూడీఎఫ్ (UDF), ప్రతిపక్ష ఎల్డీఎఫ్ (LDF) పార్టీలు ఏకతాటిపైకి వచ్చి చేతులెత్తి ఈ తీర్మానానికి మద్దతు తెలిపాయి. అయితే బీజేపీ ఎమ్మెల్యేలు దీనిపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ సవరణలు కోరినప్పటికీ, సభ వాటిని తిరస్కరించింది.

ఓటు హక్కు ప్రజాస్వామ్యానికి పునాది: సీఎం సతీశన్

తీర్మానం ఆమోదం పొందిన అనంతరం ముఖ్యమంత్రి వీడీ సతీశన్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. "ఓటు హక్కు మన ప్రజాస్వామ్యానికి పునాది. ఏ ఒక్క రాజ్యాంగ వ్యవస్థ కూడా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాయడానికి వీల్లేదు. ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదు" అని ఆయన పేర్కొన్నారు. కేరళం అసెంబ్లీ దేశానికే ఆదర్శంగా నిలిచి చరిత్ర సృష్టించిందని స్పష్టం చేశారు.

కేరళ అసెంబ్లీ ఆమోదించిన తీర్మానంలో ప్రధానంగా మూడు కీలక డిమాండ్లను కేంద్రం ముందు ఉంచారు.

ఓటు హక్కుల పునరుద్ధరణ: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పేరుతో అన్యాయంగా జాబితా నుంచి తొలగించిన అర్హులైన పౌరులందరికీ వెంటనే ఓటు హక్కు కల్పించాలి.

సీఈసీ తొలగింపు: విశ్వసనీయత కోల్పోయిన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను పదవి నుంచి తొలగించేందుకు తగిన ప్రక్రియ ప్రారంభించాలి.

నియామక ప్యానెల్ సంస్కరణలు: ఎన్నికల కమిషనర్ల ఎంపిక కమిటీలో ప్రధాని, లోక్‌సభ ప్రతిపక్ష నేతతో పాటు భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) ఉండేలా ప్యానెల్‌ను పునర్వ్యవస్థీకరించాలి.

'లక్షలు కాదు.. కోట్ల మంది ఓట్లు గల్లంతు': పినరయి విజయన్

తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రతిపక్ష నేత పినరయి విజయన్ ఒక కీలక మార్పును సూచించారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి అక్రమంగా తొలగించారని, అందుకే తీర్మానంలో 'లక్షల మంది' అనే పదం బదులు 'కోట్ల మంది' అని మార్చాలని కోరారు. ముఖ్యమంత్రి సతీశన్ ఆ సవరణను అంగీకరించి తీర్మానంలో చేర్చారు.

మరోవైపు బీజేపీ శాసనసభాపక్ష నేత బీబీ గోపకుమార్, ఎమ్మెల్యే వి. మురళీధరన్, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ ఈ తీర్మానాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. ఎన్నికల సంఘాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు రాజకీయ కుట్రలు జరుగుతున్నాయని వారు ఆరోపించారు. అయితే మెజారిటీ సభ్యుల మద్దతుతో సభ ఈ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించి కేంద్రానికి పంపింది.

Advertisement
Advertisement