త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bike Taxis | బైక్ టాక్సీల‌కు ఓకే చెప్పిన క‌ర్ణాట‌క హైకోర్టు.. బెంగ‌ళూరులో నిషేధం ఎత్తివేత‌..

Bike Taxis | కర్ణాటక రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు నిర్వహిస్తున్న బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేసిన గత ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది.

S

National | Published On Jan 23, 2026, 12.53 pm IST

Bike Taxis | బైక్ టాక్సీల‌కు ఓకే చెప్పిన క‌ర్ణాట‌క హైకోర్టు.. బెంగ‌ళూరులో నిషేధం ఎత్తివేత‌..
Advertisement

Bike Taxis | కర్ణాటక రాష్ట్రంలో బైక్ టాక్సీ సేవలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రాపిడో, ఓలా, ఉబెర్ వంటి సంస్థలు నిర్వహిస్తున్న బైక్ టాక్సీ కార్యకలాపాలను నిలిపివేసిన గత ఉత్తర్వులను కోర్టు రద్దు చేసింది. మోటార్ వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనాలను కాంట్రాక్ట్ క్యారేజీలుగా అనుమతించవచ్చని స్పష్టం చేస్తూ, వాటి రిజిస్ట్రేషన్ లేదా పర్మిట్లను అధికారులు నిరాకరించలేరని ధర్మాసనం తేల్చి చెప్పింది. చీఫ్ జస్టిస్ విభూ బాఖ్రూ, జస్టిస్ సి.ఎం. జోషి లతో కూడిన డివిజన్ బెంచ్ ఉబెర్ ఇండియా, రాపిడో సంస్థ (రోప్పెన్ ట్రాన్స్‌పోర్టేషన్ సర్వీసెస్), ఓలా (ఏఎన్ఐ టెక్నాలజీస్), బైక్ టాక్సీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్‌తో పాటు పలువురు వ్యక్తిగత బైక్ టాక్సీ యజమానులు దాఖలు చేసిన అప్పీల్స్‌ను అనుమతించింది. ద్విచక్ర వాహనాలను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా నమోదు చేసి, కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్లు మంజూరు చేయాలని రవాణా శాఖ అధికారులను కోర్టు ఆదేశించింది.

సింగిల్ జడ్జి బెంచ్ ఉత్త‌ర్వులు ర‌ద్దు..

వాహన యజమానులు తమ బైక్‌లను ట్రాన్స్‌పోర్ట్ వాహనాలుగా రిజిస్టర్ చేసుకునేందుకు దరఖాస్తు చేసుకోవచ్చని, వాటిని పరిశీలించి అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే అవసరమైతే ప్రాంతీయ రవాణా అధికారులు కొన్ని నిబంధనలు విధించవచ్చని కూడా పేర్కొంది. గ‌తంలో 2025 ఏప్రిల్ 2న సింగిల్ జడ్జి బెంచ్, సెక్షన్ 93 కింద స్పష్టమైన మార్గదర్శకాలు లేవని పేర్కొంటూ బైక్ టాక్సీ సేవలను నిలిపివేయాలని ఆదేశించింది. అలాగే ద్విచక్ర వాహనాలకు ట్రాన్స్‌పోర్ట్ రిజిస్ట్రేషన్, కాంట్రాక్ట్ క్యారేజీ పర్మిట్లు ఇవ్వాల్సిన అవసరం లేదని తీర్పు చెప్పింది. ఆ ఉత్తర్వులను ఇప్పుడు డివిజన్ బెంచ్ రద్దు చేసింది.

కేంద్రం అనుమ‌తి ఉండ‌గా రాష్ట్రానికి ఇబ్బందేమిటి..?

రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఆటో, టాక్సీ యూనియన్ల నిరసనలు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, మహిళల భద్రత, వైట్ నంబర్ ప్లేట్ వాహనాల దుర్వినియోగం వంటి కారణాలతో బైక్ టాక్సీలకు అనుమతి ఇవ్వలేదని వాదించారు. అయితే కేంద్ర చట్టం ద్విచక్ర వాహనాలకు స్పష్టంగా అనుమతి ఇస్తున్నప్పుడు రాష్ట్రం పాలసీ పేరుతో నిరాకరించలేదని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. 2025 ఆగస్టులో అప్పీల్స్ విచారణలో ఉండగా, బైక్ టాక్సీ డ్రైవర్లపై బలవంతపు చర్యలు తీసుకోవద్దని కూడా కోర్టు మౌఖికంగా ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ తాజా తీర్పుతో బెంగళూరుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా వేలాది బైక్ టాక్సీ డ్రైవర్లకు ఉపశమనం లభించనుంది. నగరాల్లో చివరి మైలు ప్రయాణ సౌకర్యానికి బైక్ టాక్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని, అనేక కుటుంబాలకు ఇవి ఉపాధి కల్పిస్తున్నాయని ఆయా సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement