త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ

కర్ణాటక ముఖ్యమంత్రి సీటుపై రగులుతున్న ఊహాగానాలకు కాంగ్రెస్ హైకమాండ్ తెరదించింది. సీఎం మార్పుపై ఢిల్లీలో 6 గంటల పాటు జరిగిన మంతనాల్లో అసలు ఏం జరిగిందంటే?

J

National | Published On May 26, 2026, 7.22 pm IST

Karnataka CM Change | కర్ణాటకలో సీఎం మార్పు లేనట్టే! ఢిల్లీ భేటీలో అసలు ఏం జరిగిందంటే? కాంగ్రెస్ హైకమాండ్ క్లారిటీ
Advertisement

Karnataka CM Change | త్రినేత్ర.న్యూస్ : కర్ణాటక (Karnataka) రాజకీయాల్లో గత కొంతకాలంగా వినిపిస్తున్న 'ముఖ్యమంత్రి మార్పు' వార్తలపై కాంగ్రెస్ పార్టీ ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ముఖ్యమంత్రి పీఠం సిద్ధరామయ్య (Siddaramaiah) నుంచి డీకే శివకుమార్‌కు (DK Shivakumar) దక్కుతుందనే ఊహాగానాలకు తెరదించుతూ.. అలాంటిదేమీ లేదని హైకమాండ్ స్పష్టం చేసింది. ఢిల్లీలో మంగళవారం సుదీర్ఘంగా సాగిన ఆరు గంటల సమావేశం అనంతరం పార్టీ ఈ కీలక ప్రకటన చేసింది.

ఆరు గంటల మీటింగ్‌లో ఏం చర్చించారు?

కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో జరిగిన ఈ భేటీకి సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ హాజరయ్యారు. సమావేశం ముగిసిన తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మీడియాతో మాట్లాడుతూ కేవలం ఒక్క నిమిషంలోనే అసలు విషయాన్ని తేల్చేశారు. "కర్ణాటకలో త్వరలో జరగనున్న మూడు రాజ్యసభ (Rajya Sabha) స్థానాలు, ఎమ్మెల్సీ ఎన్నికల గురించే ఈ భేటీలో ప్రధానంగా చర్చించాం. నాయకత్వ మార్పుపై వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. అవన్నీ కేవలం ఊహాగానాలు (Speculations) మాత్రమే" అని ఆయన కొట్టిపారేశారు. కనీసం క్యాబినెట్ విస్తరణపై కూడా చర్చ జరగలేదని సిద్ధరామయ్య స్వయంగా వెల్లడించారు.

పవర్ షేరింగ్ ఫార్ములా.. డీకేఎస్‌ వర్గం ఆశలు

2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘనవిజయం సాధించిన తర్వాత, సీఎం పదవి విషయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ మధ్య 'పవర్ షేరింగ్' (Power Sharing) ఒప్పందం జరిగిందని మొదటి నుంచీ ప్రచారం జరుగుతోంది. చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రిగా ఉంటారని అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇటీవల సిద్ధరామయ్య ప్రభుత్వం రెండున్నరేళ్ల పదవీకాలాన్ని పూర్తి చేసుకోవడంతో, ఇక డీకేఎస్‌కు ఛాన్స్ దక్కుతుందని ఆయన మద్దతుదారులు గట్టిగా నమ్మారు. దీనికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత (Anti-incumbency) పెరుగుతోందని, ప్రియాంకా గాంధీ కూడా మార్పును కోరుకుంటున్నారని ప్రచారం జరగడంతో ఈ భేటీపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.

Karnataka CM Change Congress Reveals Truth Behind Delhi Meeting

అధిష్టానం ఎందుకు వెనక్కి తగ్గింది?

80 ఏళ్ల వయసులో ఉన్న సిద్ధరామయ్యను పదవి నుంచి తప్పిస్తే పార్టీకి నష్టం జరుగుతుందేమోనని కాంగ్రెస్ ఆందోళన చెందుతోంది. పాలనాపరంగా విమర్శలు ఉన్నప్పటికీ, ఆయనకు మైనార్టీలు, వెనుకబడిన వర్గాలు, దళితుల (అహిందా - AHINDA) ఓటు బ్యాంకు అండగా ఉంది. 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపులో ఈ ఓటు బ్యాంకు కీలక పాత్ర పోషించింది. వొక్కలిగ, లింగాయత్ కుల సమీకరణాలను దాటి పార్టీని గెలిపించిన ఈ ఓటు బ్యాంకును దూరం చేసుకోవడానికి పార్టీ సుముఖంగా లేదు. పొరుగున ఉన్న తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని నవంబర్‌లోనే ఈ మార్పును వాయిదా వేశారు.

ట్రబుల్ షూటర్‌కు మళ్లీ నిరాశేనా?

64 ఏళ్ల డీకే శివకుమార్ ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా, పీసీసీ చీఫ్‌గా రెండు కీలక బాధ్యతల్లో ఉన్నారు. రాహుల్ గాంధీ తీసుకొచ్చిన 'వన్ మ్యాన్-వన్ పోస్ట్' (One Man One Post) నిబంధనను కూడా డీకేఎస్ కోసం పక్కనపెట్టారంటే.. పార్టీలో ఆయన ప్రాముఖ్యత ఏంటో అర్థం చేసుకోవచ్చు. తమిళనాడు ఎన్నికలు ముగియడంతో, ఈసారైనా ఆయనకు సీఎం పీఠం దక్కుతుందని ఆశించిన అభిమానులకు ప్రస్తుతానికి అధిష్టానం ప్రకటనతో నిరాశే ఎదురైనట్లు తెలుస్తోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement