త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ

ఓటర్ల జాబితా సవరణ (SIR)పై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయా? జస్టిస్ మదన్ లోకూర్ నేతృత్వంలోని స్వతంత్ర కమిషన్ రేపు ఢిల్లీలో చేపట్టనున్న కీలక విచారణ వివరాలు ఇవే.

J

National | Published On Oct 14, 2026, 3.16 pm IST

Justice Madan Lokur | ఓటర్ల జాబితా సవరణపై వెల్లువెత్తుతున్న ఫిర్యాదులు.. సమస్యలపై మాజీ జడ్జిల కమిషన్.. రేపే తొలి విచారణ

సంక్షిప్త సారాంశం

ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై వస్తున్న ఫిర్యాదులను విచారించేందుకు స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ నేతృత్వంలో అక్టోబర్ 15న ఢిల్లీలోని జవహర్ భవన్‌లో తొలి పబ్లిక్ హియరింగ్ ఉండనుంది. కమిషన్‌లో సభ్యులుగా మాజీ న్యాయమూర్తులు జస్టిస్ ఏ.కె.పట్నాయక్, జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్, జస్టిస్ రేఖా శర్మ, జస్టిస్ అంజనా ప్రకాష్ ఉంటారు. ఈ విచారణకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) సమాచారం అందించి, ఆహ్వానించాలని సెక్రటేరియట్‌ను కమిషన్ ఆదేశించింది.

Advertisement
  • గురువారం ఢిల్లీలో జస్టిస్ మదన్ లోకూర్ కమిషన్ తొలి పబ్లిక్ హియరింగ్

Justice Madan Lokur | త్రినేత్ర న్యూస్ : ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియపై ఓటర్ల నుంచి వస్తున్న ఫిర్యాదులను విచారించేందుకు ఏర్పాటైన స్వతంత్ర కమిషన్ (Independent Commission) రంగంలోకి దిగింది. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ నేతృత్వంలోని ఈ కమిషన్, అక్టోబర్ 15న (గురువారం) న్యూఢిల్లీలోని జవహర్ భవన్‌లో తన మొదటి బహిరంగ విచారణ (Public Hearing) నిర్వహించనుంది.

విచారణ ముఖ్య ఉద్దేశం ఇదే

'లాయర్స్ అసోసియేషన్ ఫర్ కాన్‌స్టిట్యూషన్' (LAFC) ప్రతిపాదనతో ఈ స్వతంత్ర కమిషన్ ఏర్పాటైంది. ప్రస్తుతం జరుగుతున్న ఓటర్ల జాబితా సవరణ (SIR) ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొని, కమిషన్‌ను ఆశ్రయించిన ఓటర్ల సమస్యలను వినడం, వారి వాంగ్మూలాలను (Testimonies) అధికారికంగా రికార్డ్ చేయడం ఈ హియరింగ్ ప్రధాన ఉద్దేశం.

దేశవ్యాప్తంగా నిర్వహించ తలపెట్టిన వరుస విచారణల్లో భాగంగా ఢిల్లీలో ఈ తొలి పబ్లిక్ హియరింగ్ జరుగుతోంది. బాధిత ఓటర్లు తమ ఆందోళనలను చెప్పుకోవడానికి ఒక వేదికను కల్పించడంతో పాటు, అర్హులైన ప్రతి పౌరుడి ఓటు హక్కును కాపాడటం, ప్రజాస్వామ్యంలో ప్రతి ఓటరు గొంతుకకు విలువ ఉంటుందనే ప్రాథమిక సూత్రాన్ని నిలబెట్టడం ఈ కార్యక్రమం లక్ష్యం.

కమిషన్‌లోని సభ్యులు వీరే

సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ ఛైర్మన్‌గా వ్యవహరిస్తున్న ఈ కమిషన్‌లో దేశంలోని ప్రముఖ మాజీ న్యాయమూర్తులు సభ్యులుగా ఉన్నారు.

  • జస్టిస్ ఏకే పట్నాయక్ (సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి)
  • జస్టిస్ బదర్ దుర్రేజ్ అహ్మద్ (జమ్ముకశ్మీర్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి)
  • జస్టిస్ రేఖా శర్మ (ఢిల్లీ హైకోర్టు మాజీ న్యాయమూర్తి)
  • జస్టిస్ అంజనా ప్రకాష్ (పాట్నా హైకోర్టు మాజీ న్యాయమూర్తి)

ఎన్నికల సంఘానికి (ECI) ఆహ్వానం

ఈ పబ్లిక్ హియరింగ్ ఏర్పాట్లలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘానికి (ECI) సమాచారం అందించి, వారిని విచారణకు ఆహ్వానించాలని కమిషన్ తన సెక్రటేరియట్‌ను ఆదేశించింది. ఈ ప్రొసీడింగ్స్‌కు హాజరయ్యేందుకు ఒక సీనియర్ అధికారిని నామినేట్ చేయాలని కోరుతూ ఎన్నికల సంఘానికి కమిషన్ నోటీసు జారీ చేసింది.

Advertisement
Advertisement