త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Tricolour Ribbon | ఎగ్జిబిష‌న్ ప్రారంభోత్స‌వానికి మువ్వన్నెల రిబ్బన్‌.. క‌ట్‌చేసేది లేద‌న్న సీఎం..

Tricolour Ribbon | ఎగ్జిబిష‌న్ (Exhibition) ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రికి వింత అనుభ‌వం ఎదురైంది. మువ్వ‌న్నెల రిబ్బ‌న్‌ను (Tricolour Ribbon) ఏర్పాటుచేసిన‌ నిర్వాహ‌కులు.. దానికి క‌ట్ చేయాలంటూ సీఎం చేతికి క‌త్తెర ఇచ్చారు.

G

National | Published On Apr 16, 2026, 7.54 am IST

Tricolour Ribbon | ఎగ్జిబిష‌న్ ప్రారంభోత్స‌వానికి మువ్వన్నెల రిబ్బన్‌.. క‌ట్‌చేసేది లేద‌న్న సీఎం..
Advertisement

Tricolour Ribbon | త్రినేత్ర‌.న్యూస్‌: ఎగ్జిబిష‌న్ (Exhibition) ప్రారంభోత్స‌వానికి వ‌చ్చిన ముఖ్య‌మంత్రికి వింత అనుభ‌వం ఎదురైంది. మువ్వ‌న్నెల రిబ్బ‌న్‌ను (Tricolour Ribbon) ఏర్పాటుచేసిన‌ నిర్వాహ‌కులు.. దానికి క‌ట్ చేయాలంటూ సీఎం చేతికి క‌త్తెర ఇచ్చారు. అయితే దానికి తిర‌స్క‌రించిన ఆయ‌న‌.. ఆ రిబ్బ‌న్ పెట్టాల‌నే ఆలోచ‌న వ‌చ్చిన వారిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. దీంతో నీళ్లు న‌ములడం నిర్వాహ‌కుల వంతైంది.

జమ్ముక‌శ్మీర్ రాజ‌ధాని శ్రీనగర్‌లోని కశ్మీర్‌ హాత్‌ ప్రాంతంలో ‘నో యువర్‌ ఆర్టిసాన్‌’ పేరుతో ఎగ్జిబిషన్‌ను ఏర్పాటు చేశారు. దానిని ప్రారంభించేందుకు ముఖ్యమంత్రి ఒమర్‌ అబ్దుల్లా (CM Omar Abdullah) ముఖ్యతిథిగా వ‌చ్చారు. ముఖద్వారానికి అడ్డంగా పెట్టిన ప్రారంభోత్సవ రిబ్బన్‌ను చూసిన ఆయ‌న నిర్వాహ‌కుల‌పై ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఇదేం రిబ్బన్‌? త్రివర్ణ పతాక రంగుల్లో ఎవరైనా రిబ్బన్‌ను సిద్ధంచేస్తారా?. నేను దీనిని అస్సలు కత్తిరించబోను. వెంటనే దీనిని జాగ్రత్తగా పక్కకు తీసేయండి. పడేయకుండా మడతపెట్టి జాగ్రత్తపరచండి’ అని అధికారులకు సూచించారు. మువ్వ‌న్నెల రిబ్బ‌న్ పెట్టాల‌న్న‌ ఐడియా ఎవరిదని ప్ర‌శ్నించారు. దీంతో కంగుతిన్న అక్కడి ఎగ్జిబిషన్‌ నిర్వహకులు మాకు తెలియదంటూ నీళ్లు నమిలారు.

జాతీయజెండాకు నిజమైన గౌరవం ఇవ్వడమంటే ఇదేన‌ని నేషనల్‌ కాన్ఫెరెన్స్‌ పార్టీ నేత గగన్‌ భగత్‌ అన్నారు. చవకబారు టీవీ చర్చలకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా సీఎం సమయస్ఫూర్తితో వ్యవహరించార‌ని చెప్పారు. మన మాటలకంటే చేతలే శక్తివంతంగా ప్రజల్లోకి వెళ్తాయ‌ని తెలిపారు. కాగా, ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. సీఎం అబ్దుల్లా దేశభక్తి, సమయస్ఫూర్తిపై నెటిజ‌న్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాద‌ని జమ్ముక‌శ్మీర్ బీజేపీ అధికార ప్రతినిధి అల్తాఫ్ ఠాకూర్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. తిరంగా జెండా భారతదేశ గర్వానికి, ఐక్యతకు, అమరుల త్యాగాలకు ప్రతీక అన్నారు. దానిని ఒక ప్రారంభోత్సవంలో కత్తిరించే రిబ్బన్‌లా ఉపయోగించడం ద్వారా దాని పవిత్రత పట్ల అవగాహనలేమిని ప్రతిబింబిస్తుందని మండిప‌డ్డారు. ఏదైనా, రిబ్బన్ కత్తిరించడానికి నిరాకరించిన సీఎం నిర్ణయాన్ని ఆయన అభినందించారు. అది జాతీయ పతాకం గౌరవాన్ని నిలబెట్టిందన్నారు. జాతీయ చిహ్నాలు ప్రోటోకాల్, లాంఛనప్రాయ పద్ధతులకు అతీతమైనవని సీఎం అబ్దుల్లా నిర్ణ‌యం ఒక బలమైన సందేశాన్ని పంపుతుంద‌ని చెప్పారు. ఇది త్రివర్ణ పతాకం పట్ల ప్రగాఢమైన బాధ్యత, గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని వెల్ల‌డించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారిని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.

 

Advertisement
Advertisement