త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజ‌య‌వంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్ర‌యోగం

ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీల‌క‌మైన ‘ఈఓఎస్‌-05’(GISAT-1A) ఉపగ్రహాన్ని విజ‌య‌వంతంగా క్ష‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టింది.

G

National | Published On Sep 4, 2026, 7.20 am IST

ISRO | నింగిలోకి నిఘానేత్రం.. విజ‌య‌వంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 ప్ర‌యోగం
Advertisement

ISRO | త్రినేత్ర‌.న్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. దేశ రక్షణ, విపత్తుల నిర్వహణకు కీల‌క‌మైన ‘ఈఓఎస్‌-05’(GISAT-1A) ఉపగ్రహాన్ని విజ‌య‌వంతంగా క్ష‌క్ష్య‌లో ప్ర‌వేశ‌పెట్టింది. శుక్ర‌వారం (సెప్టెంబ‌ర్ 4న‌) తెల్లవారుజామున 2.55 గంటలకు ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీహరికోటలో ఉన్న‌ సతీశ్‌ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌17 (GSLV-F17) రాకెట్‌ను ప్ర‌యోగించింది. నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళ్లిన వాహ‌క నౌక‌.. స‌రిగ్గా 18 నిమిషాల త‌ర్వాత అంటే 3.13 గంట‌ల‌కు 2,367 కిలో బ‌రువున్న అత్యాధునిక భూపరిశీలన ఉపగ్రహం EOS-05ను స‌బ్ జియోసింక్రోన‌స్ ట్రాన్స్‌ఫ‌ర్ ఆర్బిట్ (Sub-GTO)లోకి విజ‌య‌వంతంగా చేర్చింది. అక్కడి నుంచి ఉపగ్రహం తన సొంత ఇంజిన్ల సహాయంతో భూమికి దాదాపు 36,000 కిలోమీటర్ల ఎత్తులోని తుది కక్ష్యకు చేరుకుంటుంది.

సుమారు 51.7 మీటర్ల పొడవు 420.5 టన్నుల బరువున్న ఈ రాకెట్ ద్వారా చేప‌ట్టిన ప్ర‌తిష్ఠాత్మ‌క జీఎస్‌ఎల్‌వీ శ్రేణిలో ఇది 19వ ప్రయోగం. ఇది మూడు దశల ప్రయోగ వాహనం, దీనిలో క్రయోజెనిక్ పైదశ అత్యంత కీలకమైనది. భారత అంతరిక్ష చరిత్రలో జియోసింక్రోనస్ (భూస్థిర) కక్ష్య నుంచి భూమిని పరిశీలించే మొట్టమొదటి ఇమేజింగ్ ఉపగ్రహం ఇదే కావడం విశేషం. ఈ విజ‌యంతో ఇస్రో పాత ఓట‌మికి బ‌దులు తీర్చుకున్న‌ట్ల‌యింది. 2021 ఆగస్టులో జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌10 (EOS-03) మిషన్‌ ద్వారా ప్రయోగించిన జీశాట్‌-1 ఉపగ్రహం క్రయోజెనిక్ దశలో సాంకేతిక లోపం వల్ల విఫలమైంది. దానికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు సరికొత్త ఈవోఎస్‌-05 (GISAT-1A) మిషన్‌ను స‌క్సెస్ చేసి త‌న స‌త్తా చాటింది.

నిఘానేత్రం..

సాధారణంగా లో-ఎర్త్‌ ఆర్బిట్‌(లియో), సన్‌ సింక్రోనస్‌ ఆర్బిట్లలో ఉండే ఉపగ్రహాలు ఒక ప్రాంతాన్ని చిత్రీక‌రించ‌డానికి కొన్ని రోజుల నుంచి వారాల సమయం పడుతుంది. కానీ ఈఓఎస్‌-05 భూస్థిర కక్ష్యలో (Geo Orbit) ఉంటూ.. మొత్తం దక్షిణాసియాను ఒకే ఫ్రేమ్‌లో ఫొటో తీయగల సామ‌ర్థ్యం క‌లిగి ఉంది. భారత ఉపఖండం మొత్తాన్ని కేవలం 10 నిమిషాలకు ఒకసారి చిత్రీకరించి పంపగలుగుతుంది. ఇందులో అమర్చిన ఎంఎక్స్‌-వీఎన్‌ఆర్‌ పేలోడ్‌ అద్భుతమైన 42 మీటర్ల (ఒక పిక్సెల్‌కు) స్పేషియల్‌ రిజల్యూషన్‌ను కలిగి ఉంది. జియో కక్ష్యలో ఇంతటి అత్యుత్తమ రిజల్యూషన్‌ కలిగిన కెమెరాతో ఉన్న ఉపగ్రహం ప్రపంచంలోనే ఇదే తొలిసారి.

సరిహద్దుల్లో శత్రు దేశాలు సైనిక స్థావరాలను ఎంత రహస్యంగా దాచినప్పటికీ.. వాటిని ఇట్టే పసిగట్టే సత్తా ఈ ఉపగ్రహానికి ఉంది. ఈ ‘నిఘా నేత్రం’ భారతదేశ సరిహద్దులతో పాటు ఉపఖండంపై నిరంతర నిఘా ఉంచుతుంది. ఇది వాతావరణ మార్పులు, విపత్తుల నిర్వహణ, వ్యవసాయం, రక్షణ రంగాలకు అవసరమైన హై-రెజల్యూషన్ చిత్రాలను, సమాచారాన్ని 24/7 అందిస్తుంది.

Advertisement
Advertisement