వెయ్యి రోజుల సంబరాల వేళ.. కాంగ్రెస్‌కు ‘కొండంత’ నొప్పి!
వెయ్యి రోజుల పాలనను విజయోత్సవంగా మార్చుకోవాల్సిన వేళ.. తెలంగాణ కాంగ్రెస్‌ను వరుస వివాదాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. సురేఖ ఉద్వాసన నుంచి 22-A సెగ వరకు.. సంబరాల సందడిని రాజకీయ తలనొప్పులే కమ్మేశాయి.
సంక్షిప్త సారాంశం
వెయ్యి రోజుల మైలురాయి.. కానీ కాంగ్రెస్‌లో సెలబ్రేషన్స్ కంటే కాంట్రవర్సీలే హైలైట్! సురేఖ ఎపిసోడ్ నుంచి 22-A సెగ వరకు.. రేవంత్ సర్కార్‌కు సంబరాల వేళే ‘కొండంత’ పొలిటికల్ ప్రెజర్!
సురేఖ ఔట్.. 22-A సెగ.. వెయ్యి రోజుల వేళ కాంగ్రెస్‌కు వరుస షాక్‌లు!
సురేఖ ఉద్వాసన.. సుష్మిత ఆరోపణలు.. చిన్నారెడ్డి, జక్కిడిపై చర్యలు
రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల హీట్.. బయట 22-A సెగ
వెయ్యి రోజుల పాలన.. ఏ ప్రభుత్వానికైనా ఇది చెప్పుకోదగ్గ మైలురాయి. చేసిన పనులను ప్రజల ముందుంచి, విజయాలను రాజకీయంగా మలుచుకునే సందర్భం. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ మైలురాయిని చేరుకుంది. కానీ సంబరాల సందడి కంటే వరుస వివాదాలే ఇప్పుడు ఎక్కువగా చర్చకు వస్తున్నాయి.
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించడం, సీనియర్ నేత చిన్నారెడ్డిని కీలక పదవి నుంచి తొలగించడం, జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు.. వీటికి తోడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, 22-A భూముల వివాదం. మొత్తం మీద వెయ్యి రోజుల విజయాల కథ చెప్పాల్సిన సమయంలో కాంగ్రెస్‌కు రాజకీయంగా ‘కొండంత’ నొప్పి వచ్చిపడినట్లైంది.
సురేఖ ఔట్.. సుష్మిత ఆరోపణల హీట్
కొంతకాలంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంపై కొండా కుటుంబం నుంచి వినిపిస్తున్న అసంతృప్తి చివరకు తీవ్ర రాజకీయ ఘర్షణగా మారింది. కుమార్తె సుష్మిత చేసిన వ్యాఖ్యలు, ఆ తర్వాతి పరిణామాలు పార్టీ క్రమశిక్షణ కమిటీ వరకు వెళ్లి, చివరకు కొండా సురేఖ మంత్రి పదవిని కోల్పోయే స్థాయికి చేరాయి. మంత్రి పదవి నుండి సురేఖ ఉద్వాసనతో వివాదం ముగియలేదు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని సుష్మిత చేసిన తీవ్ర ఆరోపణలు మరోసారి రాజకీయ వేడి పెంచాయి. ఆ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఆధారాలతో తేలాల్సిన విషయమే అయినా, మొన్నటివరకు ప్రభుత్వంలో కీలక మంత్రిగా ఉన్న నేత కుటుంబం నుంచే సీఎం, ఆయన కుటుంబంపై ఇలాంటి విమర్శలు రావడం కాంగ్రెస్‌కు ఇబ్బందికర పరిణామం.
వెయ్యి రోజుల పాలనలో సాధించిన విజయాలను చెప్పుకోవాల్సిన సమయంలో ముఖ్యమంత్రి తన సొంత పార్టీ నేత కుటుంబం నుంచి వస్తున్న ఆరోపణలతోనే రాజకీయంగా బిజీ కావాల్సి రావడం సంబరాల ఉత్సాహంపై నీడ పడినట్లైంది.
చిన్నారెడ్డికి షాక్.. జక్కిడిపై సస్పెన్షన్
సురేఖతోనే చర్యలు ఆగలేదు. సీనియర్ నేత జి. చిన్నారెడ్డిని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్ష పదవి నుంచి తొలగించగా, ఎల్‌బీ నగర్‌కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత జక్కిడి ప్రభాకర్ రెడ్డిపై పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ముగ్గురు సీనియర్ నేతలపై వేర్వేరు రూపాల్లో చర్యలు రావడం తెలంగాణ కాంగ్రెస్‌లో క్రమశిక్షణ అంశాన్ని ప్రధాన చర్చగా మార్చింది. పార్టీ గీత దాటితే చర్య తప్పదన్న సంకేతాన్ని నాయకత్వం ఇస్తున్నప్పటికీ, అసంతృప్తి ఎందుకు వరుసగా బహిరంగ రూపం దాల్చుతోందన్న ప్రశ్న మాత్రం అలాగే మిగిలింది. వెయి రోజుల పాలన సంబరాల వేళ ఇలా నేతలపై చర్యలు తీసుకోవడం అధిష్టానానికి కూడ కొండంత తల నొప్పిగా మారిందనడంలో సందేహం లేదు.
రాజగోపాల్ రెడ్డి మాటల మంటలు
ఇదిలా ఉంటే.. ఇక మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు మరోసారి పార్టీలో హీట్ పెంచాయి. తనకు ముఖ్యమంత్రి అయ్యే సమయం వస్తే బ్రహ్మదేవుడు కూడా అడ్డుకోలేడనే స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయ చర్చకు దారితీశాయి. అదే సమయంలో పాత కాంగ్రెస్–కొత్త కాంగ్రెస్ అంశాన్నీ ఆయన ప్రస్తావించారు. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలతో పార్టీ బలపడటంలో తప్పులేదని చెబుతూనే, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోనన్న భావనను వ్యక్తం చేశారు. ఒకవైపు క్రమశిక్షణ చర్యలు కొనసాగుతుండగా, మరోవైపు సీనియర్ ఎమ్మెల్యే నుంచే ఇలాంటి వ్యాఖ్యలు రావడం పార్టీలో అంతా సాఫీగా లేదన్న భావనకు మరింత బలం చేకూర్చింది.
కాంగ్రెస్ కు తగిలిన 22-A సెగ
కాంగ్రెస్‌కు సమస్యలు అంతర్గత రాజకీయాలకే పరిమితం కాలేదు. 22-A భూముల వివాదం కూడా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. కొన్ని సర్వే నంబర్లలోని మొత్తం భూములు నిషేధిత జాబితాలోకి వెళ్లడంతో నిజమైన భూ యజమానులు కూడా ఇబ్బందులు పడుతున్నారన్న ఫిర్యాదులు తెరపైకి వచ్చాయి. ప్రభుత్వం సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నప్పటికీ, అప్పటికే BRS, BJP ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకున్నాయి. కాంగ్రెస్ వెయ్యి రోజుల విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తుంటే, ప్రతిపక్షాలు 22-A సహా ప్రజలను నేరుగా తాకే సమస్యలను ముందుకు తెస్తున్నాయి.
సంబరాల కంటే సమస్యలే ముందుకొచ్చాయా?
వెయ్యి రోజుల మైలురాయి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి రాజకీయంగా పాజిటివ్ మూమెంట్ కావాల్సింది. కానీ సురేఖ ఉద్వాసన, సుష్మిత ఆరోపణలు, చిన్నారెడ్డి–జక్కిడిపై చర్యలు, రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు, 22-A వివాదం.. ఇవన్నీ ఒకేసారి తెరపైకి రావడంతో సంబరాల సందడి వెనక్కి వెళ్లిపోయింది. దీనికి తోడు కీలక వివాదాలు ఢిల్లీ వరకు వెళ్లి అధిష్ఠానం జోక్యం చేసుకోవాల్సి రావడం రాష్ట్ర నాయకత్వంపై మరో ప్రశ్నను నిలబెడుతోంది. పార్టీ అంతర్గత సమస్యలను సర్దుబాటు చేయడం, ప్రజలను తాకే వివాదాలకు త్వరగా పరిష్కారం చూపడం ఇప్పుడు కాంగ్రెస్ ముందున్న అసలు పరీక్ష. వెయ్యి రోజుల విజయాలను చెప్పుకోవడం ఒక ఎత్తయితే.. ఈ రాజకీయ కుదుపులను అదుపులో పెట్టి మిగిలిన పాలనను సాఫీగా నడపడం మరో ఎత్తు. సంబరాల వేళ వచ్చిపడిన ఈ ‘కొండంత’ నొప్పిని కాంగ్రెస్ ఎంత త్వరగా తగ్గించుకుంటుందన్నదే ఇప్పుడు అసలు రాజకీయ ప్రశ్న.
ట్యాగ్స్:
తాజావార్తలు
- ●Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!
- ●Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు
- ●Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్
- ●Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా
- ●Ananya Panday | లైగర్ హీరోయిన్ గ్లామర్ ట్రీట్
- ●Kollywood | హీరోయిన్గా మారిన పైలట్ - కోలీవుడ్ సినిమాలో ఛాన్స్

Horoscope | సెప్టెంబర్ 4 రాశిఫలాలు.. ఈ రాశి వారికి ప్రేమ వ్యవహారాలు అనుకూలంగా ఉంటాయి!

Konda Sushmita Patel | మా అమ్మను రేవంత్ రెడ్డి అవమానించారు

Konda Surekha | కొండా సురేఖ బర్తరఫ్కు గవర్నర్ ఆమోదం.. సీఎంవో ఆధీనంలో ఆమె ఛాంబర్

Chinna Reddy | మెడ పట్టి.. బయటకు పంపుతానంటే కూడా భరించా



