త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ISRO | జీపీఎస్‌ వ్య‌వ‌స్థ బ‌లోపేతం.. జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగం విజ‌య‌వంతం

ISRO | భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శుక్ర‌వారం రాత్రి 11.51 గంట‌ల‌కు శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళింది.

G

National | Published On Oct 31, 2026, 6.29 am IST

ISRO | జీపీఎస్‌ వ్య‌వ‌స్థ బ‌లోపేతం.. జీఎస్ఎల్‌వీ ప్ర‌యోగం విజ‌య‌వంతం
Advertisement

ISRO | త్రినేత్ర న్యూస్‌: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) మరో ఘనత సాధించింది. జీఎస్‌ఎల్‌వీ ఎఫ్‌18 (GSLV-F18) రాకెట్‌ను విజయవంతంగా ప్రయోగించింది. శుక్ర‌వారం రాత్రి 11.51 గంట‌ల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం రెండో ప్రయోగవేదిక నుంచి జీఎస్ఎల్‌వీ రాకెట్‌ నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకెళింది. 20 నిమిషాల వ్య‌వ‌ధిలోనే నావిగేష‌న్ వ్య‌వ‌స్థ (NavIC) బ‌లోపేతానికి NVS-03 ఉపగ్రహాన్ని నిర్దేశిత భూస్థిర కక్ష్యలోకి ప్ర‌వేశ‌పెట్టింది. 2,232 కిలోల బ‌రువున్న ఈ ఉప‌గ్ర‌హం దేశీయ జీపీఎస్ వ్య‌వ‌స్థ‌ను (GPS System) మ‌రింత శ‌క్తివంతం చేస్తుంది.

ఇందులో సాధార‌ణ మొబైల్స్‌, స్మార్ట్‌వాచ్‌ల‌లో నావిగేష‌న్ సేవ‌లు (Navigation System) సుల‌భంగా అందేలా `L1 సిగ్న‌ల్‌` ఫ్రీక్వెన్సీని చేర్చారు. అదేవిధంగా అత్యంత కచ్చితమైన సమయాన్ని లెక్కించేందుకు స్వదేశీ, విదేశీ పరిజ్ఞానాలతో రూపొందించిన అణు గడియారాలను (Atomic Clocks) ఏర్పాటుచేశారు. సాధారణంగా నేవిగేషన్ ఉపగ్రహాల కచ్చితత్వం వాటిలోని అణు గడియారాల సమయపాలనపైనే ఆధారపడి ఉంటుంది. గతంలో ఉపయోగిస్తున్న ఎల్5 (L5), ఎస్ (S) బ్యాండ్లతో పాటు, ఈ ఉపగ్రహం ద్వారా పౌర సేవల కోసం ప్రత్యేకంగా ఎల్1 (L1) సిగ్నల్ వ్యవస్థను కూడా జోడించారు. 12 ఏండ్ల సుదీర్ఘ జీవిత‌కాలం క‌లిగిన ఈ ఉప‌గ్ర‌హం ర‌క్ష‌ణ‌, పౌర అవ‌స‌రాల కోసం విదేశీ జీపీఎస్‌పై (GPS) ఆధార‌ప‌డే అవ‌స‌రం లేకుండా చేస్తుంది.

భార‌త్ సొంత నావిక్‌ వ్యవస్థ అయిన `నావిక్‌` ద్వారా భారతదేశ‌ భూ భాగంతోపాటు సరిహద్దుల వెలుపల సుమారు 1500 కిలోమీటర్ల పరిధిలో అత్యంత కచ్చితమైన సమాచార, స్థాన గుర్తింపు సేవలు అందనున్నాయి. భూ రవాణా వ్యవస్థల్లో వాహనాల పర్యవేక్షణ (Fleet Management), ట్రాఫిక్ నిర్వహణ, జాతీయ రహదారులపై రవాణా ట్రాకింగ్‌కు ఉపయోగపడుతుంది. అదేవిధంగా గగనతలంలో విమానాల కదలికలను సరిగ్గా గుర్తించడంతో పాటు, సముద్రంలో వేటకు వెళ్లే మత్స్యకారులకు నావిగేషన్ మార్గదర్శనం, వాతావరణ హెచ్చరికలు అందించడంలో తోడ్పడుతుంది. వరదలు, తుపాన్లు వంటి ప్రకృతి విపత్తుల వేళ తక్షణ సహాయక చర్యలను సమన్వయం చేయడానికి, అత్యవసర సేవల వాహనాల రాకపోకలను పర్యవేక్షించడానికి దోహదం చేస్తుంది. కాగా, జీఎస్‌ఎల్‌వీ (GSLV) వాహక నౌకకు ఇది 20వ ప్రయోగం కావ‌డం విశేషం.

ట్యాగ్స్:

GpsGSLV F18ISRONavICNavigation SatelliteNavigation System
Advertisement
Advertisement