త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

President Rule | 13తో మ‌ణిపూర్‌లో ముగియ‌నున్న రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. ఇప్ప‌ట్లో ప్ర‌భుత్వం ఏర్ప‌డేనా?

President Rule | మ‌ణిపూర్‌లో (Manipur) మ‌రో ప‌ది రోజుల్లో రాష్ట్ర‌ప‌తి పాల‌న (President Rule) ముగియ‌నుంది. భ‌ద్ర‌తా ద‌ళాల ఆదీనంలో ఉన్నప్ప‌టికీ అడ‌పాద‌డ‌పా హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 13న‌ మ‌రోమారు రాష్ట్ర‌పాల‌న‌ను పొడిగిస్తారా? లేదా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారా?.

G

National | Published On Feb 2, 2026, 10.06 am IST

President Rule | 13తో మ‌ణిపూర్‌లో ముగియ‌నున్న రాష్ట్ర‌ప‌తి పాల‌న‌.. ఇప్ప‌ట్లో ప్ర‌భుత్వం ఏర్ప‌డేనా?
Advertisement

President Rule | త్రినేత్ర‌.న్యూస్‌: ఈశాన్య రాష్ట్రం మ‌ణిపూర్‌లో (Manipur) మ‌రో ప‌ది రోజుల్లో రాష్ట్ర‌ప‌తి పాల‌న (President Rule) ముగియ‌నుంది. భ‌ద్ర‌తా ద‌ళాల ఆదీనంలో ఉన్నప్ప‌టికీ అడ‌పాద‌డ‌పా హింసాత్మ‌క ఘ‌ట‌నలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో 13న‌ మ‌రోమారు రాష్ట్ర‌పాల‌న‌ను పొడిగిస్తారా లేదా ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేస్తారా అనే అంశంపై సందిగ్ధ‌త నెల‌కొన్న‌ది. ప్ర‌భుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఎన్డీయే ఎమ్మెల్యేలు ఇప్ప‌టికే ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. ఇందులో భాగంగా ఎమ్మెల్యేలంతా క‌లిసి ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు.

కాగా, చిన్న రాష్ట్రమైన మణిపుర్‌లో రెండు గ్రూపులైన మెజార్టీ మెయితెయ్ (Meitei Community), మైనార్టీ కుకీ తెగల (Kuki-Zo community) మధ్య భూమి, పలుకుబడి విషయంలో నెలకొన్న వివాదం జాతుల మధ్య ఘ‌ర్ష‌ణ‌కు దారితీసింది. అదికాస్తా హింసాత్మ‌కంగా మార‌డంతో రాష్ట్రాన్ని తీవ్ర అంతర్యుద్ధంలోకి నెట్టేసింది. 2023 మే3న మైతేయీ, కుకీ తెగల మధ్య ప్రారంభ‌మైన‌ హింస దీర్ఘకాలంపాటు కొన‌సాగింది. దీనిని అరికట్టడంలో విఫ‌ల‌మైన ముఖ్యమంత్రిగా బీరెన్ సింగ్ (Biren Singh).. 2025 ఫిబ్ర‌వ‌రి 13న త‌న ప‌ద‌వికి రాజీనామా చేశారు. వెంట‌నే కేంద్ర ప్ర‌భుత్వం రాష్ట్రప‌తి పాల‌న‌ను విధించింది. రాష్ట్రంలో శాంతి భ‌ద్ర‌త‌ల ప‌రిర‌క్ష‌ణ‌ను సైన్యానికి అప్ప‌గించింది. దీంతో హింస క్ర‌మంగా త‌గ్గుతూ వ‌చ్చి సాధార‌ణ ప‌రిస్థితులు ఏర్ప‌డ్డాయి. అయిన‌ప్ప‌టికీ అప్పుడ‌ప్పుడు రెండు తెగ‌ల‌కు చెందిన‌వారు ఒక‌రిని ఒక‌రు చంపుకుంటూనే ఉన్నారు.

జాతుల మధ్య ఘ‌ర్ష‌ణ‌తో మొద‌లు..

తొలుత 2025 ఫిబ్ర‌వ‌రి 13న మ‌ణిపూర్‌లో ఆరు నెల‌ల‌పాటు రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించారు. అది ఆగ‌స్టు వ‌ర‌కు కొన‌సాగింది. అనంత‌రం ఆగ‌స్టు 13 నుంచి ఫిబ్ర‌వ‌రి 13 వ‌ర‌కు మ‌రోసారి పొడిగిస్తూ 2025 ఆగ‌స్టు 5న కేంద్ర ప్ర‌భుత్వం ఆదేశాలు జారీచేసింది. ఈ క్ర‌మంలో ఈ నెల‌ 13తో అక్క‌డ రాష్ట్రప‌తి పాల‌న గ‌డువు ముగిసిపోతున్న‌ది.

కాగా, రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 కింద రాష్ట్రపతి పాలన విధిస్తారు. ఒక రాష్ట్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా పనిచేయడంలో విఫలమైనప్పుడు కేంద్రం నియంత్రణను తీసుకునేందుకు ఈ అధిక‌ర‌ణ‌ అనుమతిస్తుంది. దీంతో రాష్ట్ర అధికారాలు కేంద్రానికి బదిలీ అవుతాయి. శాసనసభ విధులు పార్లమెంటుకు మారుతాయి. ఇలా 1950 నుంచి 29 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో 134 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

అత్య‌ధికసార్లు మ‌ణిపూర్‌లోనే

ఇప్ప‌టివ‌ర‌కు మణిపూర్, ఉత్తరప్రదేశ్‌లలో ఎక్కువ‌గా రాష్ట్రపతి పాలన అమ‌లులో ఉన్న‌ది. అత్య‌ధిక కాలం జ‌మ్ముక‌శ్మీర్‌లో, ఎక్కువ సార్లు మ‌ణిపూర్‌లో రాష్ట్ర‌ప‌తిపాల‌న విధించారు. జమ్ముక‌శ్మీర్‌లో మొత్తంగా 12 ఏండ్ల‌కు పైగా ప్రెసిడెంట్ రూల్ కొనసాగిన రికార్డు ఉంది. కాగా, మ‌ణిపూర్‌లో ఇప్పటివరకు 12 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. మ‌రోసారి పొడిగిస్తే 13వ ప‌ర్యాయం అవుతుంది. దేశంలో మ‌రే రాష్ట్రంలోనూ ఇన్నిసార్లు రాష్ట్రపతి పాలన విధించలేదు. మణిపూర్ తర్వాత ఉత్తరప్రదేశ్ రెండో స్థానంలో ఉన్న‌ది. ఉత్తరప్రదేశ్‌లో కూడా 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. ఉత్తరప్రదేశ్‌లో 1968 నుంచి 2002 మధ్య కాలంలో వివిధ సందర్భాల్లో 10 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు.

మణిపూర్ విషయానికి వస్తే.. 1967 నుంచి 2025 మధ్యకాలంలో వివిధ సందర్భాల్లో 12 సార్లు రాష్ట్రపతి పాలన విధించారు. చివ‌ర‌గా 2001లో రాష్ట్ర‌ప‌తి పాల‌న అమ‌లులో ఉన్న‌ది. అయితే 20 నెలలకుపైగా జాతుల మ‌ధ్య వైరం కొన‌సాగ‌డంతో 2025 ఫిబ్ర‌వ‌రిలో 11వ సారి అక్క‌డ ప్రెసిడెంట్ రూల్ విధించారు. దానిని ఆగ‌స్టులో (12వ‌సారి) పొడిగించిన విష‌యం తెలిసిందే.

Advertisement

తాజావార్తలు

Advertisement