త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nitin Gadkari | పెట్రోల్‌, డీజిల్‌కు కాలం చెల్లిన‌ట్లేనా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నితిన్ గ‌డ్క‌రీ..!

Nitin Gadkari | పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌తో దేశంలో అధికంగా కాలుష్యం ఏర్ప‌డుతోంద‌ని కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు అందుబాటులోకి రావడం సంతోషకర విష‌య‌మ‌ని తెలిపారు.

P

National | Published On May 23, 2026, 3.21 pm IST

Nitin Gadkari | పెట్రోల్‌, డీజిల్‌కు కాలం చెల్లిన‌ట్లేనా..? ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసిన నితిన్ గ‌డ్క‌రీ..!
Advertisement

Nitin Gadkari | పెట్రోల్‌, డీజిల్ వాహ‌నాల‌తో దేశంలో అధికంగా కాలుష్యం ఏర్ప‌డుతోంద‌ని కేంద్ర‌మంత్రి నితిన్ గ‌డ్క‌రీ పేర్కొన్నారు. ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ స్కూటర్లు, ఎలక్ట్రిక్ కార్లు, బస్సులు, ట్రక్కులు, ట్రాక్టర్లు అందుబాటులోకి రావడం సంతోషకర విష‌య‌మ‌ని తెలిపారు. రైతులు ఇకపై కేవలం అన్నదాతలుగానే కాకుండా దేశానికి ఇంధనం, విద్యుత్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్నార‌న్నారు. ఈ సంద‌ర్భంగా ఉప‌యోగిస్తున్న కారు చూపిస్తూ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. “నేను ఈరోజు వచ్చిన కారు పూర్తిగా బయో ఇథనాల్‌తో నడుస్తోంది.

ప్రస్తుతం ఇథనాల్ ధర లీటరుకు రూ.65 మాత్రమే. ముఖ్యంగా ఈ వాహనం నడుస్తూనే 60 శాతం విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది” అని చెప్పారు. గత ఏడాదిన్నరగా తాను ఇదే వాహనాన్ని వినియోగిస్తున్నానని గ‌డ్క‌రీ.. పెట్రోల్, డీజిల్‌తో పోలిస్తే ఈ వాహనంతో ఖ‌ర్చు లీట‌ర్‌కు సుమారు రూ.25 మాత్ర‌మే అవుతుంద‌ని వెల్ల‌డించారు. ఈ ఇంధనం పూర్తిగా స్వదేశీదని, కాలుష్యం తగ్గించడమే కాకుండా ఇంధన దిగుమతులను సైతం గణనీయంగా తగ్గిస్తుందని కేంద్ర‌మంత్రి పేర్కొన్నారు. త్వరలోనే ఫ్లెక్స్-ఫ్యూయల్ ఇంజిన్‌లతో కూడిన వాహనాలు భారీ స్థాయిలో మార్కెట్లోకి రానున్నాయని ప్ర‌క‌టించారు. పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఢిల్లీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నట్లు గడ్కరీ వెల్లడించారు.

కార్యక్రమంలో మారుతి సుజుకీ సంస్థ 100 శాతం ఇథనాల్‌తో నడిచే వాహనాలను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఇప్పటికే ట‌యోట‌, టాటా మోటార్‌, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా స‌హా 12 కంపెనీలు ఇలాంటి వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి తీసుకువ‌చ్చాయ‌ని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలు కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చాయని వెల్ల‌డించారు. దేశంలో వినియోగిస్తున్న ఇంధనంలో 87 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోందని గడ్కరీ పేర్కొన్నారు. దీంతో కాలుష్యం పెరగడమే కాకుండా దిగుమతుల భారం కూడా అధిక‌మ‌వుతోంద‌న్నారు. ప్రజలు పెట్రోల్, డీజిల్, గ్యాస్ వినియోగాన్ని తగ్గించాలని ఆయ‌న కోరారు.

Advertisement
Advertisement