త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E100 Fuel | భార‌త్‌లో ఈ100 ఎథ‌నాల్ విప్ల‌వం.. పూర్తి స్థాయిలో అమ‌లుకు కేంద్రం క‌స‌ర‌త్తు..

E100 Fuel | అమెరికా-ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో భార‌త్ తోపాటు అనేక దేశాల ఇంధ‌న స‌ర‌ఫ‌రాకు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతోంది. భార‌త్ త‌న ముడి చ‌మురు అవ‌స‌రాల్లో దాదాపు 80 శాతం మేర దిగుమతుల‌పైనే ఆధార‌ప‌డుతున్న నేప‌థ్యంలో చ‌మురు స‌ర‌ఫరా ఆటంకం మ‌రిన్ని ఇబ్బందుల‌ను సృష్టిస్తోంది.

S

Business | Published On May 20, 2026, 12.08 pm IST

E100 Fuel | భార‌త్‌లో ఈ100 ఎథ‌నాల్ విప్ల‌వం.. పూర్తి స్థాయిలో అమ‌లుకు కేంద్రం క‌స‌ర‌త్తు..
Advertisement

E100 Fuel | అమెరికా-ఇరాన్ యుద్ధం నేప‌థ్యంలో భార‌త్ తోపాటు అనేక దేశాల ఇంధ‌న స‌ర‌ఫ‌రాకు తీవ్ర ఆటంకం ఏర్ప‌డుతోంది. భార‌త్ త‌న ముడి చ‌మురు అవ‌స‌రాల్లో దాదాపు 80 శాతం మేర దిగుమతుల‌పైనే ఆధార‌ప‌డుతున్న నేప‌థ్యంలో చ‌మురు స‌ర‌ఫరా ఆటంకం మ‌రిన్ని ఇబ్బందుల‌ను సృష్టిస్తోంది. అయితే చ‌మురు కొనుగోళ్ల‌ను త‌గ్గించ‌డంతోపాటు, విదేశీ మార‌క నిల్వ‌ల‌ను ఆదా చేసేందుకు కేంద్రం గ‌తంలోనే ఎథ‌నాల్‌ను క‌లిపి దేశంలో ఇంధ‌నం స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. దీంతో చాలా రాష్ట్రాల్లో ఎథ‌నాల్ క‌లిపిన ఇంధ‌నం అందుబ‌టులో ఉంది. అయితే ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితుల నేప‌థ్యంలో క్రూడ్ ఆయిల్ దిగుమ‌తుల‌ను మ‌రింత‌గా త‌గ్గించాల‌నే ఉద్దేశంతో కేంద్రం ఈ100 ఫ్లెక్స్ ఫ్యుయ‌ల్‌ను మ‌రింత‌గా విస్త‌రించి అందించ‌నుంది. ఈ100 ఫ్లెక్స్ ఫ్యుయ‌ల్ అంటే 100 శాతం ఎథ‌నాల్‌. దీన్ని వ‌చ్చే 2 ఏళ్లలో దేశ‌వ్యాప్తంగా భారీ ఎత్తున వాహ‌నాల్లో వినియోగించాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది. అందులో భాగంగా 100 శాతం ఎథ‌నాల్ ఇంధ‌న అందుబాటును వేగంగా విస్త‌రించేందుకు కీల‌క ప్ర‌ణాళిక‌ల‌ను సిద్ధం చేస్తోంది. రానున్న 2 సంవ‌త్స‌రాల కాలంలో దేశ‌వ్యాప్తంగా మొత్తం 5వేల‌కు పైగా ఈ100 ఇంధ‌న స‌ర‌ఫ‌రా స్టేష‌న్ల‌ను ఏర్పాటు చేయాల‌ని కేంద్రం ల‌క్ష్యంగా నిర్ణ‌యించుకుంది.

వాహ‌న త‌యారీ, చ‌మురు సంస్థ‌ల‌తో రోడ్ మ్యాప్‌..

ఫ్లెక్స్ ఫ్యుచ‌ల్ వెహిక‌ల్స్ (FFVs) కోసం అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల రోడ్ మ్యాప్‌ను మే 4న తొలిసారిగా ఆటోమొబైల్ కంపెనీలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల ప్ర‌తినిధుల‌కు కేంద్ర ప్ర‌భుత్వం వివ‌రించింది. దేశంలోని ప్ర‌ధాన కార్ల‌, ద్విచ‌క్ర వాహ‌న త‌యారీ సంస్థ‌లు మారుతి సుజుకి, హుండాయ్‌, టాటా మోటార్స్, మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, హీరో మోటో కార్ప్‌, టీవీఎస్ మోటార్ కంపెనీ ఇప్ప‌టికే ఫ్లెక్స్ ఫ్యుయ‌ల్ వాహ‌నాల ప్రోటో టైప్స్ (న‌మూనాలు) ను సిద్ధం చేశాయి. అయితే ఈ100 ఫ్యుయ‌ల్ పంప్‌లు లేక‌పోవ‌డం, ఈ ఇంధ‌న ధ‌ర‌ల‌పై స్ప‌ష్ట‌త రాక‌పోవ‌డంతో ఇప్ప‌టి వ‌ర‌కు ఈ వాహ‌నాల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేయ‌లేద‌ని ప‌రిశ్ర‌మ వ‌ర్గాలు కేంద్రానికి వెల్ల‌డించాయి. పెట్రోలియం, స‌హజ వాయువు మంత్రిత్వ శాఖ రూపొందించిన ప్ర‌ణాళిక ప్ర‌కారం వ‌చ్చే నెల రోజుల్లో ఢిల్లీ, ముంబై, పూణె, నాగ్‌పూర్ న‌గ‌రాల్లో 150కి పైగా ఈ100 రిటెయిల్ అవుట్‌లెట్ల‌ను ప్రారంభించేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు.

5వేల‌కు పైగా ఈ100 రిటైల్ అవుట్ లెట్లు..

ఆ త‌రువాత 6 నుంచి 12 నెల‌ల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్‌, మ‌హారాష్ట్ర ప్రాంతాల‌తోపాటు బెంగ‌ళూరు, చెన్నై, కోల్‌క‌తా, హైద‌రాబాద్ న‌గ‌రాల్లోనూ ఈ100 మౌలిక వ‌సతుల‌ను విస్త‌రించ‌నున్నారు. ఈ దశలో 500 రిటైల్ అవుట్‌లెట్లు ప్రారంభించడమే లక్ష్యంగా నిర్ణ‌యించుకున్నారు. ఆ తర్వాత మధ్యకాలిక లక్ష్యంగా 24 నెలల్లో దేశవ్యాప్తంగా 5వేలకు పైగా ఈ100 రిటైల్ అవుట్‌లెట్లు కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల ద్వారా భారత్ భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసుకునే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం క్రూడ్ ఆయిల్ దిగుమతుల కోసం సుమారు రూ.10.9 లక్షల కోట్లు ఖర్చు చేసింది. ఇండియన్ షుగర్ అండ్ బయోఎనర్జీ మాన్యుఫాక్చరింగ్ అసోసియేషన్ (ఐఎస్ఎంఏ) డైరెక్టర్ జనరల్ దీప‌క్ బ‌ల్లాని మాట్లాడుతూ భారత్‌కు ఫ్లెక్స్ ఫ్యుయల్ వెహికల్స్ గొప్ప అవకాశంగా మారే అవ‌కాశాలు ఉన్నాయ‌ని అన్నారు. దేశంలో ఉపయోగించే క్రూడ్ ఆయిల్‌లో 85-90 శాతం దిగుమతులపైనే ఆధారపడుతున్నామ‌ని, కానీ ఎథనాల్ మాత్రం పూర్తిగా దేశీయంగా ఉత్పత్తి అవుతోంద‌ని తెలిపారు. దీని ద్వారా 7 నుంచి 8 కోట్ల మంది రైతులు, ఎథనాల్ రంగానికి చెందిన వర్గాలకు మద్దతు లభిస్తుంద‌ని అన్నారు. అయితే ఎఫ్‌ఎఫ్‌వీల విస్తృత వినియోగానికి తక్కువ జీఎస్టీ వంటి పన్ను రాయితీలు కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రోత్సాహ‌కాలు ఇవ్వాలి: నిపుణులు

ఇప్పటికే సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) కేంద్రానికి కీలక సూచనలు చేసింది. సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల్లో మైలేజ్ తక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఈ100 ధరలను కనీసం 30 శాతం తక్కువగా నిర్ణయించాలని కోరింది. అలాగే ఎఫ్‌ఎఫ్‌వీల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఆర్థిక ప్రోత్సాహకాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించింది. ఇక ఇండియ‌న్ ఆయిల్ కార్పొరేష‌న్ కు చెందిన ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ ఐఓసీ పైలట్ ప్రాజెక్ట్ లో భాగంగా దాదాపు 400 అవుట్‌లెట్లలో ఈ100 ఫ్యుయల్ ను అందుబాటులోకి తీసుకువచ్చినా వినియోగం చాలా తక్కువగా నమోదైంద‌ని తెలిపారు. ప్రస్తుతం దేశంలో ఫ్లెక్స్ ఫ్యుయల్ వాహనాల సంఖ్య చాలా తక్కువగా ఉంద‌ని, సాధారణ పెట్రోల్‌తో పోలిస్తే ఈ100లో ఫ్యూయల్ ఎఫిషియెన్సీ కూడా తక్కువగా ఉంటుంద‌ని అన్నారు. అందుకే వినియోగదారులు పెద్దగా ఆసక్తి చూపడం లేద‌ని చెప్పారు.

భారీగా విదేశీ మార‌కం ఆదా..

ప్రస్తుతం దేశంలో పెట్రోల్‌లో 20 శాతం ఎథనాల్ మిశ్రమాన్ని క‌లిపి విక్ర‌యిస్తున్నారు. దీని వల్ల భార‌త్ చాలా వ‌ర‌కు విదేశీ మార‌కాన్ని ఆదా చేస్తోంది. ప్ర‌భుత్వ గ‌ణాంకాల ప్ర‌కారం 2014 నుంచి ఎథ‌నాల్ వాడ‌కం వ‌ల్ల దాదాపు రూ.1.44 లక్ష‌ల కోట్ల విదేశీ మార‌క నిల్వ‌ల‌ను ఆదా చేసిన‌ట్లు వెల్ల‌డైంది. అయితే ప్ర‌స్తుతం ఏడాదికి దాదాపు రూ.10 ల‌క్ష‌ల కోట్ల మేర క్రూడ్ ఆయిల్ దిగుమ‌తుల కోసం ఖ‌ర్చు చేస్తున్న నేప‌థ్యంలో 100 శాతం ఎథ‌నాల్ ను ఇంధ‌నంగా ప్ర‌వేశ‌పెడితే భార‌త్‌కు భారీ ఎత్తున విదేశీ మార‌కం ఆదా అవుతుంద‌ని నిపుణులు చెబుతున్నారు. కానీ ఇందులో అనేక స‌వాళ్లు ఉన్నాయ‌ని, ముందుగా వాటిని ప‌రిష్క‌రించే దిశ‌గా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, అలాగైతే ఈ ప్రాజెక్టు విజ‌య‌వంతం అవుతుంద‌ని అంటున్నారు. వాహ‌న‌దారుల‌కు ఈ ఇంధ‌నంపై అవ‌గాహ‌న కల్పించ‌డంతోపాటు రాయితీలు ఇవ్వ‌డం, త‌యారీ కంపెనీల‌కు ప్రోత్సాహ‌కాల‌ను అందించ‌డం వంటి చ‌ర్య‌లు చేప‌డితే ఈ100 ఇంధ‌న వాడ‌కాన్ని పూర్తి స్థాయిలో అమ‌లు చేయ‌వ‌చ్చ‌ని అంటున్నారు.

Advertisement
Advertisement