త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

E100 Fuel India | పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇక మార్కెట్‌లోకి 100 శాతం ఇథనాల్.. తక్కువ ధరకే లభ్యం

పెట్రోల్ కష్టాలకు చెక్ పెడుతూ 100 శాతం ఇథనాల్ ఇంధన వినియోగానికి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. 100 శాతం ఇథనాల్ (E100) తో నడిచే వాహనాలకు చట్టబద్ధత కల్పిస్తూ ఫైల్‌పై ఆయన సంతకం చేశారు.

J

National | Published On Jun 14, 2026, 4.05 pm IST

E100 Fuel India | పెట్రోల్ కష్టాలకు చెక్.. ఇక మార్కెట్‌లోకి 100 శాతం ఇథనాల్.. తక్కువ ధరకే లభ్యం
Advertisement
  • పెట్రోల్, డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా 100% ఇథనాల్: వాహనదారులకు గుడ్ న్యూస్ చెప్పిన నితిన్ గడ్కరీ
  • 100 శాతం ఇథనాల్ (E100) తో నడిచే వాహనాలకు చట్టబద్ధత కల్పిస్తూ ఫైల్‌పై సంతకం చేసిన నితిన్ గడ్కరీ
  • మారుతి సుజుకి, హీరో మోటోకార్ప్ తదితర సంస్థల నుంచి ఇప్పటికే ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-fuel) వాహనాల లాంచ్
  • పెట్రోల్ ధరతో పోలిస్తే మార్కెట్లో చాలా తక్కువ ధరకు E85, E100 ఇంధనాలు లభ్యం
  • రూ.22 లక్షల కోట్ల భారత ఇంధన దిగుమతి భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ఈ కొత్త పాలసీ

E100 Fuel India | త్రినేత్ర.న్యూస్ : కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వాహనదారులకు ఒక తీపికబురు అందించారు. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ రేట్లతో సతమతమవుతున్న ప్రజలకు ఊరటనిస్తూ.. 100 శాతం ఇథనాల్ (100% Ethanol) ఇంధనంతో నడిచే వాహనాల వినియోగానికి చట్టబద్ధత కల్పించారు. మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో శనివారం జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ఈ సరికొత్త ఇంధన ప్రత్యామ్నాయ విధానాన్ని అధికారికంగా ప్రకటించారు.

ఇథనాల్ వినియోగానికి గ్రీన్ సిగ్నల్

గత కొంతకాలంగా ఇథనాల్ బ్లెండింగ్ (Ethanol Blending) గురించి బలంగా వాదిస్తున్న గడ్కరీ.. ఎట్టకేలకు దీనికి చట్టపరమైన గుర్తింపును తీసుకొచ్చారు. "నిన్న రాత్రి సరిగ్గా 8 గంటలకు 100% ఇథనాల్ వినియోగానికి చట్టబద్ధత కల్పించే ఫైల్‌పై నేను సంతకం చేశాను. ఒకప్పుడు నేను ఈ కల గురించి మాట్లాడినప్పుడు చాలామంది నవ్వారు, కొందరు విమర్శించారు కూడా. కానీ ఈరోజు అది నిజమైంది. ఇది పెట్రోల్‌కు సరైన ప్రత్యామ్నాయంగా మారనుంది," అని ఆయన సగర్వంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వల్ల దేశంపై ఉన్న సుమారు రూ. 22 లక్షల కోట్ల చమురు దిగుమతుల భారం గణనీయంగా తగ్గనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మార్కెట్లోకి ఫ్లెక్స్-ఫ్యూయల్ (Flex-Fuel) వాహనాలు

ఇథనాల్ వాడకం కేవలం మాటలకే పరిమితం కాలేదు.. ఆటోమొబైల్ రంగాన్ని ఇప్పటికే ఈ దిశగా పరుగులు పెట్టిస్తోంది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీతో కలిసి, మారుతి సుజుకికి చెందిన అత్యుత్తమ మోడల్ 'వాగన్ఆర్' (WagonR) 100% ఇథనాల్ వెర్షన్‌ను గడ్కరీ ఇటీవలే లాంచ్ చేశారు.

Nitin Gadkari Approves 100% Ethanol Fuel The End of Petrol

పెట్రోల్ కంటే తక్కువ ధరకే

E85 (85% ఇథనాల్, 15% పెట్రోల్) వంటి ఇంధనాలు ప్రస్తుత పెట్రోల్ ధర కంటే చాలా తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయని మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు. అలాగే, 20% కంటే ఎక్కువ ఇథనాల్ కలిపిన ఇంధనాలపై ప్రస్తుతం ఉన్న 18% GST ని తగ్గించాలని గడ్కరీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. త్వరలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్‌లో దీనిపై సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.

అపోహలు వద్దు.. ఇథనాల్ పవర్ ఫుల్

ఇథనాల్ వాడితే వాహనాల ఇంజిన్ పాడవుతుందనేది కేవలం ఒక అపోహ మాత్రమేనని గడ్కరీ కొట్టిపారేశారు. ఈ సందర్భంగా ఒక ఆసక్తికరమైన సంఘటనను పంచుకున్నారు. "ఒక వ్యక్తి నాకు ఫోన్ చేసి, తన జీపులో ఇథనాల్ పోయడం వల్ల ఇంజిన్ పాడైందని మెకానిక్ చెప్పాడన్నాడు. నీది పెట్రోల్ జీపా, డీజిల్ జీపా అని అడిగితే.. డీజిల్ అన్నాడు. అసలు డీజిల్‌లో మనం ఇథనాల్ కలపనే కలపం కదా, మరి ఇంజిన్ ఎలా పాడవుతుంది? అని అడిగాను. ఇలా ఇథనాల్‌పై ఎన్నో తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి," అని గడ్కరీ వివరించారు. సంప్రదాయ ఇంధనాలతో సమానంగా ఇథనాల్ కూడా అద్భుతమైన పనితీరును కనబరుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

త్వరలో హైడ్రోజన్ బస్సులు

భవిష్యత్తు ఇంధనంగా భావిస్తున్న గ్రీన్ హైడ్రోజన్ (Green Hydrogen) వినియోగంపై కూడా గడ్కరీ కీలక ప్రకటన చేశారు. నీటి నుంచి ఎలక్ట్రోలైజర్ ద్వారా సంగ్రహించిన గ్రీన్ హైడ్రోజన్‌తో నడిచే రెండు బస్సులు, ఒక హైడ్రోజన్ పంప్‌తో కూడిన పైలట్ ప్రాజెక్ట్ (Pilot Project) ను త్వరలోనే నాగ్‌పూర్‌లో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. సామాన్య ప్రజలు కూడా త్వరలో ఈ బస్సుల్లో ప్రయాణించవచ్చని ఆయన ఆనందం వ్యక్తం చేశారు.

Advertisement
Advertisement