త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీక‌ర‌ణ‌.. అయినా త‌గ్గ‌ని డీజిల్ ఇంజిన్ల అవ‌స‌రం..

Diesel Locomotives | ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న భార‌తీయ‌ రైల్వే (Indian Railways).. మరో అరుదైన చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉంది. ఇప్పటికే త‌న బ్రాడ్‌గేజ్ నెట్‌వ‌ర్క్‌లో 99.6 శాతం విద్యుదీక‌ర‌ణ (Electrified) పనుల‌ను పూర్తిచేసి చారిత్రక మైలురాయిని అందుకుంది.

G

National | Published On Oct 5, 2026, 12.09 pm IST

Diesel Locomotives | రైల్వేలో 99.6 శాతం విద్యుదీక‌ర‌ణ‌.. అయినా త‌గ్గ‌ని డీజిల్ ఇంజిన్ల అవ‌స‌రం..
Advertisement

Diesel Locomotives | త్రినేత్ర న్యూస్‌: ప్రపంచంలోనే అతి పెద్ద రవాణా వ్యవస్థగా ఉన్న భార‌తీయ‌ రైల్వే (Indian Railways).. మరో అరుదైన చరిత్ర సృష్టించేందుకు అడుగుదూరంలో ఉంది. ఇప్పటికే త‌న బ్రాడ్‌గేజ్ నెట్‌వ‌ర్క్‌లో 99.6 శాతం విద్యుదీక‌ర‌ణ (Electrified) పనుల‌ను పూర్తిచేసి చారిత్రక మైలురాయిని అందుకుంది. మిగిలిన 0.4 శాతం పనులు పూర్తిచేస్తే 100 శాతం రైల్వే లైన్ల విద్యుదీకరణ పూర్తి అవుతుంది. అయితే, దాదాపు నెట్‌వర్క్ అంతా విద్యుదీకరించినా.. డీజిల్ లోకోమోటివ్‌ల (Diesel Locomotives) అవసరం మాత్రం తగ్గడం లేదు. భవిష్యత్తులో కూడా వీటిని పూర్తిగా తొలగించే అవకాశం లేదని రైల్వే మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. సాంకేతిక ప‌రిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ హైడ్రోజ‌న్ రైలు, వందేభార‌త్ వంటి అత్యాధునిక రైళ్ల‌ను ప్ర‌వేశ‌పెట్టిన భార‌తీయ రైల్వే ఇప్ప‌టికీ డీజిల్ ఇంజిన్ల‌పై ఆధార‌ప‌డుతున్న‌ది. ,

ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగితే రైళ్ల రాకపోకలు నిలిచిపోకుండా ఉండేందుకు డీజిల్ ఇంజిన్లు అత్యంత కీలకం కానున్నాయి. అంతేకాకుండా, దేశ వ్యూహాత్మక అవసరాలు, సరిహద్దు ప్రాంతాలకు సైనిక బలగాలు, సామగ్రిని తరలించడం వంటి సున్నితమైన కార్యకలాపాల్లో డీజిల్ ఇంజిన్లదే ప్రధాన పాత్ర. రైల్వే యార్డులు, సైడింగ్‌లలో బోగీలను జతచేయడం, విడదీయడం (షంటింగ్) వంటి పనులకు కూడా ఇవి తప్పనిసరి. కొత్తగా విద్యుదీకరణ పూర్తికాని మార్గాల్లోనూ వీటినే వినియోగిస్తున్నారు.

త‌గ్గిన డీజిల్ వినియోగం..

గత తొమ్మిది సంవత్సరాలుగా విద్యుదీకరణ పనులు వేగవంతం కావడంతో డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. 2015-16లో 293 కోట్ల లీటర్ల డీజిల్ వినియోగించగా, 2024-25 నాటికి అది 108 కోట్ల లీటర్లకు పడిపోయింది. అంటే ఏకంగా 63 శాతం తగ్గుదల నమోదైంది. ఒకప్పుడు ఏటా 75 కిలోమీటర్ల మేర సాగిన విద్యుదీకరణ పనులు, 2023-24 నాటికి సంవత్సరానికి 7,188 కిలోమీటర్లకు పెరిగాయి. ఈ విషయంలో స్విట్జర్లాండ్ తర్వాత ప్రపంచంలో భారత్ రెండో స్థానంలో నిలిచింది. ప్రస్తుత గణాంకాల ప్రకారం.. భారతీయ రైల్వేకు చెందిన మొత్తం 70,142 రూట్ కిలోమీటర్ల (RKM) బ్రాడ్-గేజ్ నెట్‌వర్క్‌లో ఈ ఏడాది మార్చి నాటికి ఏకంగా 69,873 రూట్ కిలోమీటర్ల విద్యుదీకరణ పూర్తయింది. అంటే దేశంలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లో 99.6 శాతం కంటే ఎక్కువ మార్గం ఎలక్ట్రిక్ లైన్లుగా మారిపోయింది.

ఈ నేపథ్యంలో, కొత్త డీజిల్ లోకోమోటివ్‌ల తయారీ కూడా కొనసాగుతోందని అధికారులు తెలిపారు. భవిష్యత్ అవసరాల కోసం ఎల్‌ఎన్‌జి (లిక్విఫైడ్ నేచురల్ గ్యాస్), బ్యాటరీ, హైడ్రోజన్ వంటి పర్యావరణ అనుకూల ప్రత్యామ్నాయ ఇంధనాలతో నడిచే ఇంజిన్ల అభివృద్ధిపై కూడా భారతీయ రైల్వే దృష్టి సారించింది.

 

స్టీమ్ నుంచి ఎలక్ట్రిక్ వరకు..

భారతదేశానికి జీవనాడి అయిన రైల్వేల ప్రయాణం ఒక అద్భుతమైన పరిణామ క్రమం. ఒకప్పుడు దట్టమైన నల్లటి పొగలు కక్కుతూ పట్టాలపై పరిగెత్తిన ఆవిరి (స్టీమ్) ఇంజిన్ల (Steam Locomotives) కాలం నుంచి, నేడు గంటకు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే సెమీ-హై స్పీడ్ ఎలక్ట్రిక్ రైళ్ల వరకు రైల్వే శాఖ సాధించిన ప్రగతి అసాధారణమైనది. దేశంలో రైల్వేల‌కు వందేండ్ల‌ సుదీర్ఘ చరిత్ర ఉంది. 1925 ఫిబ్రవరి 3న అప్పటి బాంబే విక్టోరియా టెర్మినస్ (ప్రస్తుత ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్) నుంచి కుర్లా హార్బర్ మధ్య మొట్టమొదటి ఎలక్ట్రిక్ రైలు ప్రారంభమైంది. అయితే, ప్రారంభ దశాబ్దాల్లో ఈ ఆధునీకరణ చాలా నెమ్మదిగా సాగింది. 1947లో భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చే నాటికి దేశవ్యాప్తంగా కేవలం 388 రూట్ కిలోమీటర్లు మాత్రమే విద్యుదీకరణకు నోచుకుంది.

డీజిల్ యుగం.. స్టీమ్‌కు గుడ్‌బై

స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా చాలా ఏండ్ల‌ పాటు దేశంలో స్టీమ్ ఇంజిన్ల హవా నడిచింది. అయితే, 1960ల కాలంలో వారణాసిలోని డీజిల్ లోకోమోటివ్ వర్క్స్ (DLW) ఉత్పత్తిని ప్రారంభించడంతో డీజిలీకరణ వేగవంతమైంది. 1980ల నాటికి ఆవిరి ఇంజిన్లను క్ర‌మంగా పక్కనపెట్టిన రైల్వే శాఖ‌.. వాటి స్థానంలో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజన్లను ప్రవేశపెట్టింది. 1995లో జలంధర్ - ఫిరోజ్‌పూర్ మధ్య చివరి అధికారిక బ్రాడ్-గేజ్ స్టీమ్ సర్వీస్ నడవడంతో ఒక సుదీర్ఘమైన ఆవిరి యుగం ముగిసింది. ప్రస్తుతం ఈ స్టీమ్ ఇంజిన్లు కేవలం పర్యాటకులను ఆకర్షించేందుకు కొన్ని ప్రత్యేక వారసత్వ (Heritage Services) రూట్లకు మాత్రమే పరిమితమయ్యాయి.

విద్యుదీకరణలో సరికొత్త విప్లవం

1990ల‌ వ‌ర‌కు భార‌తీయ‌ రైల్వేను డీజిల్ ఇంజిన్లు శాసించాయి. 2000ల సంవత్సరం నుంచి ఎలక్ట్రిక్ ఇంజిన్ల హవా మొదలైంది. ముఖ్యంగా 2014 తర్వాత ఈ విద్యుదీకరణ ప్రక్రియ మునుపెన్నడూ లేనంత వేగాన్ని పుంజుకుంది. గత కొన్నేండ్లుగా రికార్డు స్థాయిలో రైల్వే ట్రాక్‌లను విద్యుదీకరించడం ద్వారా డీజిల్ వినియోగం భారీగా తగ్గింది. 2026 మార్చి 2026 నాటికి భారతీయ రైల్వే తన బ్రాడ్-గేజ్ (BG) నెట్‌వర్క్‌లో రికార్డు స్థాయిలో 99.6 శాతం విద్యుదీకరణను పూర్తి చేసింది. తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్, బీహార్, పంజాబ్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌తో సహా మొత్తం 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని రైల్వే లైన్లను 100 శాతం విద్యుదీక‌ర‌ణ పూర్త‌య్యింది. అయిన‌ప్ప‌టికీ డీజిల్ ఇంజిన్ల వాడ‌కం మాత్రం ఇప్ప‌టికీ కొన‌సాగుతూనే ఉన్న‌ది.

Advertisement
Advertisement