త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India Strategic Oil Reserves | పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ టెన్షన్: కేవలం 9.5 రోజులకే సరిపడా భారత్ చమురు నిల్వలు!

పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న వేళ భారత చమురు నిల్వలపై ఆందోళన వ్యక్తమవుతోంది. విదేశాల నుంచి ముడిచమురు సరఫరా నిలిచిపోతే, మన దగ్గర ఉన్న రిజర్వ్‌లు కేవలం 9.5 రోజులకు మాత్రమే సరిపోతాయని ఆర్టీఐ నివేదిక ద్వారా వెల్లడైంది.

J

National | Published On Mar 24, 2026, 5.54 pm IST

India Strategic Oil Reserves | పశ్చిమాసియా ఉద్రిక్తతల వేళ టెన్షన్: కేవలం 9.5 రోజులకే సరిపడా భారత్ చమురు నిల్వలు!
Advertisement

India Strategic Oil Reserves | త్రినేత్ర.న్యూస్ : పశ్చిమాసియాలో భీకర యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో భారత ఇంధన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రపంచ చమురు సరఫరా మార్గాలకు ముప్పు పొంచి ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో, విదేశాల నుంచి సరఫరా నిలిచిపోతే భారత్‌ను ఆదుకునే వ్యూహాత్మక చమురు నిల్వలు కేవలం 9.5 రోజులకు మాత్రమే సరిపోతాయని తేలింది. కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ నుంచి సమాచార హక్కు (RTI) చట్టం ద్వారా ఈ కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సామర్థ్యం తక్కువే.. వినియోగం ఇంకా తక్కువే

అత్యవసర పరిస్థితులను ఎదుర్కోవడానికి భారత ప్రభుత్వం 2004 జనవరిలో 'వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ (SPR)' కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దీన్ని అమలు చేసేందుకు 'ఇండియన్ స్ట్రాటజిక్ పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ (ISPRL)'ను ఏర్పాటు చేసింది. ప్రస్తుతం దేశంలో ఏపీలోని విశాఖపట్నం (1.33 MMT), కర్ణాటకలోని మంగళూరు (1.5 MMT), కర్ణాటకలోని పడూర్ (2.5 MMT) ప్రాంతాల్లో మొత్తం 5.33 మిలియన్ మెట్రిక్ టన్నుల చమురు నిల్వ సామర్థ్యం ఉంది. కానీ, మార్చి 23, 2026న రాజ్యసభలో ప్రభుత్వం సమర్పించిన డేటా ప్రకారం.. ఈ రిజర్వ్‌లు పూర్తిగా నిండలేదు. ప్రస్తుతం భారత్ వద్ద సుమారు 3.372 MMTల ముడి చమురు మాత్రమే ఉంది. అంటే మొత్తం నిల్వ సామర్థ్యంలో ఇది కేవలం 64 శాతం మాత్రమే. ఈ నిల్వలు దేశ ప్రస్తుత వినియోగం, నిల్వల స్థాయిని బట్టి మారుతుంటాయని ప్రభుత్వం పేర్కొంది.

85 శాతం దిగుమతులపైనే ఆధారం.. పొంచి ఉన్న ముప్పు

భారత్ తన ముడిచమురు అవసరాల్లో 85 శాతానికి పైగా దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో ఎక్కువ భాగం పశ్చిమాసియా నుంచే వస్తోంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన 'హార్ముజ్ జలసంధి' గుండా సరఫరా సాగుతుంది. ప్రస్తుతం ఆ ప్రాంతంలో నెలకొన్న యుద్ధ వాతావరణం సప్లయి చైన్‌పై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇలాంటి భౌగోళిక రాజకీయ పరిణామాల వల్ల గ్లోబల్ ఆయిల్ మార్కెట్ దెబ్బతింటే, భారత్ లాంటి దిగుమతి ఆధారిత దేశాలకు ఆర్థికంగా భారీ ముప్పు తప్పదు.

విస్తరణ ప్రాజెక్టులు ఎప్పటికో?

ప్రస్తుతం ఉన్న ముప్పును పసిగట్టిన ప్రభుత్వం, జూలై 2021లోనే SPR నెట్‌వర్క్ విస్తరణకు ఆమోదం తెలిపింది. పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (PPP) విధానంలో ఒడిశాలోని చండీఖోల్ వద్ద 4 MMTలు, కర్ణాటకలోని పడూర్‌లో అదనంగా 2.5 MMTలు మొత్తం 6.5 MMTల సామర్థ్యంతో కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. కానీ, ఈ ప్రాజెక్టులు ఇంకా కార్యరూపం దాల్చలేదు.

ఒకవైపు గ్లోబల్ మార్కెట్‌లో ముడిచమురు సరఫరాకు అంతరాయం ఏర్పడే ప్రమాదం పొంచి ఉండటం, మరోవైపు ఉన్న నిల్వ కేంద్రాలు పూర్తిగా నిండకపోవడం, కొత్త ప్రాజెక్టులు పట్టాలెక్కకపోవడంతో.. దీర్ఘకాలిక ఇంధన సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి భారత్ సన్నద్ధతపై ఇప్పుడు తీవ్ర సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement