త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భార‌త్ ఏమ‌న్న‌దంటే..?

Russia sanctions bill | మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశించిన ర‌ష్యాపై ఆంక్ష‌ల బిల్లుకు (Russia sanctions bill) అమెరికా కాంగ్రెస్ (US Congress) ఆమోదం తెలిపింది. ఈ బిల్లుపై న్యూఢిల్లీ ధీటుగా స్పందించింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను కాపాడ‌ట‌మే త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

D

National | Published On Sep 17, 2026, 11.38 am IST

Russia sanctions bill | రష్యాపై ఆంక్షల బిల్లుకు అమెరికా కాంగ్రెస్ ఆమోదం.. భార‌త్ ఏమ‌న్న‌దంటే..?
Advertisement

Russia sanctions bill | త్రినేత్ర‌.న్యూస్ : ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విష‌యంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు ఉద్దేశించిన ర‌ష్యాపై ఆంక్ష‌ల బిల్లుకు (Russia sanctions bill) అమెరికా కాంగ్రెస్ (US Congress) ఆమోదం తెలిపింది. రష్యా నుంచి పెద్ద ఎత్తున ఇంధనం కొనుగోలు చేసే భార‌త్ స‌హా ప‌లు దేశాలపై 100 శాతం వరకు సుంకాలు విధించే అవకాశం ఉన్న ఈ బిల్లుపై న్యూఢిల్లీ ధీటుగా స్పందించింది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన భద్రతను కాపాడ‌ట‌మే త‌మ ప్ర‌థ‌మ ప్రాధాన్య‌మ‌ని స్ప‌ష్టం చేసింది.

అమెరికా తీసుకున్న నిర్ణయాన్ని నిశితంగా పరిశీలిస్తున్న‌ట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అదే సమయంలో దేశ వాణిజ్య, ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపింది. విభిన్న మార్గాల ద్వారా ఇంధనాన్ని సేకరిస్తూ, ప్రజల ఇంధన భద్రతకు కట్టుబడి ఉంటామని స్పష్టం చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతుల అంశాన్ని ఇప్పటికే అమెరికా అధికారులతో ఉన్నత స్థాయిలో చర్చించిన‌ట్లు తెలిపింది. ఈ ఆంక్షల బిల్లు వ‌ల్ల‌ ద్వైపాక్షిక సంబంధాలతోపాటూ అంతర్జాతీయ ఇంధన మార్కెట్‌పై ప‌డే ప్ర‌భావాల‌ను అమెరికాకు భారత బృందం స్పష్టంగా వివరించినట్లు పేర్కొంది.

దేశ ఆర్థిక‌, వాణిజ్య ప్ర‌యోజ‌నాల‌ను కాపాడుకోవ‌డానికి అన్ని చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపింది. ప‌రిశ్ర‌మ వ‌ర్గాల‌తో క‌లిసి ఈ ప‌రిణామాల‌ను ఎదుర్కొంటామ‌ని తేల్చి చెప్పింది. ఇదిలా ఉండ‌గా.. ప్రస్తుతం రష్యా నుంచి సముద్ర మార్గంలో చమురు కొనుగోలు చేస్తున్న దేశాల్లో భారత్ అగ్రస్థానంలో ఉంది. అయితే ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు భారతీయ రిఫైనరీలు ఇప్పటికే అమెరికా, బ్రెజిల్, కెనడా, వెనెజువెలా, ఆఫ్రికా దేశాల వైపు దృష్టి సారించి ప్రత్యామ్నాయ సరఫరాలను అన్వేషిస్తున్నాయి.

రష్యా ఆంక్షల బిల్లు..

ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని ఆపే విష‌యంలో మాస్కోపై ఒత్తిడి తెచ్చేందుకు తీసుకొచ్చిన ఆంక్ష‌ల బిల్లుకు అమెరికా సెనేట్ (US Senators) కీలక స‌వ‌ర‌ణలు చేసిన విష‌యం తెలిసిందే. రష్యా నుంచి చమురు, గ్యాస్ కొనుగోలు చేస్తున్న దేశాలపై మొదట ప్రతిపాదించిన గరిష్ట 500 శాతం దిగుమతి సుంకాన్ని 100 శాతానికి తగ్గించింది. అమెరికా జాతీయ భద్రత, ప్రయోజనాల దృష్ట్యా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) తలుచుకుంటే ఏ దేశానికైనా ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చే అధికారాన్ని బిల్లులో చేర్చారు. ఈ సవరించిన బిల్లు రష్యా ముడి చమురును అత్యధికంగా కొనుగోలు చేసే చైనా, భారత్, స్లోవేకియా, హంగేరి, అజర్‌బైజాన్ దేశాల‌ను లక్ష్యంగా చేసుకుంది.

కొన్ని దేశాలకు ప్రత్యేక మినహాయింపులు

అంతేకాదు ఈ బిల్లులో కొన్ని దేశాలకు ప్రత్యేక మినహాయింపులు కూడా ప్రతిపాదించారు. రష్యా నుంచి దిగుమతి చేసుకునే సహజ వాయువు మొత్తం రష్యా ఎగుమతుల్లో 15 శాతం కంటే తక్కువగా ఉండటం, అలాగే ఆ దిగుమతులను తగ్గించేందుకు సంబంధిత దేశాలు స్పష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు నిరూపించగలిగితే టారిఫ్‌ల నుంచి మినహాయింపు పొందే అవకాశం ఉంటుంది. రష్యా సహజ వాయువును దిగుమతి చేసుకునే అతిపెద్ద దేశాలలో చైనా, ఫ్రాన్స్, జపాన్, హంగరీ, బెల్జియం ఉన్నాయి. ఈ బిల్లును అమెరికా సెనెట్ 86-11 తేడాతో ఇప్ప‌టికే ఆమోదించిన విష‌యం తెలిసిందే. ప్ర‌స్తుతం అది ప్ర‌తినిధుల స‌భ ముందుకు వెళ్లింది. అక్క‌డ కూడ బిల్లుకు గ్రీన్ సిగ్న‌ల్ ప‌డింది. 262-159 ఓట్ల తేడాతో బిల్లు పాస్ అయింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంత‌కంతో ఇది చ‌ట్టంగా మార‌నుంది. ఆ త‌ర్వాత 30 రోజుల్లోగా సంబంధిత దేశాలపై టారిఫ్‌ల బాదుడు మొద‌ల‌వుతుంది.

ఈ బిల్లు రూపకల్పనలో కీలక పాత్ర పోషించిన రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం ఇటీవ‌లే మృతి చెందిన విష‌యం తెలిసిందే. దీంతో ఈ బిల్లుకు ఆయ‌న‌పేరును ప్ర‌తిపాదించారు. మ‌రోవైపు ర‌ష్యా చ‌మురు కొనుగోళ్ల విష‌యంలో భారత్ తన స్థిరమైన వైఖరిని కొనసాగిస్తోంది. 140 కోట్ల మంది భారతీయుల ఇంధన అవసరాలను తీర్చడం తమ ప్రాధమిక లక్ష్యం అని భారత ప్రభుత్వం ఇప్ప‌టికే స్పష్టం చేసింది. ఎక్క‌డ త‌క్కువ‌కు దొరికితే అక్కడే ఇంధ‌నం కొనుగోలు చేస్తామని అమెరికాకు తెలియజేసింది.

100 శాతం టారిఫ్ అంటే..

సవరణలోని సెక్షన్ 113 ప్రకారం, చట్టం అమల్లోకి వచ్చిన 30 రోజుల్లోగా సంబంధిత దేశాల నుంచి అమెరికాలోకి వచ్చే వస్తువులపై గరిష్ఠంగా 100 శాతం వరకు అదనపు సుంకం విధించే అధికారం అమెరికా అధ్యక్షుడికి ఉంటుంది. ఈ సుంకం ఇప్పటికే ఉన్న ఇతర డ్యూటీలు, పన్నులు, ఫీజులకు అదనంగా ఉంటుందని సవరణలో స్పష్టం చేశారు. అయితే ఇది వెంటనే భారత్‌పై 100 శాతం టారిఫ్ పడుతుందని అర్థం కాదు. టారిఫ్ రేటును 0 నుంచి 100 శాతం మధ్య నిర్ణయించే అవకాశం ఉంటుంది. రష్యా నుంచి చమురు కొనుగోళ్లను తగ్గిస్తున్న దేశాలకు సుంకాన్ని తగ్గించే అవకాశం కూడా ఉంది.

Also Read..

అసెంబ్లీలో జాతీయ జెండా ఎగుర‌వేసిన స్పీక‌ర్

క‌మ‌ల్‌హాస‌న్ క్లాప్‌తో ఎంఎస్ సుబ్బుల‌క్ష్మి బ‌యోపిక్ ప్రారంభం - త‌మిళంలో ర‌ష్మిక స్పీచ్ హైలైట్‌

ధిక్కార స్వ‌రం వినిపించిన నేల తెలంగాణ‌

Advertisement
Advertisement