త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!

Kajal Aggarwal | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు.

P

Entertainment | Published On Nov 4, 2026, 8.45 pm IST

Kajal Aggarwal | మండోదరిగా చందమామ.. ప్రమోషన్స్‌లో కనిపించడం లేదు ఎందుకో..!
Advertisement

Kajal Aggarwal | భారతీయ ఇతిహాసం రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దర్శకుడు నితీశ్‌ తివారీ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఇందులో రణ్‌బీర్‌ కపూర్‌ శ్రీరాముడిగా, సాయిపల్లవి సీతగా, యశ్‌ రావణుడిగా నటిస్తున్నారు. సన్నీడియోల్‌ హనుమంతుడిగా, రవీ దూబే లక్ష్మణుడిగా కనిపించనున్నారు. ఇక రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శూర్పణఖ పాత్ర పోషిస్తుండగా.. టాలీవుడ్‌ చందమామ కాజల్‌ అగర్వాల్‌ రావణుడి భార్య మందోదరిగా నటిస్తోంది. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక ప్రమాణాలు, భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు మేకర్స్‌ పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రధాన పాత్రలకు సంబంధించి ప్రత్యేక పోస్టర్లు, వీడియోలు, గ్లింప్స్‌ విడుదల చేస్తూ వస్తున్నారు. అయితే, ఈ ప్రచారంలో కాజల్‌ అగర్వాల్‌ పాత్రకు మాత్రం మిగతా వారితో పోలిస్తే ప్రాధాన్యత లభించడం లేదనే చర్చ మొదలైంది. రాముడిగా రణ్‌బీర్‌, రావణుడిగా యశ్‌, సీతగా సాయిపల్లవి పాత్రలకు ప్రత్యేకంగా ప్రచారం కల్పిస్తుండగా.. శూర్పణఖగా నటిస్తున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కూడా ప్రమోషనల్‌ కార్యక్రమాల్లో కనిపిస్తోంది. కానీ, మందోదరిగా నటిస్తున్న కాజల్‌ విషయంలో మాత్రం అంతటి హడావుడి కనిపించడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

మండోదరి పాత్ర కీలకమే..

రావణుడి భార్యగా మందోదరి రామాయణంలో కీలకమైన పాత్ర. రావణుడి తప్పులను ఎత్తిచూపుతూ, సీతను తిరిగి రాముడికి అప్పగించాలని సూచించే వివేకవంతురాలిగా ఆమెకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అలాంటి పాత్రలో కాజల్‌ నటిస్తుండటంతో మొదట్లో అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. అయితే ఇతర పాత్రలకు లభిస్తున్న ప్రచారంతో పోలిస్తే మందోదరి పాత్రకు సంబంధించిన వివరాలు, ప్రత్యేక వీడియోలు పెద్దగా కనిపించకపోవడం చర్చకు దారితీసింది. మేకర్స్‌ రణ్‌బీర్‌, యశ్‌ పాత్రలను ప్రధానంగా ప్రమోట్‌ చేస్తున్నారు. సాయిపల్లవి పాత్రకు సైతం ప్రత్యేక గుర్తింపు ఇస్తున్నారు. మరోవైపు రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ శూర్పణఖ పాత్రతో ప్రచార కార్యక్రమాల్లో భాగమవుతోంది. ఇలాంటి సమయంలో కాజల్‌ పాత్రకు ఎందుకు అంతగా ప్రచారం కల్పించడం లేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. మందోదరి పాత్రను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచుతున్నారా? లేక తొలి భాగంలో ఆమె పాత్ర పరిధి తక్కువగా ఉండటమే దీనికి కారణమా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

పార్ట్‌-1లో తక్కువ సన్నివేశాలే ఉన్నాయన్న కాజల్‌

అయితే, ఈ అంశంపై కాజల్‌ అగర్వాల్‌ గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ‘రామాయణ’ మొదటి భాగంలో యశ్‌తో తనకు చాలా తక్కువ సన్నివేశాలు ఉన్నాయని తెలిపింది. తొలి భాగం ప్రధానంగా అయోధ్య, శ్రీరాముడి కథ చుట్టూ సాగుతుందని.. మందోదరి పాత్రకు అసలు ప్రాధాన్యత రెండో భాగంలో ఉంటుందని వివరించారు. ఇంకా పార్ట్‌-2 షూటింగ్‌ కూడా ప్రారంభం కాలేదని ఆమె పేర్కొన్నారు. కాజల్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రచారంలో ఆమె పాత్రకు తక్కువ ప్రాధాన్యత కనిపించడానికి ఒక కారణాన్ని తెలియజేస్తున్నాయి. అంటే తొలి భాగంలో మందోదరి పాత్రకు పరిమిత స్క్రీన్‌ స్పేస్‌ ఉండటంతోనే ప్రమోషన్లలోనూ ఆమెకు పెద్దగా చోటు దక్కకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే, దీనిపై చిత్ర బృందం అధికారికంగా ప్రత్యేక వివరణ ఇవ్వాల్సి ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.

రెండో భాగంలో కాజల్‌ పాత్ర కీలకమేనా?

రామాయణ కథలో రావణుడి పతనం, లంకలో చోటుచేసుకునే పరిణామాలు, సీతాపహరణం తర్వాతి పరిస్థితుల్లో మందోదరి పాత్రకు ప్రాధాన్యత ఉంటుంది. రావణుడికి ధర్మ మార్గాన్ని సూచిస్తూ, అతడి నిర్ణయాలను వ్యతిరేకించే పాత్రగా ఆమె కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రెండో భాగంలో కాజల్‌కు మరింత బలమైన పాత్ర లభించే అవకాశం ఉంది. అందుకే తొలి భాగంలో ఆమె పాత్రను పరిమితంగా చూపించి, రెండో భాగంలో ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేలా కథను రూపొందించారా? అన్న ఆసక్తి నెలకొంది. ఏదేమైనా.. ఇంతటి భారీ ప్రాజెక్టులో కాజల్‌ వంటి సీనియర్‌ హీరోయిన్‌ మందోదరి పాత్ర పోషిస్తుండటం విశేషమే. తొలి భాగంలో ఆమె పాత్ర ఎంతసేపు కనిపిస్తుంది? రెండో భాగంలో మందోదరి పాత్ర కథను ఏ మలుపు తిప్పుతుంది? కాజల్‌ తన నటనతో ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుంది? అన్నది ఆసక్తికరంగా మారింది.

Advertisement
Advertisement