త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

LPG Crisis | దేశంలో గ్యాస్ స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ప్రాధాన్యంగా కొన‌సాగుతున్నామ‌ని వెల్ల‌డి..!

LPG Crisis | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. మంత్రిత్వశాఖల సమావేశంలో జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో అధికారులు గ్యాస్ సరఫరా అంశాలపై స్పష్టత ఇచ్చారు.

P

National | Published On Mar 25, 2026, 5.54 pm IST

LPG Crisis | దేశంలో గ్యాస్ స‌ర‌ఫ‌రాపై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌.. ప్రాధాన్యంగా కొన‌సాగుతున్నామ‌ని వెల్ల‌డి..!
Advertisement

LPG Crisis | పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల సరఫరా పరిస్థితిపై కేంద్ర ప్రభుత్వం కీలక సమాచారం వెల్లడించింది. మంత్రిత్వశాఖల సమావేశంలో జరిగిన మీడియా బ్రీఫింగ్‌లో అధికారులు గ్యాస్ సరఫరా అంశాలపై స్పష్టత ఇచ్చారు. దేశంలో పైప్డ్ నేచురల్ గ్యాస్ (PNG), సీఎన్‌జీ (CNG) సరఫరాను ప్రాధాన్యంగా కొనసాగిస్తున్నామని తెలిపారు. ఈ సందర్భంగా సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ గృహ వినియోగదారులకు 100 శాతం పీఎన్‌జీ సరఫరా జరుగుతోందని చెప్పారు. అలాగే, రవాణా రంగంలో వినియోగించే సీఎన్‌జీ డిమాండ్‌ను కూడా పూర్తిగా తీర్చుతున్నామని వివరించారు. దేశంలో ఎక్కడా సీఎన్‌జీ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పీఎన్‌జీ నెట్‌వర్క్ విస్తరణపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందని, ఈ దిశగా పలు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.

వినియోగదారులను ఆకర్షించేందుకు గ్యాస్ కంపెనీలు పలు ప్రోత్సాహక పథకాలను ప్రారంభించాయని చెప్పారు. ఇందులో భాగంగా రూ.500 వరకు ఉచిత గ్యాస్, సెక్యూరిటీ డిపాజిట్ మాఫీ వంటి ఆఫర్లు అందిస్తున్నట్లు తెలిపారు. సరఫరాను మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం కీలక సూచనలు చేసింది. వాణిజ్య ఎల్‌పీజీ సరఫరాను అదనంగా 10 శాతం పెంచాలని రాష్ట్రాలను కోరింది. ఈ చర్యల ద్వారా స్వచ్ఛ ఇంధన వినియోగం పెరిగి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందుతాయని ప్రభుత్వం భావిస్తోంది. సుజాత శర్మ తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ఈ నెల 21న కేంద్ర ప్రభుత్వం వాణిజ్య ఎల్‌పీజీ కోటాను 20 శాతం నుంచి 50 శాతానికి పెంచింది. ముఖ్యంగా ధాబాలు, హోటళ్లు, కాంటీన్లు, కమ్యూనిటీ కిచెన్లు, ప్రభుత్వ సబ్సిడీ కాంటీన్లకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్రాలకు సూచించింది. వలస కార్మికుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని 5 కిలోల సిలిండర్ల పంపిణీకి ప్రాధాన్యం ఇవ్వాలని కోరింది.

ఈ చర్యల ఫలితంగా ఇప్పటివరకు 26 రాష్ట్రాలకు సుమారు 22వేల టన్నుల వాణిజ్య ఎల్‌పీజీ కేటాయించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఈ కేటాయింపులను రాష్ట్ర ప్రభుత్వాలు, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కలిసి దేశవ్యాప్తంగా అమలు చేస్తున్నాయి. అలాగే, ఈ సమన్వయ చర్యల కారణంగా నిన్న ఒక్కరోజే దాదాపు 30వేల ఐదు కిలోల సిలిండర్లు పంపిణీ చేసినట్లు కేంద్రం తెలిపింది. అవసరమైన వారికి గ్యాస్ అందుబాటులో ఉండేలా చేయడంతో పాటు సరఫరా వ్యవస్థలో ఎలాంటి అంతరాయం లేకుండా చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుత అంతర్జాతీయ పరిస్థితుల మధ్య కూడా దేశంలో గ్యాస్ సరఫరా సజావుగా కొనసాగుతోందని, వినియోగదారుల అవసరాలను తీర్చేందుకు కేంద్రం, రాష్ట్రాలు సమన్వయంతో పని చేస్తున్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

Advertisement

తాజావార్తలు

Advertisement