త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే

రాహుల్ ప్రతినిధిగా గోవా సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీపై నిప్పులు చెరిగారు. సీఎం ప్రమోద్ కాదు 'ప్రాపర్టీ సావంత్' అంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

J

National | Published On Oct 11, 2026, 8.45 pm IST

Revanth Reddy Goa Speech | 2026లో కేరళ.. 2027లో గోవా.. నైరుతి రుతుపవనాల్లా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చుడే

సంక్షిప్త సారాంశం

రాహుల్ గాంధీ ప్రతినిధిగా గోవా బహిరంగ సభలో పాల్గొన్న తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, బీజేపీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గోవా సీఎం ప్రమోద్ సావంత్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా భూములను అప్పగిస్తూ 'ప్రాపర్టీ సావంత్'గా మారారని, రాష్ట్రాన్ని డ్రగ్స్ హబ్‌గా మార్చారని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ వేదికగా పేదలు, దళితులు, మైనారిటీల ఓట్లను తొలగించేందుకు బీజేపీ కుట్ర పన్నుతోందని విమర్శించారు. నైరుతి రుతుపవనాల తరహాలోనే 2026లో కేరళలో వచ్చిన కాంగ్రెస్, 2027లో గోవాలోనూ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
  • ఆయన ప్రమోద్ కాదు.. 'ప్రాపర్టీ సావంత్'
  • గోవా వేదికగా బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు
  • 2027లో కాంగ్రెస్ ఖాయం

Revanth Reddy Goa Speech | త్రినేత్ర న్యూస్ : గోవా రాజకీయ వేదికపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం గోవాలో నిర్వహించిన కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతినిధిగా రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఢిల్లీలో జరుగుతున్న నిరసనల కారణంగా రాహుల్ గాంధీ హాజరుకాలేకపోవడంతో, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఆదేశాల మేరకు తాను ఇక్కడికి వచ్చినట్లు రేవంత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా గోవా సీఎం ప్రమోద్ సావంత్ పాలనపై, కేంద్రంలోని బీజేపీ సర్కారుపై ఆయన తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ప్రమోద్ కాదు.. 'ప్రాపర్టీ సావంత్'

గోవా ముఖ్యమంత్రి తీరుపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. "ఇక్కడి ప్రజలు ఆయన్ను ప్రమోద్ సావంత్ అనడం లేదు.. 'ప్రాపర్టీ సావంత్' అని పిలుస్తున్నారు. రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మానేసి, ఇక్కడి విలువైన భూములు, ఆస్తులను ఇతరులకు కట్టబెట్టే పనిలో పడ్డారు" అని ఎద్దేవా చేశారు. వరుసగా మూడోసారి బీజేపీకి అధికారం ఇస్తే గోవా ప్రజలు తమ సొంత గడ్డపైనే పరాయివారిగా మిగిలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

డ్రగ్స్ అడ్డాగా గోవా.. 'నషా ముక్త్ భారత్' ఎక్కడ?

బీజేపీ పాలనలో అందమైన గోవా పర్యాటక ప్రాంతం కాస్తా డ్రగ్ పెడ్లర్స్‌కు అడ్డాగా మారిపోయిందని రేవంత్ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్నారని మండిపడ్డారు. "దేశవ్యాప్తంగా 'నషా ముక్త్ భారత్' అని నినదించే ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా.. గోవాలో ఆ నినాదాన్ని ఎందుకు అమలు చేయడం లేదు?" అని నిలదీశారు. ల్యాండ్ మాఫియా, డ్రగ్ లార్డ్స్ చేతుల్లోకి వెళ్లిన రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉందన్నారు.

ఓట్ల తొలగింపు కుట్ర.. రాముడు-రావణుడి మధ్య పోరాటం

ఎన్నికలు రాగానే దర్యాప్తు సంస్థలను ముందుపెట్టి రాజకీయం చేసే బీజేపీకి ఇప్పుడు వాటితోనూ ప్రయోజనం లేకుండా పోయిందని రేవంత్ అన్నారు. అందుకే ఇప్పుడు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ పేరుతో పేదలు, దళితులు, మైనారిటీలు, ఆదివాసీల ఓట్లను తొలగించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ప్రస్తుత పోరాటం రావణుడికి (బీజేపీ), రాముడికి (కాంగ్రెస్) మధ్య జరుగుతున్న ధర్మయుద్ధం లాంటిదని, ప్రజలంతా రాముడి వైపు నిలబడాలని పిలుపునిచ్చారు.

Also Read | మైసూర్ దసరా 2026: వైభవంగా ‘నాడ హబ్బ’ ప్రారంభం.. 750 కిలోల బంగారు అంబారీ, రాజసం ఉట్టిపడే విశేషాలివే!

2027లో గోవాలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖాయం

దేశంలో నైరుతి రుతుపవనాలు (మాన్‌సూన్) మొదట కేరళలోకి ప్రవేశించి, ఆ తర్వాత గోవాను తాకుతాయని రేవంత్ గుర్తుచేశారు. అదే రాజకీయ సూత్రాన్ని ప్రస్తావిస్తూ.. "2026 మాన్‌సూన్‌లో కేరళలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా అలాగే 2027 మాన్‌సూన్‌లో గోవాలోనూ కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతోంది" అని ధీమా వ్యక్తం చేశారు. గోవాలో కాంగ్రెస్ విజయంతో మొదలై నేరుగా ఢిల్లీ ఎర్రకోటపై మువ్వన్నెల జెండా ఎగురవేస్తామని స్పష్టం చేశారు.

Advertisement
Advertisement