త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ex-CJI Gavai | న్యాయ‌మూర్తుల నియామ‌కాల్లో ఒకే వర్గానికి కొలీజియం పెద్దపీట : మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్

Ex-CJI Gavai | న్యాయ‌మూర్తుల నియామ‌కాల్లో సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే కొలీజియం (collegium) పెద్దపీట వేస్తోంద‌ని మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Ex-CJI Gavai) ఆరోపించారు. OBC, SC, ST, మైనారిటీలు, మ‌హిళ‌ల‌ను విస్మ‌రిస్తూ ఈ నియామ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల‌ని కోరుతూ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ము (President Droupadi Murmu)కు లేఖ రాశారు.

D

National | Published On Nov 27, 2026, 5.29 pm IST

Ex-CJI Gavai | న్యాయ‌మూర్తుల నియామ‌కాల్లో ఒకే వర్గానికి కొలీజియం పెద్దపీట : మాజీ సీజేఐ జస్టిస్ గవాయ్
Advertisement

Ex-CJI Gavai | త్రినేత్ర న్యూస్ : సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సులపై మాజీ సీజేఐ జస్టిస్ బి.ఆర్. గవాయ్ (Ex-CJI Gavai) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. న్యాయ‌మూర్తుల నియామ‌కాల్లో సమాజంలోని ఒక నిర్దిష్ట వర్గానికి మాత్రమే కొలీజియం (Supreme Court collegium) పెద్దపీట వేస్తోంద‌ని ఆరోపించారు. కొలీజియం సిఫార్సుల్లో ప్రతిభ, వైవిధ్యానికి తగిన ప్రాధాన్యత ద‌క్క‌డం లేద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. OBC, SC, ST, మైనారిటీలు, మ‌హిళ‌ల‌ను విస్మ‌రిస్తూ ఈ నియామ‌కాలు జ‌రుగుతున్నాయ‌ని ఆరోపించారు. ఈ మేర‌కు న్యాయమూర్తుల నియామకాలు, బదిలీల వ్యవహారంలో జోక్యం చేసుకోవాల‌ని కోరుతూ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముకు లేఖ రాశారు.

2025 నవంబర్‌లో పదవీ విరమణ చేయడానికి ముందు దాదాపు ఆరు నెలల పాటు సుప్రీంకోర్టు కొలీజియంకు నేతృత్వం వహించిన జ‌స్టిస్ గ‌వాయ్‌.. ఇటీవలే సిఫార్సులు ప్రతిభ, వైవిధ్యం, సమ్మిళితత్వాన్ని విస్మరించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. త‌న లేఖ‌లో ఆ సామాజిక వ‌ర్గం పేరును నేరుగా ప్ర‌స్తావించ‌న‌ప్ప‌టికీ.. దేశ జ‌నాభాలో 5 శాతం కంటే త‌క్కువ‌గా ఉన్న ఒక వ‌ర్గానికి సుప్రీంకోర్టులో 40 శాతానికి పైగా ప్రాతినిధ్యం ద‌క్కింద‌ని పేర్కొన్నారు. గత కొంతకాలంగా ఈ ధోరణి మరింత పెరిగిందని, దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీలు, మహిళలతో పాటు ఇతర అగ్రవర్ణాల అభ్యర్థులు కూడా అవకాశాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

గతంలో శిక్షాత్మక కారణాలతో బదిలీ అయిన ఒక న్యాయమూర్తిని కేవ‌లం ఒక ప్ర‌త్యేక వ‌ర్గానికి చెందిన‌వార‌నే కార‌ణంతో ఒక పెద్ద హైకోర్టుకు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి ప‌ద‌విని క‌ట్ట‌బెట్టార‌ని విమ‌ర్శించారు. ఆయ‌న స్థానం కోసం అక్క‌డ స‌మ‌ర్థ‌వంతంగా ప‌నిచేస్తున్న ప్రతిభావంతుడైన ఓ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని చిన్న హైకోర్టుకు బదిలీ చేశార‌ని వివ‌రించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 124(2) ప్రకారం సుప్రీంకోర్టు న్యాయమూర్తుల నియామక అధికారం రాష్ట్రపతికి ఉందని, కొలీజియం సిఫార్సులు కీలకమైనంత మాత్రాన అది జవాబుదారీతనం లేని వ్యవస్థ కాదని ఆయన స్పష్టం చేశారు. న్యాయవ్యవస్థలో సమాన ప్రాతినిధ్యం ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్రపతిని కోరుతూ మూడు పేజీల లేఖ రాశారు. ఈ లేఖ ప్రతులను ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్‌లకు కూడా పంపారు.

గ‌ణాంకాల ప్ర‌స్తావ‌న‌..

న్యాయమూర్తుల నియామకాల్లో ఉన్న అసమానతల తీవ్రతను వివరించడానికి జస్టిస్ గవాయ్ పార్లమెంటరీ గణాంకాలను త‌న లేఖ‌లో ఉదహరించారు. 2025 మార్చిలో రాజ్యసభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి ఇచ్చిన సమాధానం ప్రకారం.. 2018 నుంచి నియమితులైన 715 మంది హైకోర్టు న్యాయమూర్తుల్లో కేవలం 22 మంది ఎస్సీలు, 16 మంది ఎస్టీలు, 89 మంది ఓబీసీలు, 37 మంది మైనారిటీ వర్గాలకు చెందిన వారు ఉన్నారని.. దాదాపు మూడు వంతుల మంది జనరల్ కేటగిరీ నుంచే వచ్చారని ఆయన గుర్తు చేశారు.

అలాగే జనవరి 2021 నుంచి జనవరి 2026 మధ్య జరిగిన నియామకాల గ‌ణాంకాల‌ను ప్ర‌స్తావించారు. ఇందులో అగ్రవర్ణాల వాటా దాదాపు 80 శాతం ఉంద‌ని చెప్పారు. జ‌నాభాలో గ‌ణ‌నీయ‌మైన వాటా ఉన్న ఓబీసీల‌కు 14 శాతం కంటే త‌క్కువ ప్రాతినిధ్యం మాత్ర‌మే ల‌భించింద‌ని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జడ్జీల నియామకాలకు సంబంధించి కులాల వారీగా అధికారిక డేటాను నిర్వహించడం లేదని, ఈ సమాచార లేమి కూడా వ్యవస్థాగత సమస్యలో ఒక భాగమని ఆయన లేఖలో స్పష్టం చేశారు. భారత ప్రజాస్వామ్యంలోని అత్యంత ముఖ్యమైన స్తంభాల్లో ఒకటైన న్యాయవ్యవస్థలో సమాన ప్రాతినిధ్యం ఉండాల‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read..

రూ. 5 లక్షల సోఫా, రూ. 11 లక్షల షాండ్లియర్.. సంద‌ర్శ‌న కోసం తెరుచుకున్న కేజ్రీవాల్ శీష్ మ‌హ‌ల్‌

ఇండి కూటమి భేటీకి సుప్రియా సూలే దూరం

డీలిమిటేషన్ జరిగినా కాంగ్రెస్‌కు 20 సీట్లు గ్యారెంటీ

Advertisement
Advertisement