మనకు మనవాళ్లే శత్రువులు అన్నట్టుగా భారతదేశంలో పుట్టి భారతదేశంలో పెరిగి, ఇక్కడే ప్రతిష్ఠాత్మకమైన సంస్థలో పని చేసి చివరకు మన శత్రు దేశమైన పాకిస్థాన్‌తో చేతులు కలిపాడు ఓ ప్రబుద్ధుడు. రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి అయిన కులేంద్ర శర్మ పాకిస్థాన్ గూఢచారి సంస్థతో సంబందాలు కలిగి ఉన్నాడన్న ఆరోపణలతో పోలీసులు వెంటనే అదుపులోకి తీసుకున్నారు. అస్సాం రాష్ట్రంలోని తేజ్‌పూర్ దగ్గర ఉన్న సోనిత్‌పూర్‌కు చెందిన కులేంద్ర శర్మ తేజ్‌పూర్ ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌లో జూనియర్ వారెంట్ ఆఫీసర్‌గా పనిచేసి 2002లో రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత తేజ్‌పూర్ యూనివర్సిటీలో ఎలక్ట్రానిక్స్ డిపార్ట్‌మెంట్‌లో కొన్నాళ్లు పని చేసి అక్కడ కూడా రిటైర్ అయ్యాడు. ఆ తర్వాత పాకిస్థాన్ ఏజెంట్లతో టచ్‌లోకి వెళ్లి దేశ భద్రతకు సంబంధించిన కీలక సమాచారాన్ని, కీలక పత్రాలను వాళ్లకు చేరవేస్తున్నాడు. పాకిస్థాన్‌తో గూఢచారి సంస్థతో కులేంద్ర శర్మ చేతులు కలిపినట్లుగా నిఘా వర్గాల పక్కా సమాచారంతో శుక్రవారం రాత్రి కులేంద్ర శర్మ ఇంటిపై దాడి చేసి అతడిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు కులేంద్ర శర్మను అదుపులోకి తీసుకున్న తర్వాత పోలీసులు అతడి ఇంట్లో సోదాలు నిర్వహించి నిందితుడి నుంచి ఒక లాప్‌టాప్, మొబైల్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దేశ భద్రతకు ముప్పు కలిగించే కీలక వివరాలు ఉన్నాయని పోలీసులు నిర్ధారించారు. అందుకే.. వాటిని ఫోరెన్సిక్ పరీక్షల కోసం పంపించారు. కులేంద్ర శర్మపై బీఎన్ఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.