త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్

Rajnath Singh | అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు యుద్ధ‌ నిర్వచనాన్నే మార్చేశాయని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, రాడార్లకు కూడా చిక్కకుండా దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. సైన్యంలో కొత్త‌గా చేరే అధికారులు ఆధునిక యుద్ధ‌తంత్రాన్ని, వ్యూహాల‌ను అర్థం చేసుకోవాల‌ని సూచించారు.

D

National | Published On Jun 13, 2026, 3.14 pm IST

Rajnath Singh | యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది.. ఎలాంటి ప‌రిస్థితుల‌ను ఎదుర్కొనేందుకైనా సిద్ధంగా ఉండాలి : రాజ్‌నాథ్ సింగ్
Advertisement

Rajnath Singh | దేశ ర‌క్ష‌ణ కోసం ఎలాంటి ప‌రిస్థితుల‌నైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాల‌ని ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ (Rajnath Singh) అధికారుల‌కు పిలుపునిచ్చారు. భారత గగనతల రక్షణ వ్యవస్థలో ఎయిర్‌ఫోర్స్ పాత్ర చాలా కీలకమని చెప్పుకొచ్చారు. ఆపరేషన్ సిందూర్‌లో కూడా ఎయిర్ వారియర్స్ కీలక పాత్ర పోషించారని గుర్తు చేశారు.

హైద‌రాబాద్‌లోని దుండిగ‌ల్ ఎయిర్‌ఫోర్స్ అకాడ‌మీలో (Dundigal Air Force Academy) జ‌రిగిన‌ కంబైన్డ్ గ్రాడ్యుయేష‌న్ పాసింగ్ అవుట్‌ ప‌రేడ్‌కు (Combined Graduation Parade) రివ్యూయింగ్ ఆఫీస‌ర్‌గా ర‌క్ష‌ణ మంత్రి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా పరేడ్‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు. భారత వైమానిక దళంలో చేరబోతున్న యువ అధికారులకు అభినందనలు తెలిపారు. దేశ రక్షణలో వారి పాత్ర ఎంతో కీలకమని పేర్కొన్నారు. అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు యుద్ధ‌ నిర్వచనాన్నే మార్చేశాయని పేర్కొన్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, అత్యాధునిక ఆయుధాలు, రాడార్లకు కూడా చిక్కకుండా దాడులు చేసే సాంకేతికత అందుబాటులోకి వచ్చిందన్నారు. సైన్యంలో కొత్త‌గా చేరే అధికారులు ఆధునిక యుద్ధ‌తంత్రాన్ని, వ్యూహాల‌ను అర్థం చేసుకోవాల‌ని సూచించారు.

టెక్నాల‌జీ ప్ర‌పంచంలో.. అనునిత్యం అప్రమతంగా ఉండాలి

ఇటీవల నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ సందర్భంగా భారత వైమానిక దళం ప్రదర్శించిన ధైర్యసాహసాలు, తెగువను ఆదర్శంగా తీసుకోవాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. "యుద్ధంలో సాంకేతిక వినియోగం చాలా పెరిగింది. గ‌తంలో శ‌క్తిమంత‌మైన దేశాల‌దే పైచేయిగా ఉండేది. ఇప్పుడు ప‌రిస్థితి మారిపోయింది. చిన్న చిన్న దేశాలు కూడా త‌మ స‌త్తా చాటుతున్నాయి. సాంకేతిక‌త‌ను అందిపుచ్చుకోవ‌డం, ప్రమాదకరమైన ఆయుధాలు, కొత్త వ్యూహాలతో భారీ నష్టాన్ని కలిగిస్తున్నాయి. అందుకే టెక్నాలజీ ప్రపంచంలో అనునిత్యం అప్రమతంగా ఉండటం చాలా ముఖ్యం. దేశ ర‌క్ష‌ణ కోసం ఎలాంటి యుద్ధ పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు మానసికంగా సిద్ధంగా ఉండాలి. నిమిషాల్లో.. కాదు, కాదు సెక‌న్ల‌లో దేశ రక్షణ కోసం తగిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవవసరం ఉంటుంది" అని రాజ్‌నాథ్ తెలిపారు.

"నారీ శక్తి"కి అభినంద‌న‌లు..

ఈ సందర్భంగా భారత వైమానిక దళంలో కమిషన్ పొందబోతున్న మహిళా క్యాడెట్లను రాజ్‌నాథ్ సింగ్ ప్రత్యేకంగా అభినందించారు. మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, ఎయిర్‌ఫోర్స్‌లో వారి ప్రవేశం "నారీ శక్తి"కి నిదర్శనమని కొనియాడారు. దేశ రక్షణలో మహిళల భాగస్వామ్యం మరింత బలపడుతోందని ఆయన అన్నారు. వారి రాక‌తో ఐఏఎఫ్ మ‌రింత శ‌క్తివంతంగా, స‌మ‌తుల్యంగా, బ‌లంగా మారుతోంద‌న్నారు.

విదేశీయుల‌కూ శిక్ష‌ణ దేశానికే గ‌ర్వ‌కార‌ణం..

ఇక‌ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న ట్రైనీలకు 'ప్రెసిడెంట్స్ కమిషన్'ను ప్రదానం చేశారు. శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్న ఎయిర్‌ఫోర్స్‌, నేవీ, కోస్ట్ గార్డ్స్‌తోపాటూ వియ‌త్నాంకు చెందిన‌ ట్రైనీలకు 'వింగ్స్', 'బ్రెవెట్స్' బహూకరించారు. ఈ కార్య‌క్ర‌మంలో విదేశీ క్యాడెట్ల‌ను రాజ్‌నాథ్ అభినందించారు. ఐఏఎఫ్ అకాడ‌మీ విదేశీ విద్యార్థుల‌కు సైతం శిక్ష‌ణ అందించ‌డం దేశానికే గ‌ర్వ‌కార‌ణ‌మ‌న్నారు. ఈ సంద‌ర్భంగా భార‌త వైమానిక ద‌ళ చ‌రిత్ర‌ను కేంద్ర మంత్రి ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించారు. 1947-48లో పాకిస్థాన్‌తో జరిగిన యుద్ధంలో ఎయిర్‌ఫోర్స్ కీలక పాత్ర పోషించిందని గుర్తుచేశారు. అలాగే 1971 యుద్ధంలో కేవలం 13 రోజుల్లోనే విజయం సాధించడం భారత వైమానిక దళం గొప్ప‌త‌నాన్ని తెలియ‌జేస్తోంద‌ని కొనియాడారు.

Also Read..

బైక్‌పై ల్యాప్‌టాప్‌తో యువ‌కుడి ప్ర‌యాణం.. తీవ్రంగా స్పందించిన సజ్జ‌నార్‌

రేవంత్ కుట్ర ఫ‌లిత‌మే.. తెలంగాణ‌లో క‌రువు : జీవ‌న్ రెడ్డి

ఎన్‌డీడీబీ ఎగ్జిక్యూటివ్ డైరెక్ట‌ర్‌తో చంద్ర‌శేఖ‌ర్‌రెడ్డి, అమిత్‌రెడ్డి భేటీ

Advertisement
Advertisement